కాలం కార్ఖానా | Sakshi
Sakshi News home page

కాలం కార్ఖానా

Published Mon, Aug 21 2023 12:32 AM

Sakshi Editorial On Time And Human Life Style

కాలం ఒక కార్ఖానా. మనం నేల మీద పడిన క్షణం నుంచి కాలం కార్ఖానాలో మన కోసం ఉత్పత్తి మొదలైపోతుంది. ఆ ఉత్పత్తులలో మనకు కావలసిన రకరకాల ఆహార్యాలు, ఆలోచనలు, రుచులు, అభిరుచులు, అలవాట్లే కాదు; వాటిని నియంత్రించే హద్దులూ ఏర్పడిపోతాయి. పుట్టిన మరుక్షణం నుంచి కాలం మనకు తెలియకుండానే మనతో కలసి నడుస్తుంది, మనల్ని నడుపుతుంది. కానీ మనం ఆ సంగతి గుర్తించం, మనల్ని మనమే నడుపుకుంటున్నామనుకుంటాం.

అంతా మన ప్రయోజకత్వమేననుకుని విర్రవీగుతాం. కాలాన్ని కేలండర్‌గా మార్చి గోడకూ; గడి యారంగా మార్చి మణికట్టుకూ బంధించామనుకుంటాం. కానీ గుప్పిట్లో నీళ్ళు వేళ్ళ సందుల్లోంచి జారిపోయినట్టుగా కాలం కూడా ఏ బంధనాలకూ లొంగకుండా జారుకుంటూనే ఉంటుందన్న వాస్తవం మన తెలివిని నిరంతరం వెక్కిరిస్తూనే ఉంటుంది. 

కాలంలో ఒకానొకనాడు మనిషి నగ్నత్వాన్నే ఒంటికి చుట్టుకున్నాడు. తర్వాత తర్వాత ఒళ్ళంతా వస్త్రంతో కప్పుకోవడమే సంస్కారంగా, నాగరికతగా మారింది. మొన్నటికి మొన్న, తగినంత తిండికీ, చాలినంత ఆచ్ఛాదనకూ నోచుకోని ఈ దేశంలోని కోట్లాది నిరుపేదల బతుకు టద్దంగా మారుతూ మోకాళ్ళు దాటని అంగవస్త్రాన్ని మొలకు చుట్టుకోవడం ఆదర్శం కాదు, అవసరమనుకున్నాడు మహాత్మా గాంధీ.

ఆ తర్వాత స్త్రీ పురుష వస్త్రధారణ అనేకానేక మార్పుల మలుపులు తిరుగుతూ ఒంటినిండా కప్పుకోవడమనేది ‘అనాగరికం’గా మారి గాంధీగారి అంగవస్త్రంలా మోకాళ్ళు దాటని షార్ట్స్‌ ధరించడం అతి నవీనమైన పోకడగా మారింది. కాలం చేసే చిత్రాలు అలా ఉంటాయి. అది మన పట్టు తప్పించుకుంటూ ముందుకే కాదు, వెనక్కీ, పక్కలకీ కూడా పరుగులెడుతూ మనతో ఆడుకోగలదు. 

కాలం అఖండంగా ఉంటూనే నిన్న, నేడు, రేపు రూపంలో ఖండితంగానూ ఉంటుంది. కానీ మన ఊహాపోహలకు, జీవనగమనానికి మేకులు దిగేసి వర్తమానమనే కట్టుకొయ్యకు బంధించి ఉంచుతుంది. కవి ఎంత క్రాంతదర్శి అయినా ఆ మేకుబందీ నుంచి పూర్తిగా తప్పుకోలేడు. రేపటి కాలంలో పోస్ట్‌ మ్యాన్‌ ఆరోవేలుగా మారబోతున్నాడని తెలిసి ఉంటే దేవరకొండ బాలగంగాధర తిలక్‌ ప్రసిద్ధ కవిత ‘తపాలా బంట్రోతు’ ఏ రూపం దిద్దుకొని ఉండేదో! ‘దేశాంతరగతుడైన ప్రియుడి వార్త’ మొబైల్‌ రూపంలో అరచేతి దూరంలో ఉన్న ఈ రోజున, ఏ అమ్మాయీ ‘పద్దెని మిదేళ్ళ పడుచుదనాన్ని భద్రంగా దాచి పళ్లెరంలో పెట్టి ప్రాణనాథుడి కందించా’లనే ఆశతో, ‘చూపులు తుమ్మెద బారులు కట్టి’ పోస్ట్‌ మ్యాన్‌ కోసం ఎదురుచూడాల్సిన అవసరమే లేదు.

చిరునవ్వుతోనే కబురు లేదని చెప్పి వెళ్లిపోతున్న తపాలా బంట్రోతు వెనుక ఆ కళ్ళు ‘విచ్చిన రెండు కల్హార సరస్సులు’ కావలసిన అవసరమూ లేదు. అలాగని ప్రియుడి వార్త కోసం పడుచు దనం పడే ఆరాటం కాలభేదాలకు అతీతంగా నిత్యనూతనమూ అవుతుంది కనుక ఒక అపురూప భావస్పందన కలిగించే కవితగా అది భవిష్యత్తులోకి తన అస్తిత్వాన్ని పొడిగించుకుంటూనే ఉంటుంది. మరోపక్క గతకాలపు చరిత్ర శకలంగానూ మారుతుంది. 

గతంపై మసక తెర కప్పి మాయ చేయడం కాల స్వభావాలలో ఒకటి. మన పాదముద్రలు గతంలోకి వ్యాపించి ఉన్నాయన్న ఎరుక తప్పి, మన నడక వర్తమానంలోనే మొదలైందని అపోహ పడతాం. నేడు మన కళ్ళముందు ఉన్నవే నిత్యాసత్యాలు కావనీ, మొదటి నుంచీ ఈ ప్రపంచం ఇలాగే లేదనీ కొంత తెలిసినా కొంత తెలియనట్టే భ్రమావలయంలో గడుపుతూ ఉంటాం.

ఎన్నో రకాల నియంతృత్వాలను దాటి ప్రజాస్వామ్యంలోకి వచ్చామనీ, అది కూడా ఇంకా ప్రయోగ దశలోనే ఉంది తప్ప పూర్తిగా పాదుకోలేదనీ, నేటి మన అనేకానేక సమస్యలు, సంక్షోభాల మూలాలు గతంలో ఉన్నాయనీ, వాటి పరిష్కారాల వెతుకులాటలో వందలు, వేల సంవత్సరాల గతంలోకి మన చూపుల నిడివి పెంచుకోవాలనే ఊహ రాకుండా మన బుద్ధికి కాలం దడి కడుతుంది. వర్తమానాన్ని ఒక మత్తుమందులా అలవాటు చేస్తుంది. 

ప్రపంచవ్యాప్తంగా వాఙ్మయ పరిణామ క్రమాన్నే కనుక చూస్తే, క్రతు సంబంధమైన తంతు నుంచి మూకాభినయమూ, దాని నుంచి నాట్యమూ, నాట్యం నుంచి నాటకమూ ఎలా అభివృద్ధి చెందాయో; క్రతు సందర్భ గానం నుంచే పాట పుట్టి కావ్యస్థాయికి ఎలా పెరిగిందో; అనేకమంది అజ్ఞాతకర్తలు కలిగిన మౌఖిక సంప్రదాయం నుంచి, ఏక కర్తృకమైన లేఖన సంప్రదాయానికి వాఙ్మయం ఎలా పరివర్తన చెందిందో చెప్పే ఆసక్తికరమైన అధ్యయనాలు ఈరోజున అందు బాటులో ఉన్నాయి.

అయినాసరే, నాట్యం, నాటకం, పాట, పద్యం, వచనపద్యం, గద్యం, కథ, నవల వంటి వివిధ ప్రక్రియలను పరస్పర సంబంధం లేని భిన్న రూపాలుగా విడదీసి చూడడాన్ని కాలం మనకు అలవాటు చేసింది. మౌఖిక సంప్రదాయానికి, అనేక కర్తృకానికి చెందినవాటిని కూడా లిఖిత సంప్రదాయం నుంచీ, ఒక్కరే రచించారన్న భావన నుంచీ చూడడం కూడా కాలం మప్పిన అలవాటే.  

కాలం పోయే చిత్రగతులు మనిషిని మొదటినుంచీ తికమకపెడుతూ ఆలోచనకు లోనుచేస్తూనే ఉన్నాయి. మహాభారత కథకుడు కాలానికి చెప్పిన భాష్యంలో అసాధారణమైన లోచూపు కనిపించి ఆశ్చర్యచకితం చేస్తుంది. భూత, భవిష్యత్, వర్తమానాలకు చెందిన అన్ని భావాలూ కాలనిర్మితాలేనంటాడు. భావాలు మనిషివే కనుక మనిషీ కాలనిర్మితుడే నన్నమాట. కాలం గురించిన తెలివిడితోనే దాని మాయాజాలం నుంచి ఏ కొంచెమైనా తప్పించుకోగలం. 

Advertisement
Advertisement