Nepal Political Crisis: నేపాల్‌ విషాదం

Sakshi Editorial On Nepal Political Crisis And Corona Panademic

ఒకపక్క రాజకీయ అస్థిరతలో, మరోపక్క రోజురోజుకూ పెరుగుతున్న కరోనా మహమ్మారి కేసు లతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపాల్‌ ఇప్పట్లో కుదుటపడే జాడలు కనబడటం లేదు. నాలుగు రోజులక్రితం పార్లమెంటులో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంలో ఓటమి పాలై ప్రధాని పదవికి రాజీనామా చేసిన కేపీ శర్మ ఓలి శుక్రవారం మళ్లీ ఆ పదవిని అధిష్టించటం అక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. నిరుడు డిసెంబర్‌లో పార్లమెంటు దిగువసభను రద్దు చేస్తూ శర్మ నిర్ణయం తీసుకున్ననాటì నుంచి నేపాల్‌ ఇబ్బందుల్లో పడింది. వాస్తవానికి అప్పటికి ప్రతినిధుల సభకు ఇంకా ఏడాది గడువుంది. 275 మంది సభ్యులుండే సభలో అధికార పక్షమైన నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(సీపీఎన్‌)కి 174 మంది మద్దతుంది. అయితే పార్టీలో మరో బలమైన వర్గానికి నాయకుడిగా వున్న మాజీ ప్రధాని ప్రచండతో లోగడ కుదిరిన అవగాహనకు భిన్నంగా శర్మ సమస్త అధికారాలూ గుప్పిట బంధించటంతో ఇద్దరికీ చెడింది. తనను పదవినుంచి దించేందుకు ప్రచండ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి ప్రతినిధుల సభను శర్మ ఓలి హఠాత్తుగా రద్దు చేశారు. 

నేపాల్‌లో కరోనా వైరస్‌ చాలా తీవ్రంగా వుంది. అన్ని జిల్లాల్లో గత రెండు వారాలుగా కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. కరోనా ఉధృతితో మన దేశంలో మళ్లీ  ఆంక్షలు విధించడంతో జడిసిన నేపాల్‌ వలసకూలీలు స్వదేశానికి వెళ్లారు. ఆ తర్వాతే కరోనా మరింత ఉగ్రరూపం దాల్చింది. ఏప్రిల్‌ నెలంతా ఆ దేశంలో వంద కేసులుండగా, ప్రస్తుతం రోజుకు 9,000 కొత్త కేసులు బయటపడుతున్నాయి. వైద్య సదుపాయాలు లేవంటూ రోగులను ఆసుపత్రులు వెనక్కిపంపడం రివాజుగా మారింది. సాధారణ ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు మొదలుకొని ఆక్సిజన్, వెంటిలేటర్‌ వరకూ అన్నిటికీ కొరత వున్నదని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. పర్యవసానంగా ప్రాణాలు కోల్పోతున్న రోగుల సంఖ్య కూడా పెరుగుతున్నది.

అసలు నేపాల్‌లో కరోనా పరీక్షలుగానీ, క్వారంటైన్‌ కేంద్రాల నిర్వహణ గానీ లేదు. నిరుడు కరోనా విజృంభించినప్పుడు సైన్యం సాయం తీసుకున్న ప్రభుత్వం ఈసారి నిమ్మకు నీరెత్తినట్టు వుండిపోయింది. ప్రభుత్వం తన శక్తిసామర్థ్యాలను పూర్తిగా వైద్య రంగంపై కేంద్రీకరించాల్సిన ఈ తరుణంలో నేపాల్‌ రాజకీయ నాయకులు అధికార క్రీడ ప్రారంభించారు. నిరుడు డిసెంబర్‌లో పార్లమెంటు రద్దు చేసినప్పుడే శర్మ ఓలిని అందరూ తప్పుబట్టారు. అప్పటికి కరోనా తీవ్రత తగ్గి కాస్త కుదుటపడుతున్నట్టు కనబడినా, నిర్లిప్తత పనికిరాదని హెచ్చరించారు. పాశ్చాత్య దేశాల్లో ఆ మహమ్మారి విజృంభిస్తున్న తీరును ఎత్తిచూపారు. అయినా అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం పెడచెవిన పెట్టాయి.

శర్మ ఓలిని తప్పిస్తే అన్నీ సర్దు కుంటాయని విపక్షాలూ... వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం దక్కనివ్వరాదని ఆయన పట్టుదల ప్రదర్శించారు. ఈలోగా పార్లమెంటు రద్దు నిర్ణయం నిబంధనలకు విరుద్ధంగా వున్నదని మొన్న ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ప్రతినిధుల సభను పునరుద్ధరించింది. మధ్యంతర ఎన్ని కల్లో విజయం సాధించి, ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించవచ్చని కలలుగన్న శర్మ ఓలి దీంతో కంగు తిన్నారు. పైగా అసలు సీపీఎన్‌(యూఎంఎల్‌), సీపీఎన్‌(మావోయిస్టు సెంటర్‌)లు విలీనమై ఆవిర్భవించిన సీపీఎన్‌ కూడా చెల్లుబాటు కాదని మరో తీర్పులో సుప్రీంకోర్టు తెలిపింది. ఉమ్మడిగా వున్నప్పుడే అంతర్గత కలహాలతో సతమతమైన పార్టీ రెండుగా విడిపోయాక మాత్రం సమష్టిగా ఏం పనిచేస్తుంది? పర్యవసానంగా శర్మ ఓలి సర్కారు ఓడిపోయింది. మూడు రోజుల్లో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ దేశ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ విపక్షాలను కోరినా ఆ అవకాశాన్ని అవి అందిపుచ్చుకోలేకపోయాయి. పర్యవసానంగానే మళ్లీ శర్మ ఓలియే ప్రధాని పదవి అధిష్టించారు. కానీ నెలరోజుల్లో ఆయన తన బలనిరూపణ చేసుకోవాలన్న షరతు వుండనే వుంది. అది ఎటూ సాధ్యం కాదు గనుక నేపాల్‌లో ఎన్నికలు తప్పకపోవచ్చు. 

మన దేశం ఇంతవరకూ ఇచ్చిన 20 లక్షల వ్యాక్సిన్లు మినహా ఇతరత్రా టీకాల లభ్యత లేకపోవడం, స్థానికంగా వుండే ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చడానికి కావాలనే ప్రభుత్వం టీకాల కొరత సృష్టించిందని విమర్శలు రావడం నేపాల్‌లో నెలకొన్న అమానవీయ స్థితికి అద్దంపడుతుంది. దక్షిణాసియాలో వేరే దేశాలతో పోలిస్తే దారుణమైన పేదరికంలో మగ్గుతున్న నేపాల్‌ ఇంతటి మహావిపత్తులో చిక్కుకోగా ఒక్కటంటే ఒక్క పార్టీ కూడా అందుకు తగినట్టు స్పందించాలన్న ఇంగిత జ్ఞానాన్ని ప్రదర్శించలేకపోయాయి. ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఎలాంటి చర్యలు అవసర మన్న అంశాన్ని గాలికొదిలి రాజకీయ ఎత్తుగడల్లోనే అవి పొద్దుపుచ్చాయి.

ఇప్పుడు మళ్లీ ప్రభు త్వాన్ని ఏర్పాటు చేసిన శర్మ ఓలి ఏదో ఒరగబెడతారన్న భ్రమలు ఎవరికీ లేవు. కరోనా రానీయ కుండా కట్టడి చేయడానికి ప్రతి ఇంటి గుమ్మానికి జామ ఆకులు కట్టమని రెండు నెలల క్రితం పిలుపు నిచ్చి ఆయన నవ్వులపాలయ్యాడు. కాస్త హెచ్చుతగ్గులుండొచ్చుగానీ... వర్ధమాన దేశాల్లో చాలా చోట్ల నేపాల్‌ మాదిరే ప్రజాస్వామ్య వ్యవస్థలు నిరర్థక వేదికలుగా మారాయి. జవాబుదారీతనానికి తిలోదకాలిస్తున్నాయి. అంతా సజావుగా సాగినప్పుడు తమ ఘనతేనని చెప్పుకునే అధినేతలు, సంక్షోభం చుట్టుముట్టాక ప్రజలపైనో, ప్రకృతిపైనో నెపం వేసి చేతులు దులుపుకుంటున్నారు. దీన్నుంచి సాధ్యమైనంత త్వరగా నేపాల్‌ ప్రజలు బయటపడాలని ఆకాంక్షించడం మినహా ఎవరూ చేయగలిగింది లేదు.  

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top