ప్రాణాంతక పర్యాటకం

Sakshi Editorial On Nepal plane crash

దారుణం... అందరినీ కన్నీరు పెట్టించిన అనూహ్య ప్రమాదం. సంక్రాంతి పూట ఆదివారం ఉదయం హఠాత్తుగా జరిగిన నేపాల్‌ విమాన ప్రమాదఘటన తీవ్రత అలాంటిది. ఆ హిమాలయ దేశంలోని రెండో అతి పెద్ద దేశీయ విమానయాన సంస్థ యతీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండింజన్ల ఏఆర్టీ–72 విమానం ప్రమాదానికి గురై, అయిదుగురు భారతీయులతో సహా అందులోని 72 మందీ ప్రాణాలు కోల్పోయారు. కాఠ్మండూకు పశ్చిమాన 125 కి.మీ.ల దూరంలో, పోఖరాలో కాసేపట్లో దిగాల్సిన విమానం వాతావరణం బాగున్నా ఇరుకు కొండమార్గంలో కూలిపోవడం దురదృష్టకరం. 

నేపాల్‌లో గత మూడు దశాబ్దాల్లో అతి పెద్ద విమాన దుర్ఘటన ఇదేనట. వరుస ప్రమాదాలతో అపకీర్తిని మూటగట్టుకున్న నేపాల్‌ నిద్ర మేల్కొని నిర్లక్ష్యం వీడాలని ఇది గుర్తుచేస్తోంది. టేకాఫైన 20 నిమిషాల్లో అంతా అయిపోయింది. అప్పటి దాకా నవ్వుతూ, తుళ్ళుతూ సాగిన ప్రయాణం రెప్ప పాటున ఎగసిన అగ్నికీలల్లో ఆర్తనాదాల మధ్య దుఃఖభరితం కావడం దిగ్భ్రాంతికరం. విమానం కిందకు దిగుతున్న వేళ ప్రయాణికులు కొందరు ఫేస్‌బుక్‌ లైవ్‌ చేస్తుండడంతో యాదృచ్ఛికంగా ఈ ప్రమాద ఘటన దృశ్యాలు ప్రత్యక్షంగా సోషల్‌ మీడియాకు చిక్కాయి. విమానంలోని బ్లాక్‌ బాక్స్‌ దొరికింది గనక, దాని సమాచార విశ్లేషణతో ప్రమాద కారణాలు త్వరలోనే బయటపడవచ్చు. 

మూడు దశాబ్దాల క్రితం 1992లో పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ) విమానం కాఠ్మండు విమానాశ్రయానికి వస్తూ, ఘోర ప్రమాదానికి గురై 167 మంది ప్రాణాలను బలి తీసుకుంది. నేపాలీ విమానయాన చరిత్రలో ఆ పీఐఏ ప్రమాదం అతి పెద్దది. ఆ తర్వాత ఈ హిమాలయ ప్రాంతంలో అనేక విమాన ప్రమాదాలు జరిగినా, ప్రాణనష్టం, తీవ్రతల్లో తాజా ఘటన మళ్ళీ ఆ గత చరిత్రను గుర్తు చేసింది. నిజానికి, ఇలాంటి విషాదాలు నేపాల్‌కు కొత్త కావు. ఎనిమిది నెలల క్రితమే నిరుడు మే నెలలో తారా విమానం కూలి, 22 మంది మరణించారు. 2000 నుంచి చూస్తే 22 ఏళ్ళలో నేపాల్‌లో 18 విమాన ప్రమాదాలు జరిగాయి. 350కి పైగా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 

ఈ పర్వత ప్రాంత దేశంలో మారుమూల ప్రాంతాలు, సంక్లిష్టమైన రన్‌వేలు, ఆ పక్కనే ఎల్తైన కొండలు, ఇరుకైన కొండ మలుపుల లాంటివి అనేకం. కొమ్ములు తిరిగిన పైలట్లకూ అక్కడ విమానాలు నడపడం సవాలే. ప్రపంచంలోని అతి ఎల్తైన 14 పర్వత శిఖరాల్లో 7 నేపాల్‌లోనే ఉన్నాయి. పర్వతారోహకులకు సవాలు విసిరే ప్రసిద్ధ ఎవరెస్ట్‌ సైతం ఈ చిన్న హిమాలయ దేశంలోనే నెలకొంది. ఎల్తైన పర్వతశిఖరాలకు తోడు అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు సరేసరి. కొన్నేళ్ళుగా నేపాల్‌లో జరిగినన్ని విమాన ప్రమాదాలు మరెక్కడా జరగలేదంటే ఇవే కారణం. 

పర్వత ప్రాంత నేపాలీ పర్యాటకమే ఆకర్షణగా విదేశీ పర్వతారోహకుల తాకిడి కొన్నేళ్ళుగా బాగా పెరిగింది. ఫలితంగా, ఆ దేశంలోని సంక్లిష్ట ప్రాంతాలకు సైతం సరకులనూ, మనుషులనూ తీసుకెళ్ళే విమాన రంగం కొన్నేళ్ళుగా విస్తరించింది. అదే సమయంలో ఎవరెస్ట్‌ బేస్‌క్యాంప్‌ వద్ద లూక్లాలోని టెన్సింగ్‌– హిల్లరీ ఎయిర్‌పోర్ట్‌ ప్రపంచంలోకెల్లా ప్రమాదభరితమైన వాటిలో ఒకటైంది. 1960 నుంచి 2019 ఏప్రిల్‌ వరకు జరిగిన ప్రమాదాలు, ప్రాణనష్టాల లెక్క చూస్తే లూక్లా, జామ్‌సమ్, సిమీకోట్, జుమ్లా, దోల్పాలు నేపాల్‌లో ప్రమాద భూయిష్ఠమైనవని తేల్చారు.

పైపెచ్చు, నిర్వహణ లోపాలు, తగినంత శిక్షణ లేకపోవడం, ప్రమాణాలు పాటించకపోవడం, అలసిసొలసిన పైలట్లు – ఇలా అనేకం ఆ దేశ విమానయాన రంగాన్ని పట్టిపీడిస్తున్నాయి. వీటి నుంచి నేపాల్‌ పాఠాలు నేర్చుకున్నట్టు లేదు. చివరకు యూరోపియన్‌ యూనియన్‌ సైతం భద్రతా కారణాల రీత్యా నేపాలీ విమానసర్వీసుల్ని నిషేధించాయంటే అర్థం చేసుకోవచ్చు.

వాతావరణ వైవిధ్యం, సంక్లిష్ట భౌగోళిక ప్రాంతమనేవి నేపాల్‌లో విమానయానానికి సవాళ్ళనీ, చిన్న విమానాలు తరచూ ప్రమాదాల పాలవుతున్నది అందుకేననీ నేపాల్‌ పౌర విమానయాన ప్రాధి కార సంస్థ 2019లోనే తన నివేదికలో పేర్కొంది. అయితే, పరిష్కారానికి చేసిన ప్రయత్నాలే పెద్దగా లేవు. వరుస విమాన ప్రమాదాల పాపం నేపాల్‌ పాలకులదనేది అందుకే! ప్రమాదాలు జరిగిన ప్రతిసారీ దర్యాప్తులు చేస్తూనే ఉన్నారు. దర్యాప్తు సంఘాలు నివేదికలు ఇస్తూనే ఉన్నాయి. కానీ, ఆ నివేదికల్లోని సిఫార్సుల అమలు శూన్యం. అందుకే, ప్రమాదాలు, ప్రాణనష్టం ఆగడమే లేదు.  

తాజా ఘటనాస్థలమైన పోఖరా విమానాశ్రయ ప్రాంతం ప్రమాదభరితమే. నేపాల్‌ను చంక నెట్టుకోవాలని చైనా చేస్తున్న దోస్తీ భారత్‌కు మరింత ప్రమాదభరితం. చైనాతో ఒప్పందంతో ఏడేళ్ళలో ఈ ఎయిర్‌పోర్ట్‌ వచ్చింది. బీజింగ్‌ ఒత్తిడితో, నిపుణుల మాట తోసిపుచ్చి, సర్వసన్నద్ధం కాకుండానే ఈ ఎయిర్‌పోర్ట్‌ను ఇటీవలే ప్రారంభించారు. హిమాలయ శ్రేణుల్లో భారత్‌ను ఇరుకున పెట్టాలన్నది డ్రాగన్‌ వ్యూహం కాగా, ప్రయాణికుల ప్రాణాల కన్నా పర్యాటకమే ముఖ్యమన్నట్టు నేపాల్‌ ముందుకు సాగడం దుస్సహం. షార్ట్‌ టేకాఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌ (స్టోల్‌) విమానాలతో పర్యాటక వాణిజ్య లబ్ధికై విజువల్‌ ఫ్లైట్‌ నిబంధనల్ని కూడా ఆ దేశం గాలికొదిలేస్తోంది. 

గత పదేళ్ళలో జరిగిన 19 ప్రమాదాల్లో 16 ఘటనలు స్టోల్‌ విమానాలవే గనక, భారత్‌ మన పర్యాటకుల్ని అప్రమత్తం చేయాలి. ప్రాణాలకు పూచీపడని పొరుగు దేశంపై ఒత్తిడి తేవాలి. అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థ సైతం తన 193 సభ్య దేశాల్లో ఒకటైన నేపాల్‌ తన వైమానిక భద్రత పెంచుకొనేలా కట్టుదిట్టం చేయాలి. నివేదికల్ని బుట్టదాఖలు చేస్తున్న నేపాలీ పాలకులు తక్షణమే పూర్తిస్థాయి భద్రతే లక్ష్యంగా కఠినచర్యలు చేపట్టకపోతే మరిన్ని ప్రాణాలకు ప్రమాదం! 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top