
అంతటా ఒక అనిశ్చితి, దాన్ని మించిన సందిగ్ధత అలముకున్నవేళ నిశ్చయంగా, నిర్భయంగా వినబడిన గొంతు ఇప్పుడు అమెరికాలో సర్వత్రా ప్రతిధ్వనిస్తోంది. ఆ గొంతు ప్రపంచంలోనే అత్యుత్తమశ్రేణి విద్యాసంస్థల్లో ఒకటైన హార్వర్డ్ విశ్వవిద్యాలయానిది. ఆ విశ్వవిద్యాలయం ఇంతవరకూ లక్షలాది విద్యార్థులకు పాఠం చెప్పివుండొచ్చు. కానీ తనతో ఏకీభవించనివారిని ససేమిరా సహించని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వంటి నేతకు పాఠం నేర్పాలని చూస్తే భారీ మూల్యం చెల్లించాల్సివుంటుంది.
అది తెలిసి కూడా హార్వర్డ్ దృఢంగా నిలబడటం ఈ కాలంలో అతి పెద్ద వార్త. పాలస్తీనా అనుకూల ఉద్యమకారుల్ని పట్టించి ఇవ్వాలనీ... వైవిధ్యత, సమానత, సమ్మిళిత (డీఈఐ) విధానాల ద్వారా ‘అందరికీ అవకాశాలిచ్చే’ పేరిట ప్రతిభపై వివక్ష ప్రదర్శిస్తున్న వైఖరి విడనాడాలనీ ట్రంప్ కొంతకాలంగా హెచ్చరిస్తున్నారు. ఒప్పుకోకుంటే నిధులు ఆపేస్తామని హుకుం జారీచేశారు. దేశంలోని 60 ప్రధాన విశ్వవిద్యాలయాల్లో చాలా భాగం ఆయన ఆదేశాలకు తలొంచాయి. కానీ హార్వర్డ్ నిర్భయంగా నిలబడింది.
‘మా వ్యవహారాల్లో మీకేం పన’ని ఎదురు ప్రశ్నించింది. వర్త మాన పరిస్థితుల్లో ఈ చర్య చిన్నదేం కాదు. మొన్న జనవరిలో అధికార పగ్గాలు చేపట్టింది మొదలు ట్రంప్ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. కోర్టులనే ధిక్కరిస్తున్నారు. అక్రమ వలసదారుగా పొర బడి, ఒక పౌరుడిని ఎల్‌సాల్వెడార్ జైలుకు పంపిన వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. పొరబడ్డా మని ఒప్పుకుంటూనే అతన్ని వెనక్కితేలేమని కోర్టులో ప్రభుత్వం మొండికేసింది. ఆరు నూరైనా తేవాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించగా మౌనమే జవాబైంది. మర్నాడు అమెరికా సందర్శించిన ఎల్‌సాల్వెడార్ అధ్యక్షుడు ‘అతన్ని అప్పగించేది లేద’ంటూ సాక్షాత్తూ వైట్‌హౌస్‌లో ప్రకటించారు.
విశ్వవిద్యాలయాలు కళాశాలల కన్నా భిన్నమైనవి. అవి ప్రశ్నించడాన్ని ప్రోత్సహిస్తాయి. కొత్త ఆలోచనల్ని స్వాగతిస్తాయి. భిన్న ధోరణులపై పరిశోధనకు అవకాశమిస్తాయి. అందుకే అవి జ్ఞానకేంద్రాలు. ఎంతమందికి పట్టాలు పంపిణీ చేశామన్నది కాక, ఎటువంటి విశిష్ట వ్యక్తులను సమాజానికి అందించగలిగామన్నది లెక్కేస్తాయి. రెండో ప్రపంచ యుద్ధానంతరం అమెరికా సర్కారు విశ్వ విద్యాలయ పరిశోధనలకూ, సృజనాత్మక ఆవిష్కరణలకూ భారీయెత్తున ఖర్చుచేసింది.
ఫలితంగా అపారసంఖ్యలో ఆవిష్కరణలు సాధ్యమయ్యాయి. అనేక కొత్త ఉపకరణాలు అందుబాటులో కొచ్చాయి. చికిత్సకు లొంగని ఎన్నో వ్యాధులు చిత్తగించాయి. ఆయుఃప్రమాణం పెరిగింది. కంప్యూ టర్లు మొదలుకొని రోబోటిక్స్, కృత్రిమ మేధ వరకూ అన్నిటికన్నీ కేవలం ఈ పరిశోధనల పర్యవసానమే. లైబ్రరీలు, లేబొరేటరీలు దాటుకుని పరిశ్రమల్లో పురుడు పోసుకున్న ఉత్పత్తులు ఎన్నెన్నో! వాటివల్ల అసంఖ్యాకంగా ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి.
పర్యవసానంగా ఇదంతా సమాజ ఆధునికతకు తోడ్పడింది. గత నెలలో విడుదలైన ఒక నివేదిక ప్రకారం జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్‌ఐహెచ్) నిరుడు పరిశోధనలకు వ్యయం చేసిన 3,690 కోట్ల డాలర్ల సొమ్ము 9,450 కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక కార్యకలాపాలకు తోడ్పడింది. సరుకుల తయారీ, పంపిణీ, వినియోగం, ఇతర అనుబంధ సర్వీసులు ఈ కార్యకలాపాల్లో భాగం. 4,08,000 ఉద్యోగాల కల్పన సాధ్యమైంది.
కానీ ట్రంప్ సర్కారు దీన్ని అంగీకరించటం లేదు. అవి ఏం చేయాలో, చేయకూడదో నిర్దేశిస్తున్నారు. సాష్టాంగపడమంటున్నారు. అందుకు సిద్ధపడినా కనికరించటంలేదు. పేరుప్రఖ్యాతులున్న కొలంబియా విశ్వవిద్యాలయ దుఃస్థితే అందుకు ఉదాహరణ. ఆ క్యాంపస్‌లో కొంతకాలం క్రితం జరిగిన పాలస్తీనా అనుకూల ప్రదర్శనల్లో పాల్గొన్న విద్యార్థులను గుర్తించి, వారి అరెస్టుకు సహకరించాలనటంతో మొదలుపెట్టి ప్రభుత్వం అనేక డిమాండ్లు పెట్టింది.
మూడు డజన్లమంది ‘ప్రత్యేక అధికారుల’ను తక్షణం నియమించడం అందులో ఒకటి. ఆ ప్రత్యేకాధికారులకు పాలస్తీనా అను కూల విద్యార్థులను గుర్తించి అవసరమైనప్పుడు అరెస్టుచేసే అధికారాలున్నాయి. విశ్వవిద్యాలయంలో ప్రాంతీయ అధ్యయనాల విభాగాన్ని పర్యవేక్షించే అధిపతిని నియమించాలన్న ప్రభుత్వ తాఖీ దును సైతం ఆమోదించింది. ఆ విభాగం సిలబస్‌ను నిశితంగా పరిశీలించి మార్పులు చేర్పులూ సూచిస్తుంది.
ఇన్ని చేసినా ఆ విశ్వవిద్యాలయానికి విడుదల చేయాల్సిన 40 కోట్ల డాలర్ల నిధులనూ నిలిపివేసింది. విశ్వవిద్యాలయ తాత్కాలిక అధ్యక్షురాలు కత్రినా ఆర్మ్‌స్ట్రాంగ్ ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. తాను తీసుకుంటున్న చర్యలను నిరసించిన విశ్వ విద్యాలయ ఆచార్యులకు ఇవి చిన్న చిన్న సర్దుబాట్లు మాత్రమేనని కత్రినా వివరించారు. అయినా నిధుల విడుదల జాడ లేకపోవటంతో కొలంబియా యాజమాన్యం ఆమెకు ఉద్వాసన పలికింది.
హార్వర్డ్ విశ్వవిద్యాలయం సంగతికే వస్తే, తిరుగుబాటుకు తక్షణ మూల్యం 220 కోట్ల డాలర్ల గ్రాంటు, 6 కోట్ల డాలర్ల కాంట్రాక్టులు నిలిచిపోవటం. ఇవిగాక పన్ను మినహాయింపులు కూడా ఆపేస్తామని సర్కారు బెదిరిస్తోంది. నిజానికి మొదటే ప్రధాన యూనివర్సిటీలన్నీ ప్రభుత్వ బెదిరింపులను ముక్తకంఠంతో నిరసించాల్సింది. కానీ ఇప్పటికి కూడా ఎవరికి వారు ట్రంప్ కంట్లో పడకుంటే చాలన్నట్టు ప్రవర్తిస్తున్నారు.
ఇప్పటికీ చాలా సంస్థలు గోడమీది పిల్లివాటంగా ఉంటున్నాయి. విశ్వవిద్యాలయాలపై సర్కారువారి సంపూర్ణ పెత్తనాన్ని అంగీకరించాలన్నది ట్రంప్ ఆంతర్యం. యూదు వ్యతిరేకత, వివక్ష విధానాల అమలు వంటి ఆరోపణలన్నీ పైకి చెబుతున్న కారణాలు. దీన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అమెరికా విశ్వవిద్యాలయాలకు అంత మంచిది. ఇన్నాళ్లూ తాము బోధించిన విలువల కోసం నిలబడితేనే వాటి గౌరవమర్యాదలు కాస్తయినా నిలబడతాయి.