ఈ మరక పోయేదెలా? | Justice Yashwant Varma submitted his resignation to President Droupadi Murmu | Sakshi
Sakshi News home page

ఈ మరక పోయేదెలా?

Apr 11 2026 2:33 AM | Updated on Apr 11 2026 4:12 AM

Justice Yashwant Varma submitted his resignation to President Droupadi Murmu

నిరుడు మార్చిలో కోట్లాది రూపాయల కరెన్సీ కట్టలు తగలబడిన ఉదంతంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని, అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీపై వెళ్లిన ఢిల్లీ హైకోర్టు అప్పటి న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ శుక్రవారం ఎట్టకేలకు పదవి నుంచి తప్పుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ రాజీనామాను ఆమోదిస్తే జస్టిస్‌ వర్మకు రిటైర్మెంట్‌ ప్రయోజ నాలు, పెన్షన్‌ యథావిధిగా వస్తాయి. 

ఈ ఉదంతం జరిగినప్పటి నుంచీ ఆయన వితండ వాదం చేశారు. కరెన్సీ కట్టలు కాలిన ఉదంతం జరిగింది న్యాయమూర్తుల నివాసప్రాంగణంలోని తన ఇంటికి వెలుపలవున్న స్టోర్‌ రూంలోననీ, అందరూ వచ్చిపోయే చోట ఉన్న సొమ్ము తనదేనని ఎలా చెబుతారనీ ప్రశ్నించారు. రాజీనామా చేసి నిష్క్రమించటం ఉత్తమమని సహచర న్యాయమూర్తులు చెప్పినా ఆయన అంగీకరించలేదు. అభిశంసన వరకూ వెళ్తే ఆయనతోపాటు మొత్తం న్యాయవ్యవస్థపైనే చర్చ జరుగుతుందనీ, ఇది వ్యవస్థ గౌరవ ప్రతిష్ఠలపై ప్రభావం చూపుతుందనీ చెప్పినా ఆయన తలకెక్కలేదు. పార్లమెంటులో అభిశంసన ప్రక్రియ మొదలైన దశలో జస్టిస్‌ వర్మ రాజీనామా చేశారు. 

ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలనదగ్గ మూడు వ్యవస్థలు – కార్యనిర్వాహకవర్గం, శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థలు సమానమైనవని చెబుతారు. కానీ మన రాజ్యాంగం న్యాయవ్యవస్థకు మాత్రమే ఆ మూడింటి పరిధులనూ నిర్ణయించగల అధికారాన్నిచ్చింది. తనకు దఖలుపరిచిన బరువుబాధ్యతలకు తగ్గట్టుగా న్యాయవ్యవస్థ ఉండటంలేదన్న విమర్శలు, ఆరోపణలు చాన్నాళ్ల నుంచి ఉన్నాయి. అవి కేవలం బయటి నుంచి మాత్రమే కాదు... లోపలి నుంచీ వస్తున్నాయి. 

మొన్న ఫిబ్రవరి నెలాఖరున లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ జవాబిస్తూ గత పదేళ్ల కాలంలో సిట్టింగ్‌ జడ్జీలపై సుప్రీంకోర్టుకు 8,630 ఫిర్యాదులందాయని తెలిపింది. కానీ అతి స్వల్ప కేసుల్లో మాత్రమే అంతర్గత కమిటీల ద్వారా విచారణలు జరిగాయి. తీవ్ర ఆరోపణలొచ్చిన కేసుల్లో అనేకం కనీసం నామమాత్ర విచారణ వరకూ పోలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆరేళ్ల క్రితం కోర్టు ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా అప్పటి అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్, న్యాయవ్యవస్థలోని అవినీతిపై గతంలో తొమ్మిదిమంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాట్లాడారనీ, వారిలో సర్వీసులో ఉండగా మాట్లాడినవారు ఇద్దరనీ ధర్మాసనానికి చెప్పారు. 

డబ్బు తీసుకోవటం ఒక్కటే అవినీతి అనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ ఆశ్రిత పక్షపాతం, హోదా దుర్వినియోగం, విచక్షణాయుత అధికారాన్ని స్వప్రయో జనాలకు వినియోగించుకోవటం వగైరాలు సైతం దాని కిందికే వస్తాయి. రైతులకు రావాల్సిన బ్యాంకు రుణాలను ఒక చక్కెర కర్మాగారం దారిమళ్లించి సొంతానికి వాడు కున్న కేసులో 2010లో సీబీఐ దర్యాప్తు చేసి ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసినప్పుడు అందులో జస్టిస్‌ వర్మ ఆ సంస్థ నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పదో నిందితుడిగా ఉన్నారు. తర్వాత కాలంలో ఆ కేసు ముందుకు సాగలేదు. ఆయనపైనా చర్యలు లేకుండా పోయాయి. ఇటీవల అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శేఖర్‌ కుమార్‌ విశ్వహిందూ పరిషత్‌ సదస్సుకు పోయి మతతత్వ వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలనీ, వివరణ ఇవ్వాలనీ సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానించింది.

కానీ అవేమీ జరగలేదు. గతంలో అరడజను మంది న్యాయమూర్తులపై ఆరోపణ లొచ్చాయి. వారిలో ఒకరిద్దరిపై అభిశంసన వరకూ వెళ్లింది. విధాన సంబంధమైనసంక్లిష్టతల వల్ల ఆ ప్రక్రియ వీగిపోయింది. కొందరు తమంత తామే రాజీనామా చేసి వెళ్లటంతో నిలిచిపోయాయి. ఇలాంటి ఉదంతాలన్నీ న్యాయవ్యవస్థ పనితీరును ప్రశ్నార్థకం చేస్తాయి. తీర్పునిచ్చే స్థానంలో ఉండటం వల్ల న్యాయమూర్తులపై దురుద్దేశంతో ఆరోపణలు చేసేవారు కూడా ఉంటారు. ఆ బెడద నుంచి వారిని కాపాడటానికి కట్టుదిట్టమైన చట్టాలు అవసరమే. కానీ అవినీతిపరులకు అవి కవచంగా ఉపయోగపడే పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఫిర్యాదులను స్వీకరించి, దర్యాప్తు చేయించి నిజా నిజాలను నిర్ధారించటానికి సర్వస్వతంత్రమైన వ్యవస్థ ఒకటి అవసరం. ఆ దిశగా ప్రయత్నిస్తేనే అవినీతి జాడ్యం అంతమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement