ఈ లెక్క సరైనదేనా? | Jammu Kashmir Voters Register Amendment Issue | Sakshi
Sakshi News home page

ఈ లెక్క సరైనదేనా?

Published Tue, Aug 23 2022 12:59 AM | Last Updated on Tue, Aug 23 2022 1:25 AM

Jammu Kashmir Voters Register Amendment Issue - Sakshi

వివాదం ముందు పుట్టి కశ్మీర్‌ తర్వాత పుట్టిందంటే అతిశయోక్తి కాదేమో! స్వతంత్ర భారతదేశంలో విలీనం దగ్గర నుంచి ఇవాళ్టి దాకా జమ్మూ – కశ్మీర్‌ను చుట్టుముట్టినన్ని వివాదాల కథ అలాంటిది మరి. జమ్మూ – కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే 370వ అధికరణం రద్దు తర్వాత గత మూడేళ్ళలోనూ ఇదే వరుస. ఓటర్ల జాబితా సవరణ అంశం ఆ జాబితాలో తాజాగా వచ్చి చేరింది. దేశంలోని ఈ అతి పిన్న వయసు కేంద్ర పాలిత ప్రాంతంలో ‘సాధారణంగా నివసిస్తున్నవారు’ సైతం ఓటర్లుగా నమోదు చేయించుకోవచ్చంటూ జమ్మూ – కశ్మీర్‌ ఎన్నికల ప్రధానాధికారి ఆగస్ట్‌ 17న ప్రకటించారు. బీజేపీ మినహా అక్కడి రాజకీయ పార్టీలన్నీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాజా అనుమతితో గేట్లు ఎత్తేసినట్టేననీ, చివరకు స్థానిక ప్రజలు ఎన్నికల మైనారిటీగా మారిపోతారనీ రచ్చ రేగుతోంది. 

మునుపటి జమ్మూ– కశ్మీర్‌ రాష్ట్రంలో శాశ్వతవాసులే ఓటర్లుగా అర్హులు. అలా కానివారు సైతం ఇప్పుడు ఓటు వేయడానికి అర్హులే అన్నది ఎన్నికల ప్రధానాధికారి మాట. ఆర్టికల్‌ 370 రద్దుతో 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టం అందుకు అవకాశమిస్తోందనేది ప్రాతిపదిక. దీని వల్ల జమ్మూ – కశ్మీర్‌ తుది ఓటర్ల జాబితాలో 20 – 25 లక్షల మంది ఓటర్లు కొత్తగా చేరతారని అంచనా. అలాగే, ఆ ప్రాంతంలో నియుక్తులైన దాదాపు 7 లక్షల భద్రతా దళ సిబ్బందీ ఓటర్లుగా నమోదు చేసుకొని, సరి కొత్త కేంద్రపాలిత ప్రాంతపు తొలి అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనవచ్చు. ఈ వైఖరే ఇప్పుడు స్థానిక ప్రధాన పార్టీల్లో అనేక అనుమానాలకు దారి తీస్తోంది. ఇది స్థానికేతరుల్ని ఓటర్లుగా చేర్చి, వారికి ఓటుహక్కు కల్పించే పన్నాగమనీ, స్థానికులు మైనారిటీగా మారిపోతారనీ, ఎన్నికల్లో వారి ప్రాధా న్యం తగ్గిపోతుందనీ నేషనల్‌ కాన్ఫరెన్స్, పీపుల్స్‌ డెమోక్రాటిక్‌ పార్టీ, సీపీఎం వగైరాల ఆరోపణ.

దాదాపు దశాబ్ద కాలం తర్వాత తొలిసారిగా ఎన్నికల దిశగా వెళుతున్న కశ్మీర్‌లో 2019 ఆగస్ట్‌ 5న ఆర్టికల్‌ 370 రద్దుతో ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించడమే పెను వివాదమైంది. ఆ పైన ప్రధాన పార్టీల నేతల్ని నిర్బంధంలో ఉంచడం మరో వివాదం. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియపైనా ఆరోపణలొచ్చాయి. ఏడు అసెంబ్లీ స్థానాలు సృష్టిస్తే, 6 జమ్మూకు, ఒకటే కశ్మీర్‌కు దక్కాయి. ముస్లిమ్‌ల మెజారిటీ ఉన్న కశ్మీర్‌ను తగ్గించి, హిందూ మెజారిటీ జమ్మూకు రాజకీయ ప్రాధాన్యం దక్కేలా ఈ ప్రక్రియ సాగిందనే విమర్శ ఎదురైంది. తీరా ఎన్నికలకు వెళ్ళే ముందు ఆఖరు పనిగా 25 లక్షల మంది కొత్త ఓటర్లను చేర్చుకొనే తాజా ప్రతిపాదన అగ్నికి ఆజ్యం పోసింది. అయితే, ఈ కొత్త ఓటర్లలో అధిక శాతం మంది మునుపటి ఓటర్ల జాబితా సవరణ తర్వాత 18 ఏళ్ళు నిండినవారన్నది కశ్మీర్‌ ఎన్నికల యంత్రాంగం చెబుతున్న వివరణ. ఆ మాటతో స్థానిక పార్టీలు ఏకీభవించడం లేదు. 

1987 నాటి తప్పులడక కశ్మీర్‌ ఎన్నికల లానే, ఇప్పుడీ తాజా నిర్ణయం తీసుకున్నారని పోలికలు తెస్తున్నాయి. అప్పట్లో అలా తప్పుదోవలో ఎన్నికల వల్లే, ఆ వెంటనే 1990లలో కశ్మీర్‌లో తీవ్రవాదం చెలరేగిందని పార్టీల వాదన. ఇప్పటికీ ఆ దెబ్బ నుంచి కశ్మీర్‌ కోలుకోలేదు. మళ్ళీ అదే 1987 నాటి వ్యవహారశైలిలో వెళితే ఉపద్రవమే అని హెచ్చరిస్తున్నాయి. యువతలో నిరుద్యోగం, స్థానికంగా పెరుగుతున్న అశాంతి సహా కశ్మీర్‌లో అనేక సమస్యలున్నాయి. 20 – 29 ఏళ్ళ మధ్య వయస్కుల్లో 55 శాతం మంది నిరుద్యోగులే. జాతీయ సగటుతో పోలిస్తే ఇది రెట్టింపు. నిరుద్యోగ యువతకు ఆర్థిక అవకాశాల కల్పన, కశ్మీర్‌ను మళ్ళీ పర్యాటక స్వర్గంగా మార్చడం లాంటి అనేక సవాళ్ళు రానున్న సర్కారుకున్నాయి. వీటన్నిటినీ పరిష్కరించడానికి ప్రజాస్వామ్యబద్ధ ప్రభుత్వం కావాలి. 

కశ్మీర్‌ ఎన్నికల నిర్వహణ ఓ బృహత్తర కార్యం అంటున్నది అందుకే! ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం నిష్పాక్షిక అంపైర్‌లా వ్యవహరించడమే కాదు... కనిపించాలి, అందరికీ అనిపించాలి కూడా! ప్రస్తుతం ప్రత్యేక ప్రతిపత్తి లేనందు వల్ల దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లానే జమ్మూ– కశ్మీర్‌లోనూ మామూలుగా నివసిస్తున్న వారందరికీ ఓటు హక్కునివ్వడం సరైన చర్యే కావచ్చు. అక్కడ సాధారణ పరిస్థితులు తీసుకురావడానికే ఈ చర్యలనీ చెప్పవచ్చు. అయితే, ఆలోచనతో పాటు ఆచరణలోనూ చిత్తశుద్ధి, ముందు జాగ్రత్త అవసరం. కశ్మీర్‌లో రాజకీయ ప్రక్రియకు ఊతమివ్వడానికే ఈ ఓటర్ల జాబితా సవరణ అనుకున్నా, అందుకు సంబంధిత వర్గాలన్నిటినీ ఒప్పించి, ఒక్క తాటి పైకి రప్పించడం కీలకం. రేపు ఎన్నికల ఫలితాలకు జనామోదం ఉండాలంటే, సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలంటే, శాంతి నెలకొనాలంటే అది తప్పనిసరి. 

2014 తర్వాత ఎన్నికలే జరగని కశ్మీర్‌ మెరుగైన ప్రాథమిక వసతులు, జీవన ప్రమాణాల కోసం ఎదురు చూస్తోంది. రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించాలని స్థానిక ప్రజల, పార్టీల దీర్ఘకాలిక డిమాండ్‌. కేంద్రం సైతం కశ్మీర్‌ను మళ్ళీ పట్టాలెక్కించేందుకు కంకణబద్ధులమై ఉన్నామంటూ పార్లమెంట్‌లో చాలాకాలం క్రితమే రోడ్‌ మ్యాప్‌ ప్రకటించింది. అపనమ్మకాన్ని పోగొట్టి, ఆ మార్గాన్ని సుగమం చేయడం అటు కేంద్రం, ఇటు ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా పారదర్శకంగా ఉండాలి. స్థానిక ప్రజల, పార్టీల అనుమానాలన్నిటినీ ముందే నివృత్తి చేయాలి. మూడేళ్ళలో 25 లక్షల్లో పెరిగాయంటున్న ఈ ఓటర్ల లెక్కను చర్చకు పెట్టి, అవసరమైతే ప్రక్రియలోనూ, లెక్కల్లోనూ తప్పులు సరిదిద్దుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడే అన్ని పక్షాల నమ్మకం చూరగొనడం సాధ్యం. ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయంగా ఉంటేనే, ఎన్నికైన ప్రభుత్వానికీ విశ్వసనీయత. అదే లేకుంటే, ఎన్నికలు పెట్టినా మిగిలేది అనుమానాలు, ఆరోపణలే! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement