కమిటీల ఏర్పాటులో రాజానగరం రోల్‌ మోడల్‌ | - | Sakshi
Sakshi News home page

కమిటీల ఏర్పాటులో రాజానగరం రోల్‌ మోడల్‌

May 27 2026 12:17 AM | Updated on May 27 2026 12:17 AM

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణు

రాజానగరం: మండల స్థాయి నుంచి బూత్‌ స్థాయి వరకు పార్టీ కమిటీల ఏర్పాటులో రాజానగరం నియోజకవర్గం రాష్ట్రానికి రోల్‌ మోడల్‌ వంటిదని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజానగరంలో మంగళవారం నిర్వహించిన వైఎస్సార్‌ సీపీ బూత్‌ ఏజెంట్‌ల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఓటర్ల జాబితా పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, మన పార్టీకి సపోర్టుగా ఉండే ఓట్లను తొలగించకుండా నిశితంగా గమనించాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నేతృత్వంలో పనిచేయడం మీరంతా చేసుకున్న అదృష్టమన్నారు. కోరుకొండలో మట్టి టిప్పర్‌ ఢీ కొని మృతి చెందిన పార్టీ కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచి, రూ.20 లక్షల పరిహారాన్ని ఇప్పించడంలో రాజా చేసిన పోరాట పటిమను అభినందించారు. పక్కనే ఉన్న రాజమహేంద్రవరం నియోజకవర్గాలకే కాకుండా జిల్లాకు రాజా వంటి నాయకుడి బలం ఎంతో అవసరమన్నారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాజకీయ నాయకుల భవితను మార్చేవి ఎన్నికలేనన్నారు. ఎన్నికల ముందు ఓట్ల తొలగింపులు జరిగే సమయంలో అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉందని నిర్లిప్తంగా ఉండటం మంచిది కాదన్నారు. బెంగాల్‌లో లక్షల మంది ఓట్లను ఉద్దేశ పూర్వకంగానే తొలగించారని గుర్తు చేశారు. బూత్‌ ఏజెంట్లకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలన్నారు. మీ పరిధిలో ఉన్న ఓటర్లను తరచు కలుసుకుంటూ ఓట్ల జాబితాలను పరిశీలిస్తూ ఉండాలని పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వారి బాధ్యతలను వివరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు తోట రామకృష్ణ, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement