● కత్తులతో వీర విద్య సాధన
● ఉత్సాహంగా చెడీ తాలింఖానా శిక్షణ
అమలాపురం టౌన్: ఏడాది పాటు పుస్తకాలతో కలాల సాము చేసి ఓ మెట్టెక్కేసిన ఆ కుర్రకారు నేడు వాటికి విరామమిచ్చి కర్ర, కత్తిసాము చేస్తున్నారు. ఆత్మరక్షణ కోసం స్థానిక రవణం వీధిలోని శివాలయం ఎదుట చెడీ తాలింఖానా సాధన చేస్తున్నారు. 8 నుంచి 20 ఏళ్ల లోపు విద్యార్థులు సుమారు 110 మందికి అమలాపురానికి చెందిన చెడీ తాలింఖానా శిక్షకుడు వంటెద్దు సత్తిబాబు ‘శ్రీ కోనసీమ యుద్ధ కళా కేంద్రం’ పేరుతో ఈ ఉచిత వేసవి శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 11న ప్రారంభమైన ఈ శిక్షణ ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ సాగుతోంది. ఏటా దసరా ఉత్సవాల్లో ఈ వీర విద్య ప్రదర్శించడం అందరికీ తెలిసిందే. సుమారు 187 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ వీర విద్యను భావి తరాలకు అందజేయాలన్న సంకల్పంతో ఈ శిక్షణ ఇస్తున్నట్టు సత్తిబాబు తెలిపారు.
వారసత్వాన్ని కాపాడాలనే..
చెడీ తాలింఖానా వారసత్వాన్ని కాపాడాలనే తపనతో ఈ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశాను. పాఠశాల విద్యార్థులు ప్రతి వేసవి సెలవుల్లోనూ ఈ శిక్షణకు ఉత్సాహంగా వస్తున్నారు. స్వీయ ఆత్మ రక్షణకు తీసుకోవాల్సిన మెళకువలు నేర్పుతున్నాను.
– వంటెద్దు సత్తిబాబు, చెడీ తాలింఖానా ట్రైనర్, అమలాపురం
ఆత్మ రక్షణకు అవసరం
ఆత్మ రక్షణకు ఈ విద్య ఎంతోగానో ఉపయోగపడుతుంది. అందుకే నేర్చుకుంటున్నాను. ఈ విద్యలో అమలాపురానికి ఉన్న పేరును కాపా డాలని రెండో ప్రాధాన్యంగా ఈ విద్య నేర్చుకుంటున్నాను. కర్ర, కత్తి సాము ఎలా చేయాల న్న విషయంపై రోజూ శిక్షణ పొందుతున్నాం.
– పి.నాగ సూర్యలక్ష్మి, అమలాపురం
గర్వంగా ఉంది
ఈ వీర విద్య అమలాపురంలో చాలా మంది పెద్దవాళ్లకు వచ్చు. పిల్లలకు కూడా నేర్పుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ శిక్షణలో నేర్పుతున్న వీర విద్య అటు వారసత్వంగా, ఆత్మ రక్షణకు ఉపయోగపడుతోంది.
– వి.శ్రీచరణ్, అమలాపురం


