రైతులపై పగాకు | - | Sakshi
Sakshi News home page

రైతులపై పగాకు

May 4 2026 7:07 AM | Updated on May 4 2026 7:07 AM

లో

సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2026

ఉండేశ్వరపురంలో పొగాకు గ్రేడింగ్‌ చేస్తున్న మహిళలు

సాక్షి, రాజమహేంద్రవరం: నల్లరేగడి భూముల్లో (బ్లాక్‌ సాయిల్స్‌ – బీఎస్‌) రైతులు పండిస్తున్న పొగాకు కొనుగోలు చేయకుండా ప్రభుత్వం అంతు లేని అలక్ష్యం వహిస్తోంది. దేవరపల్లిలోని పొగాకు వేలం కేంద్రంలో ఏటా మార్చి 15వ తేదీనే బీఎస్‌ పొగాకు కొనుగోళ్లు ప్రారంభమవుతూంటాయి. కానీ, ఈ ఏడాది మే మొదటి వారం వచ్చేసినా ఒక్క బేలు కూడా కొనుగోలు చేసిన దాఖలాల్లేవు. కొనుగోళ్లలో జాప్యం ఫలితంగా సుమారు 50 రోజులుగా రైతుల వద్దనే పెద్ద మొత్తంలో పొగాకు నిల్వ ఉండిపోయింది. ఇలాగే ఆలస్యం చేస్తే పొగాకు నాణ్యత తగ్గిపోతుందని, ఎండల తీవ్రతకు తరుగు వచ్చి, నష్టాల్లో కూరుకుపోతామని బీఎస్‌ పొగాకు సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్ణాటకలోని మైసూరులో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయిన తరువాత జూన్‌ నెలలో దేవరపల్లిలో బీఎస్‌ పొగాకు కొనుగోళ్లు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇదెంతవరకూ సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు.

రూ.446 కోట్ల బీఎస్‌ పొగాకు నిల్వ

అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలోని సీతానగరం, కోరుకొండ, రాజమహేంద్రవరం రూరల్‌ తొర్రేడు, రాజానగరం పరిసర ప్రాంతాల్లోని నల్లరేగడి నేలల్లో 1,120.94 హెక్టార్లలో రైతులు బీఎస్‌ పొగాకు సాగు చేస్తున్నారు. బ్లాక్‌ సాయిల్స్‌ పరిధిలో సుమారు 965 పొగాకు బ్యారన్లున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5 వేల మంది రైతులు ఈ రకం పొగాకు సాగుపై ఆధారపడి ఉన్నారు. సీజన్‌ మొదలైనప్పటికీ ఇప్పటి వరకూ కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో జిల్లావ్యాప్తంగా రైతుల వద్ద రూ.446 కోట్ల విలువైన 2.03 మిలియన్‌ కిలోల బీఎస్‌ పొగాకు నిల్వ ఉండిపోయింది. ఒక్కో రైతు వద్ద రూ.50 లక్షల నుంచి రూ.కోటి విలువైన పొగాకు నిల్వలు ఉండిపోయాయి. ఎకరం పొగాకు సాగుకు అన్ని ఖర్చులూ కలిపి ఒక్కో రైతు రూ.2.70 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం కొనుగోళ్లు లేకపోవడంతో దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పొలం కౌలు, సాగు ఖర్చులు, క్యూరింగ్‌, గ్రేడింగ్‌, కలప కొనుగోలు, వెదురు కర్రల కొనుగోళ్లకు పలువురు రైతులు ముందుగానే అప్పులు తెచ్చి, చెల్లించాల్సిన పరిస్థితి. బ్యాంకు నుంచి తీసుకున్న లింకేజీ రుణాలకు నెలల తరబడి వడ్డీ చెల్లింపులు వారికి మరింత భారంగా మారుతున్నాయి.

వర్జీనియా రైతులకూ నిరాశే

టుబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్‌ పరిధిలో దేవరపల్లి, జంగారెడ్డిగూడెం–1, 2, కొయ్యలగూడెం, గోపాలపురాల్లో వేలం కేంద్రాలున్నాయి. ఈ ప్రాంతాల్లో 12,612 మంది రైతులు 29,132.48 హెక్టార్లలో వర్జీనియా పొగాకు సాగు చేశారు. పంట ఆశాజనకంగా ఉండటంతో ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. బోర్డు 49.32 మిలియన్‌ కిలోల ఉత్పత్తికి మాత్రమే అనుమతివ్వగా.. సుమారు 85 మిలియన్‌ కిలోల పొగాకు ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. కొనుగోలుదారులు పూర్తి స్థాయిలో రాకపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆయా వేలం కేంద్రాల్లో అమ్మకాలు మందకొడిగా జరుగుతున్నాయి. కిలో ప్రారంభ గరిష్ట ధర రూ.290 ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తూండగా.. రూ.265 కంటే ఎక్కువ ఇచ్చేందుకు వ్యాపారులు సుముఖంగా లేరు. దీంతో, తాము నష్టపోతున్నామని వర్జీనియా పొగాకు రైతులు వాపోతున్నారు. మార్కెట్‌ పరిస్థితుల నేపథ్యంలో రైతుల వద్ద ఇటు బీఎస్‌, అటు వర్జీనియా పొగాకు నిల్వలు భారీగా పేరుకుపోతున్నాయి. ఒక్క వర్జీనియా పొగాకు నిల్వలే రూ.2,200 కోట్లకు పైగా ఉండగా.. మరో రూ.446 కోట్ల మేర బీఎస్‌ పొగాకు నిల్వలు రైతుల వద్ద ఉండిపోయాయి. కొనుగోళ్లు ప్రారంభం కాక నల్లరేగడి నేలల్లో పొగాకు పండించిన రైతులు నష్టపోతున్నా.. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర రాకపోయినా చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

8

నాడు అండగా నిలిచిన జగన్‌ ప్రభుత్వం

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పొగాకు రైతులకు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. అప్పట్లో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థానిక నాయకులు తీసుకెళ్లగా.. ఆయన వెంటనే స్పందించారు. తక్షణం రూ.100 కోట్లు విడుదల చేసి, మార్క్‌ఫెడ్‌ ద్వారా పొగాకు కొనుగోలు చేసి, రైతులకు అండగా నిలిచారు. అలాగే, అప్పట్లో తుపాను ప్రభావంతో దెబ్బ తిన్న పొగాకు రైతులకు సైతం నష్టపరిహారం ఇచ్చిన ఘనత జగన్‌కే దక్కింది.

ఆలస్యమైతే లో గ్రేడ్‌లోకి...

నేను 25 ఎకరాల నల్లరేగడి నేలల్లో పొగాకు సాగు చేశాను. నా దగ్గర పొగాకు నిల్వ ఉంది. కొనుగోళ్లు ఆలస్యమైతే రంగు మారి, లో గ్రేడ్‌లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఆశించిన ధర దక్కకపోగా.. పంట సాగుకు చేసిన అప్పులు కూడా తీర్చలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం స్పందించి వెంటనే పొగాకు కొనుగోలుకు చర్యలు తీసుకోవాలి.

– మాకల ఈశ్వరరావు, పొగాకు రైతు,

ఉండేశ్వరపురం, సీతానగరం మండలం

కొనుగోళ్లు ప్రారంభించకుంటే ఆందోళన

నల్లరేగడి నేలల్లో పొగాకు కొనుగోళ్లను చంద్రబాబు ప్రభుత్వం తక్షణం ప్రారంభిచకపోతే రైతుల పక్షాన ఆందోళనకు దిగుతాం. ఇప్పటికే 50 రోజులకు పైగా పొగాకు కొనుగోళ్లు లేక, నిల్వలు పేరుకుపోయి రైతులు అగమ్యగోచరంలో ఉన్నా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గం. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరచి పొగాకు రైతులను ఆదుకోవాలి.

– జక్కంపూడి రాజా, వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే

బీఎస్‌ పొగాకు కొనుగోళ్లపై

ప్రభుత్వం నిర్లక్ష్యం

ఏటా మార్చి 15 నుంచి

30లోగా కొనుగోళ్లు

ఈ ఏడాది ఇప్పటికీ ప్రారంభం

కాని ప్రక్రియ

ఆందోళనలో రైతులు

Advertisement
 
Advertisement
Advertisement