● అన్నదాతపై వరుణుడి కన్నెర్ర
● పలు ప్రాంతాల్లో వర్షాలు
● నీట తడిసిన ధాన్యం
రాయవరం/అనపర్తి/పెరవలి: కొన్నాళ్లుగా చండప్రచండంగా కాస్తున్న ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఆదివారం ఉదయం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. రాజమహేంద్రవరం, రాజానగరం తదితర ప్రాంతాల్లో జల్లులు కురవగా.. అనపర్తి, బిక్కవోలు, రాయవరం, పెరవలి తదితర మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు సేద తీరగా.. ఈ అకాల వర్షాలు అన్నదాతలకు అనుకోని కష్టం తెచ్చిపెట్టాయి. పలు గ్రామాల్లో ఉదయం బలమైన ఈదురు గాలులు వీచాయి. ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైంది. దీంతో, రోడ్ల పక్కన, కళ్లాల్లోను ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పరుగులు తీశారు. చూస్తూండగానే ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో పలువురు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని బరకాలతో కాపాడుకునేందుకు ప్రయత్నం చేశారు. ఆ అవకాశం లేని వారు అలాగే వదిలేయడంతో ధాన్యపు రాశులు తడిసిపోయాయి. కళ్లాల్లోని ధాన్యం కళ్ల ముందే వర్షంలో తడిసి ముద్దవుతూంటే నిస్సహాయంగా చూస్తూ కన్నీరు పెట్టుకున్నారు. వాన తగ్గిన తరువాత నీట మునిగిన ధాన్యాన్ని చేతులతో దేవుకుంటూ రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. పెరవలి మండలంలోని పలు గ్రామాల్లో బస్తాల్లో పట్టి ఉన్న ధాన్యం తడిసిపోయింది. కొందరు రైతులకై తే మిల్లులకు తరలించిన ధాన్యాన్ని ట్రాక్టర్ల నుంచి దించకపోవటంతో అలాగే తడిసిపోయింది. అసలే తేమ పేరుతో ధాన్యానికి అంతంత మాత్రమే ధర ఇస్తున్నారని, ఇప్పుడు అకాల వర్షానికి తడిసిపోవడంతో ధర మరింత తగ్గిపోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పుట్టెడు కష్టాల్లో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో భారీ వర్షానికి ఇటుక బట్టీలు పూర్తిగా తడిసిపోవడంతో వాటి యజమానులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు పెరవలి మండలంలో ఈదురు గాలులకు అరటి తోటలు నేలనంటాయి. ప్రతి తోటలో 10 నుంచి 50 వరకూ బొందలు విరిగిపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ లైన్‌లు తెగి పడటంతో పెరవలి మండలంలో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకూ కరెంటు సరఫరా నిలిచిపోయి, ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పెరవలి మండలం ముక్కామలలో ధాన్యాన్ని హడావుడిగా బస్తాలకు పడుతున్న రైతులు
అనపర్తిలో వాన నీట తడిసిన ధాన్యపు రాశులు
రాయవరం మండలం లొల్లలో ధాన్యాన్ని కాపాడుకునేందుకు అన్నదాతల పాట్లు


