నేడు పీజీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు పీజీఆర్‌ఎస్‌

May 4 2026 7:07 AM | Updated on May 4 2026 7:07 AM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం కలెక్టరేట్‌లో సోమవారం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్‌ కీర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా ప్రజాప్రతినిధులతో అమరావతిలో సోమవారం నిర్వహించే సమావేశానికి తాను హాజరు కానున్నందున.. ప్రజల నుంచి జాయింట్‌ కలెక్టర్‌ మేఘస్వరూప్‌, జిల్లా అధికారులు అర్జీలు స్వీకరిస్తారని వివరించారు. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్ల ఆధ్వర్యాన జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్‌ జరుగుతుందన్నారు. డివిజన్‌, మండల స్థాయిల్లో కూడా పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌లు నిర్వహిస్తామన్నారు. ప్రజలు 1100 టోల్‌ ఫ్రీ నంబర్‌కు కూడా ఫిర్యాదు చేయవచ్చని, అర్జీల పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చని, 95523 00009 వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా కూడా పౌర సేవలు పొందవచ్చని కలెక్టర్‌ పేర్కొన్నారు.

‘మట్టి’ దొంగలు దొరికేనా!

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: కడియపులంకలో నిర్మిస్తున్న ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో రూ.లక్షల విలువైన నల్లమట్టిని దోచుకుపోయిన దుండగులను అధికారులు పట్టుకుంటారా అనే సందేహాలను మండల ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సహజ వనరుల దోపిడీయే ప్రధాన అజెండా పని చేస్తున్న కొందరు నాయకులు ఈ మట్టి దోపిడీకి కూడా అండదండలు అందించారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. నిత్యం వందలాది మంది తిరిగే రోడ్డు పక్కనే ఉన్న మట్టిని రాత్రికి రాత్రే మాయం చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. గతంలోనే మట్టి దోపిడీకి సిద్ధమైనప్పటికీ మీడియాలో కథనాలు రావడంతో ఆ మట్టిని పరిరక్షించాల్సిందిగా సంబంధిత నిర్మాణ కాంట్రాక్టర్‌కు రెవెన్యూ యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు ముఖ్య నాయకుల మధ్య వాటాలు కుదరనందువల్లనే అప్పట్లో మట్టి జోలికి వెళ్లలేదని కూడా అంటున్నారు. అయితే, ఇప్పుడు హఠాత్తుగా మట్టి దోచుకుపోవడం వెనుక భారీ మంత్రాంగమే నడిచిందని, వాటాలపై అక్రమార్కులు స్పష్టతకు వచ్చారని స్థానికులు చెబుతున్నారు. కూటమి పార్టీల్లోని కీలక నాయకులకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. వారి ప్రమేయమే కనుక లేకపోతే.. ప్రతి విషయానికి మీడియా ముందుకు వచ్చి మైకులు పట్టుకునే నాయకులు మట్టి దోపిడీని కూడా అదే రీతిలో ఎందుకు ఖండించడం లేదనే ప్రశ్న వస్తోంది. మట్టి దోపిడీ నిగ్గు తేల్చాలని, బాధ్యులను శిక్షించాలని పలు రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మట్టి మాయంపై మండలంలోని కీలక నాయకులకు ముందస్తుగానే సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. ‘నాకు చెప్పకు నీకెలా నచ్చితే అలా చేసుకో’ అంటూ ఒక నేత.. ‘మండలంలో ఏం జరిగానా నా మెడకే చుడుతున్నారంటూ మరో ముఖ్య నాయకుడు’ అన్నట్లు చెబుతున్నారు. అయితే చివరికి ఏం ‘ఒప్పందం’ కుదిరిందో ఏమో కానీ మట్టి మాత్రం మాయమైపోయింది.

ఉత్కంఠకు నేటితో తెర..

నేడు యానాం నియోజకవర్గ ఓట్ల లెక్కింపు

యానాం: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని యానాం అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. గత నెల 9న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా యానాం నియోజకవర్గ ఓట్ల లెక్కింపు స్థానిక సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటిగ్‌ హాలులో ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. దీనికోసం విస్తృత బందోబస్తు చేసినట్టు రిటర్నింగ్‌ అధికారి శివరాజ్‌ మీనా తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 35,445 మంది ఓటర్లతో పాటు 360 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కళాశాలలో ఉదయం 5 గంటలకు జనరల్‌ అబ్జర్వర్‌ సమక్షంలో ఈవీఎంలను ర్యాండమైజ్‌ చేసి, 7.30 గంటలకు కౌటింగ్‌ కేంద్రానికి చేరుస్తారు. తొలుత 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్లను ఒక టేబుల్‌ వద్ద, 8.30 గంటలకు మరో 10 టేబుళ్లపై ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. మొత్తం 5 రౌండ్లలో 42 పోలింగ్‌ బూత్‌లకు సంబంధించి ఓట్లు లెక్కిస్తారన్నారు. ఫలితం మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో స్వతంత్రులతో కలిపి మొత్తం 14 మంది పోటీ చేయగా ప్రధానంగా కాంగ్రెస్‌ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్‌ అశోక్‌ ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు మధ్యే పోటీ నెలకొంది.

ఫిట్‌నెస్‌ లేని బస్సులపై చర్యలు

అమలాపురం రూరల్‌: నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా విద్యా సంస్థల బస్సులు మే 15 కల్లా ఫిట్‌నెస్‌ పొందాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని కోనసీమ జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు హెచ్చరించారు. జిల్లాలో ఉన్న 71 విద్యాసంస్థలకు 784 బస్సులు ఉన్నాయని, వాటికి విధిగా ఫిట్‌నెస్‌ పొందాలని డీటీఓ పేర్కొన్నారు. బీవీసీ ఇంజినీరింగ్‌ విద్యా సంస్థకు చెందిన 27 బస్సులను ఆదివారం తనిఖీ చేసినట్టు ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement