● బాబూ.. ఆకలి బాపు | - | Sakshi
Sakshi News home page

● బాబూ.. ఆకలి బాపు

May 4 2026 7:07 AM | Updated on May 4 2026 7:07 AM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): అతడి జీవితంతో విధి ఆటలాడుకుంది. సాపీగా సాగిపోతున్న అతని జీవితం ఓ ప్రమాదం కారణంగా రోడ్డున పడింది. కడపకు చెందిన రామయ్య దీనగాథ ఇది. అతడు గతంలో డ్రైవర్‌గా పని చేసేవాడు. 2015లో జరిగిన ఒక ప్రమాదంలో అతడి తుంటి ఎముక విరిగిపోయింది. నడవలేని పరిస్థితి వచ్చింది. కుటుంబాన్ని పోషించుకోవడం భారంగా మారింది. ప్రభుత్వం కరుణించి పెన్షన్‌ కూడా ఇవ్వడం లేదు. ఏ పనీ చేయలేని దుస్థితిలో కూరుకుపోయిన అతడు.. ఉన్న ఊరులో ఉండలేక.. ఏం చేయాలో పాలుపోక.. ఒక్కడే రాజమహేంద్రవరం చేరుకున్నాడు. విధి లేని పరిస్థితుల్లో 65 సంవత్సరాల వయస్సులో.. తాను బతకడానికి ‘బాపు’నే నమ్ముకున్నాడు. ఆ మహనీయుడు గాంధీజీ వేషధారణలో రోడ్డుపై కూర్చుని.. ఎవరైనా జాలితో వేసిన చిల్లరతో పరమ దీనావస్థలో అతడు జీవనం సాగిస్తున్నాడు. ఉదయమే కాస్త టిఫిన్‌ తిని, కాలకృత్యాలు తీర్చుకుంటాడు. ఒంటికి వెండి రంగు పూసుకుని, మహాత్మా గాంధీ వేషధారణ వేసుకుంటాడు. నిలబడలేని పరిస్థితి కావడంతో చిన్న ప్లాస్టిక్‌ బల్లపై ఏదైనా సెంటర్‌లో రోడ్డు పక్కన కూర్చుంటాడు. మధ్యాహ్న భోజన సమయం వరకూ.. 40 డిగ్రీల సెల్సియస్‌ ఎండ కాస్తున్నా సరే కదలకుండా అక్కడే ఉంటాడు. ఏమైనా తింటే కడుపు నిండుగా ఉండి, ఇబ్బంది కలుగుతుందని, మంచినీరు కూడా తాగకుండా అలాగే కూర్చుంటున్నానని తన దయనీయ పరిస్థితిని ‘సాక్షి’తో పంచుకున్నాడు. మధ్యాహ్న భోజనం తరువాత సాయంత్రం 6 గంటల వరకూ పుష్కర ఘాట్‌ వద్ద అదే బల్లపై కూర్చుని ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తూంటాడు. రాత్రి వేళ పుష్కర ఘాట్‌ వద్ద ఫుట్‌పాత్‌ పైనే నిద్రిస్తూంటాడు. రామయ్య దీనావస్థను ‘సాక్షి’.. స్వర్ణాంరధ్ర వృద్ధాశ్రమ నిర్వాహకుడు గుబ్బల రాంబాబు దృష్టికి తీసుకు వెళ్లగా.. అతడికి కావలసిన సహాయం చేస్తానని భరోసా ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement