నిడదవోలు పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ ఆందోళన
నిడదవోలు: కూటమి పేరుతో తామంతా పనిచేయడం వల్లే ఇక్కడ జనసేన ఎమ్మెల్యే నెగ్గారని, ఇప్పుడు ఆ పార్టీ నేతలు తమ పైనే కేసులు పెట్టే పరిస్థితి వచ్చిందని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలివీ.. రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్‌పై, జనసేన నాయకులపై దు ష్ప్రచారం చేస్తూ సింగవరం గ్రామానికి చెందిన టీడీపీ బూత్ ఇన్‌చార్జి కట్ట మణికంఠ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నాడంటూ గత నెల 26న జనసేన కార్యకర్తలు అడ్డాల సాయి లక్ష్మణ్, అచ్యుత పవన్ కుమార్‌లు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై జగన్‌మోహన్‌రావు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తనపై అక్రమంగా కేసులు పెట్టారని, విచారణకు స్టేషన్‌కు రమ్మంటూ ఇబ్బంది పెడుతున్నారని, ఈ వేధింపులు తాళలేక తాను చనిపోతున్నానంటూ మణికంఠ సెల్ఫీ వీడియో చేసి, సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ మేరకు వేలివెన్ను నీటి సంఘం అధ్యక్షుడు, టీడీపీ సీనియర్ నేత బూరుగుపల్లి శ్రీనివాస్, ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యాన నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. మణికంఠ ఆచూకీ తెలిపే వరకూ ఎన్ని రోజులైనా అక్కడే ఉంటామని నిరసన తెలిపారు. వారితో సీఐ తిలక్ చర్చించినా ఫలితం లేకుండా పోయింది. మణికంఠ తండ్రి కృష్ణ మా ట్లాడుతూ, 1989 నుంచి టీడీపీ కోసం పని చేసిన తమకు జనసేన నాయకుల వల్ల రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగవరంలో భూ ఆక్రమణలపై పోరాడుతుంటే తన కుమారుడు మణికంఠపై జనసేన నాయకులు అక్రమ కేసులు పెట్టడమే కాకుండా ఉద్యోగం నుంచి తొలగించేందుకు కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటానంటూ మణికంఠ సెల్ఫీ వీడియో పెట్టాడని బోరున విలపించారు. టీడీపీ నాయకులమైన తమకే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.


