● ఫిషర్‌మెన్ సొసైటీ ఎన్నికలలో
ప్రజాస్వామ్యం ఖూనీ
● ఏకపక్షంగా వ్యవహరించిన
అధికారులు, పోలీసులు
రంగంపేట: మండలంలోని దొడ్డిగుంటలో బుధవారం జరిగిన ఫిషర్‌మెన్ సొసైటీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం మరోసారి ఖూనీ అయింది. కూటమి నాయకుల ఒత్తిడితో అధికారులు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. మార్చి 5వ తేదీన జరిగిన ఫిషర్‌మెన్ సొసైటీ ఎన్నికను కోరం ఉన్నా నాటకీయ పరిణామాలతో అధికారులు వాయిదా వేశారు. మార్చి 5న దొడ్డిగుంట ఫిషర్‌మెన్ సొసైటీ వద్ద దొడ్డిగుంట, ముకుందవరం, సుభద్రంపేట, వెంకటాపురం గ్రామాలకు చెందిన ఓటర్లు ఎన్నికకు హాజరయ్యారు. కోరం కూడా సరిపోయింది. ఎన్నిక నిర్వహించగా వైఎస్సార్ సీపీకి 140కి పైగా మద్దతు దారులు, టీడీపీకి 64 మంది మద్దతుదారులు ఉన్నట్టు తేలింది. వైఎస్సార్ సీపీ మద్దతు దారులు గెలిచినట్టు ప్రకటించాల్సి ఉండగా శాంతి భద్రతలు లేవని, ఎన్నిక నిర్వహించే ప్రదేశం సరిపోలేదనే సాకులు చెప్పి ఎన్నిక వాయిదా వేశారని వైఎస్సార్ సీపీ సభ్యులు ఆరోపించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుయుక్తుల కారణంగా ఎన్నిక వాయిదా పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎన్నిక జరిపించాలని వైఎస్సార్ సీపీ నాయకులు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు బుధవారం ఎన్నిక నిర్వహించారు. అయితే అధికార కూటమి అండదండలతో ఎన్నిక ఏకపక్షంగా సాగింది. మొత్తం 274 మందికి 214 మంది ఎన్నికలో పాల్గొనగా వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు 102, టీడీపీ సానుభూతిపరులు 112 మంది ఉండటంతో టీడీపీ సానుభూతిపరులు విజయం సాధించినట్టు ప్రకటించారు. అయితే అధికారులు, పోలీసులు కూటమి నేతల ఒత్తిడిలకు తలొగ్గి వైఎస్సార్ సీపీ సానుభూతిపరులకు ఓటరు సిప్పులు ఉన్నా అనుమతించలేదని, మరికొందరిని ప్రలోభపెట్టి తమవైపునకు తిప్పుకుని విజయం సాధించినట్టు ప్రకటించుకున్నారని, తాము ఈ ఎన్నిక బహిష్కరిస్తున్నామని వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు తెలిపారు.


