వీరేశ్వరుని ఆలయ పునర్మిర్మాణానికి శంకుస్థాపన | - | Sakshi
Sakshi News home page

వీరేశ్వరుని ఆలయ పునర్మిర్మాణానికి శంకుస్థాపన

Apr 13 2026 7:38 AM | Updated on Apr 13 2026 7:38 AM

ఐ.పోలవరం: మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన (శిలాస్థాపన) కార్యక్రమం ఆదివారం శాస్త్రోక్తంగా జరిగింది. శైవాగమ పండితుడు యనమండ్ర సత్యసీతారామశర్మ ఆధ్వర్యంలో ఆలయ పాలక మండలి చైర్మన్‌ దాట్ల రామకృష్ణంరాజు, ఏసీ వి.సత్యనారాయణ పర్యవేక్షణలో ఈ కార్య క్రమం నిర్వహించారు. తొలుత గణపతి పూజ, మండపారాధన, పుర్ణాహుతి, శిలలకు పూజలు జరిపారు. ప్రత్యేక పూజలు చేసిన కలశ జలాలను శంకుస్థాపన ప్రదేశంలో కలిపారు. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దంపతులు శిలాస్థాపన నిర్వహించారు. కాగా.. కాకినాడకు చెందిన రావు బుచ్చి వెంకట్రావు తండ్రి సత్యనారాయణ జ్ఞాపకార్థం రూ.లక్ష, ఐ.పోలవరం గ్రామానికి చెందిన సాగిరాజు సత్యనారాయణరాజు రూ.10,116 విరాళంగా అందజేశారు.

గండి పోశమ్మ ఆలయానికి దారి మళ్లింపు

సీతానగరం: సీతానగరం మీదుగా పురుషోత్తపట్నం నుంచి దేవీపట్నం మండలంలోని గండి పోశమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లే దారిని పోలవరం ప్రాజెక్టు పనుల కారణంగా మూసివేశారు. దీంతో భక్తులు సీతానగరం మండలం నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్లాలంటూ రాపాక మీదుగా కోరుకొండ మండలం కోటికేశవరం నుంచి కోరుకొండ చేరుకుని గోకవరం మీదుగా వెళ్లాలి. అలాగే కోటి కేశవరం నుంచి బొల్లెద్దులపాలెం, గోకవరం, దండంగి, పోతవరం మీదుగా దారి మళ్లించారు.

రోడ్డు ప్రమాదంలో

యువకుడి మృతి

ముమ్మిడివరం: మోటారు సైకిల్‌పై వస్తూ కారును ఢీకొన్న యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామానికి చెందిన పెట్టా బాబీ ఆదివారం మోటారు సైకిల్‌పై వస్తూ ముమ్మిడివరం మండలంలోని పదో మైలు సెంటర్‌ వద్ద కారును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు 108లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాబీ మృతి చెందాడు. ముమ్మిడివరం ఎస్సై డి.జ్వాలా సాగర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అంధకారంలో విద్యుత్‌

కార్మికుల జీవితాలు

సామర్లకోట: రాష్ట్ర విద్యుత్‌ శాఖలో ఏళ్ల తరబడి వెట్టి చాకిరీ చేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల జీవితాలు నేడు అంధకారంలో కూరుకుపోయాయని విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల ఉమ్మడి జిల్లా చైర్మన్‌ వీసం వీరనాగు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ రావులపాలెం 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌లో షిఫ్ట్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్న బండారు ప్రశాంత్‌ కుమార్‌ శనివారం ఉదయం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషించుకొలేక, ప్రభుత్వం నుంచి ఎటువంటి భరోసా లేకపోవడంతో మనస్తాపం చెందిన ప్రశాంత్‌.. ఒక సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదనను పంచుకున్నారన్నారు. పాదయాత్రలో లోకేష్‌, ప్రజావాణిలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ విద్యుత్‌ కార్మికులకు ఇచ్చిన హామీలు నేడు నీటి మూటలుగా మిగిలాయని ఆరోపించారు. తమ సమస్యలను పరిష్కరిస్తారని నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే, అధికారంలోనికి వచ్చాక కూటమి ప్రభుత్వం కార్మికుల నోట్లో మట్టి కొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌శాఖలోని దళారీ వ్యవస్థను రద్దు చేస్తామని, నేరుగా వేతనాలు చెల్లిస్తామని చెప్పి రెండేళ్లు గడుస్తున్నా అతీగతీ లేదన్నారు. సుమారు ఏడాది క్రితం రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సామర్లకోట వచ్చిన సమయంలో కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందజేశామని ఆయన గుర్తు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement