● రూ.11.4 కోట్లతో నిర్మాణం కానున్న
సీతారామ సత్రం
● ఈ నెల 12న మంత్రి ఆనంచే శంకుస్థాపన
అన్నవరం: రత్నగిరి భక్తులకు సత్యగిరిపై మరో సత్రం నిర్మాణం కానుంది. రూ.11.40 కోట్ల వ్యయంతో 105 గదులతో దీనిని నిర్మించనున్నారు. ఇప్పటికే దేవదాయశాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ అన్ని అనుమతులు మంజూరు చేశారు. శిథిలావస్థకు చేరిన పాత సీతారామ సత్రంలో సగభాగాన్ని కూల్చి ఈ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నెల 12న దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దీనికి శంకుస్థాపన చేయనున్నట్టు ఈఓ వి.త్రినాథరావు తెలిపారు. అలాగే టోల్‌గేట్ నుంచి రత్నగిరికి చేరేందుకు రూ.1.40 కోట్లతో నిర్మించిన రెండో మెట్లదారిని సైతం ఆయన ప్రారంభించనున్నట్టు ఈఓ తెలిపారు. సుమారు 30 ఏళ్ల క్రితం నిర్మించిన శ్రీ సీతారామ సత్రం శిథిలావస్థకు చేరడంతో 2024లో అప్పటి ఈఓ, ప్రస్తుత దేవదాయ కమిషషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశాలతో ఆర్ అండ్ బి అధికారుల నివేదిక మేరకు దానిని కూల్చి నూతన సత్రాన్ని నిర్మించనున్నారు. ఎ–బ్లాక్ పేరుతో రూ.7.07 కోట్లకు డీడీ గిరి కన్‌స్ట్రక్షన్స్ టెండర్ దక్కించుకుంది. ఫర్నిచర్, విద్యుత్, ఫ్లోరింగ్ తదితర పనులకు రూ.4.5 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. 2025 జూన్ 26న సాక్షిలో ‘సత్యదేవ చూడవయ్యా..’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన కమిషనర్ రామచంద్రమోహన్ కూల్చివేత విషయంలో జేఎన్‌టీయూకే ప్రొఫెసర్ల అభిప్రాయాల మేరకు కూడా పాత సత్రాన్ని కూల్చాలని నిర్ణయించి నూతన సత్రం నిర్మాణానికి నిర్ణయించారు. 16 నెలల్లో దీనిని పూర్తిచేయాలని నిర్ణయించి గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఈఓ త్రినాథరావు తెలిపారు.


