రాజవొమ్మంగి: జలధార–జలహారతి కార్యక్రమంలో భాగంగా మండలంలో వివిధ మరమ్మతులు చేపట్టాల్సిన 29 సాగునీటి చెరువులను గుర్తించామని ఎంపీడీఓ యాదగిరీశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం రాజవొమ్మంగి సచివాలయంలో జరిగిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. గ్రామసభకు హాజరైన ఎంపీడీఓ మాట్లాడుతు రిజర్వాయర్లు, చెరువులు, పంట కాలువల్లో పూడిక తీత పనులు, షటర్లు, పంట పొలాలకు సాగు నీరందించే తూములకు చేపట్టాల్సిన మరమ్మతులను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. నీటి భద్రత– భూగర్భ జలాల పెంపుదలకు ప్రభుత్వం చేపట్టిన వంద రోజుల ప్రత్యేక కార్యాచరణతో ఉపాధిహామీ పథాకాన్ని ఆనుసంధానం చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎంపీడీఓ అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు గొల్లపూడి పెద్దిరాజు, వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడు ముప్పన కేశవరావు, పంచాయతీ సెక్రటరీ మల్లేశ్వర్రావు, నాయకులు చీడిపల్లి అప్పారావు, త్రిమూర్తులు, రైతులు పాల్గొన్నారు.


