● పీహెచ్‌సీలో అగ్నిప్రమాదం
● ఘటనా స్థలంలో డీఎంహెచ్‌ఓ పరిశీలన
నల్లజర్ల: స్థానిక పీహెచ్‌సీలో బుధవారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు రూ.9.8 లక్షల విలువైన మందులు దగ్ధమయ్యాయి. మందుల గొడౌన్ నుంచి మంటలు, పొగలు రావడం చూసిన స్థానికులు డ్యూటీ నర్స్ ప్రసన్నకు సమాచారం అందించారు. ఆమె వెంటనే డాక్టరు సిరాజుద్దీన్‌కు ఫోన్‌చేశారు. ఆయన సమాచారం మేరకు వచ్చిన అగ్నిమాపక దళం మంటలను అదుపు చేశారు. మందులతో పాటు ఫర్నిచర్ కాలి బూడిదైందని, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌ఓ కె.వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి డాక్టర్ సిరాజుద్దీన్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. కాలిపోయిన మందుల విలువ రూ.9.8 లక్షల వరకు ఉండవచ్చని అగ్నిమాపకదళాధికారి కొండబాబు తెలిపారు. కాగా చిన్నపిల్లల వ్యాక్సిన్లు, కుక్క, పాముకాటు ఇంజక్షన్లు వేరేగదిలో ఫ్రిజ్‌లో ఉండటంతో సురక్షితంగా ఉన్నాయని సీహెచ్‌ఓ నేమాని వెంకటశాస్త్రి తెలిపారు.


