సామర్లకోట: గుడివాడకు చెందిన త్రిపూర్ణనపల్లి సురేష్ (35)ను అతను పని చేస్తున్న లారీయే మృత్యువుగా కబళించింది. పెద్దాపురం సీఐ వైఆర్‌కె శ్రీనివాసు కథనం ప్రకారం గుడివాడకు చెందిన వంశీ ట్రాన్సుపోర్టు లారీ క్లీనర్‌గా నాలుగు సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి గుడివాడ నుంచి చేపల లోడుతో పెద్దాపురం భాస్కర్ కాలనీ సమీపంలోని శ్రీ వీర వెంకటరమణ ప్లాంట్ వద్దకు మంగళవారం తెల్లవారు జామున ఒంటి గంట సమీపంలో వచ్చాడు. ఐసు లోడు వేసుకొని లారీ వెనుక డోర్లు వేస్తున్న సమయంలో సురేష్‌కు ఐరన్ డోర్ తగలడంతో కింద పడిపోయాడు. వెంటనే స్థానికులు 108లో పెద్దాపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే సురేష్ చనిపొయినట్టు డాక్టర్లు తెలిపారని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసిన ఎస్సై మౌనిక దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి వివాహం కాలేదని తెలిపారు.
పాము కాటుకు మహిళ మృతి
కూనవరం: రెక్కాడితేనే డొక్కాడని ఆ కుటుంబాన్ని మృత్యువు ఆవహించింది. రోజు మాదిరి పొలం పనికి వెళ్లిన ఆమె ప్రమాదవశాత్తూ పాము కాటుకు గురైంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం పెదార్కూరు పంచాయతీ రేపాక గ్రామానికి చెందిన మడకం పొదమ్మ(49) మంగళవారం మిరప చేలో కాయలు కోసేందుకు వెళ్లింది. పనిలో నిమగ్నమైన ఉన్న సమయంలో ఆమె పాము కాటుకు గురైంది. విషయం తెలుసుకున్న తోటి వారు ఆస్పత్రికి తరలించిగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి భర్త, ముగ్గురు కుమారులు ఉన్నారు. పొదమ్మ మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గోదావరిలో స్నానానికి దిగి
మహిళ మృతి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): గోదావరి నదిలో స్నానానికి దిగి మహిళ మృతిచెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. అన్నపూర్ణమ్మపేటకు చెందిన వాకలపూడి సరోజిని (55) స్నానం చేసేందుకు గోదావరి నదిలోకి దిగింది. ఆమె ప్రమాదవశాత్తూ నదిలో మునిగిపోయింది. స్థానికులు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. రెండో పట్టణ పోలీసులు మృతదేహాన్ని వెలికితీసారు. పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.
లారీ– బైక్ ఢీ
నలుగురికి తీవ్ర గాయాలు
అనపర్తి: మోటార్ బైక్ పై బంధువుల ఇంటికి వెళుతున్న వారిని వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో బైక్ పై ఉన్నవారంతా కింద పడి తీవ్ర గాయాలపాలయ్యారు. బిక్కవోలు మండలం తొస్సిపూడి సాయితేజ రైస్ మిల్లు సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనపై రాయవరం మండలం వెదురుపాక గ్రామానికి చెందిన యాడిడ రేవతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేవతి తన భర్త రమేష్‌బాబు, కుమారుడు రూపేష్, కుమార్తె శ్రీనిత్యతో కలసి రంపచోడవరంలోని తమ బంధువుల ఇంటికి మోటార్ సైకిల్ పై బయలుదేరగా తొస్సిపూడిలోని సాయితేజ రైస్‌మిల్లు సమీపంలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా ఎదురుగా వచ్చి మోటార్ సైకిల్‌ను ఢీకొట్టడంతో అందరూ రోడ్డుపై పడిపోయారు. రమేష్‌బాబు కుడి కాలిపై తీవ్ర గాయమైంది. ఫిర్యాదుదారు రేవతికి తల కుడి వైపు గాయాలయ్యాయి. ఆమె కుమారుడు రూపేష్, కుమార్తె శ్రీనిత్య గాయపడ్డారు. వారిని అనపర్తిలోని ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రవిచంద్ర తెలిపారు.


