కాకినాడ రూరల్: రమణయ్యపేట బొందగుంట ప్రాంతంలో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసి రవాణా చేస్తున్నారనే సమాచారంతో సీఐ పెద్దిరాజు, సిబ్బంది మంగళవారం తెల్లవారు జామున దాడి చేశారు. ఈ దాడిలో సంచుల్లో ఉన్న పీడీఎస్ బియ్యంతో పాటు అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులను పోలీసులు గమనించి పట్టుకున్నారు. నిందితుల నుంచి 57సంచుల్లో ఉన్న సుమారు 2,800 కిలోల బియ్యం, వ్యాన్, ఆటో, ఎలక్ట్రానిక్ తూకం కాటాలను స్వాధీనం చేసుకున్నారు. పెద్దాపురం మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన నిందితులు తుమ్మలపల్లి నాగబాబు, నందిపాటి సునీల్, గోపు నాగబాబు, గోపు రాజు, కందా నాగబాబును అరెస్టు చేసినట్టు సీఐ తెలియజేశారు.
1,200 కేజీల బియ్యం స్వాధీనం
గొల్లప్రోలు (పిఠాపురం): గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యంను మంగళవారం తెల్లవారుజామున పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. వ్యాన్‌ను ఆపి తనిఖీ చేయగా దానిలో రేషన్ బియ్యం రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. 18 బస్తాలలో రూ.55,800 విలువైన 1,200 కేజీల రేషన్ బియ్యంను, రూ.2 లక్షల విలువైన వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని పిఠాపురం ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు తరలించారు ప్రత్తిపాడు డిప్యూటీ తహసీల్దార్ కే నాగబాబు ఫిర్యాదు మేరకు పిఠాపురం మండలం భోగాపురానికి చెందిన డ్రైవర్ పాలిక సుధాకర్, బి ప్రత్తిపాడుకు చెందిన సరకు యజమాని వూట బుల్లిరాజులపై కేసు నమోదు చేసినట్లు గొల్లప్రోలు ఎస్సై రామకృష్ణ తెలిపారు.


