మరణంలోనూ కలిసే పయనం | - | Sakshi
Sakshi News home page

మరణంలోనూ కలిసే పయనం

Apr 7 2026 7:43 AM | Updated on Apr 7 2026 7:43 AM

కొడుకు కౌన్సెలింగ్‌కు బయలుదేరి..

తిరిగి రాని లోకాలకు..

ధవళేశ్వరం/కొణిజర్ల/కపిలేశ్వరపురం: పదో తరగతి పూర్తి చేసిన కుమారుడికి బంగారు భవిష్యత్‌ ఇవ్వాలని ఆ దంపతులు కలలు కన్నారు. ఆ తపనతో హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గం మధ్యలో తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. సహోద్యోగుల కథనం ప్రకారం.. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామానికి చెందిన ఉండమట్ల వీర్రాజు (42) ధవళేశ్వరం పంచాయతీ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. రాజమహేంద్రవరం మోరంపూడి సెంటర్‌ సమీపాన గాదాలమ్మ నగర్‌లో నివసిస్తున్నారు. ఆయనకు భార్య వీరశైలజ (37), కుమారుడు యశ్వంత్‌ ఉన్నారు. కుమారుడు ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశాడు. అతడిని హైదరాబాద్‌లో ఇంటర్మీడియెట్‌లో జాయిన్‌ చేయాలని తల్లిదండ్రులు భావించారు. తద్వారా మంచి భవిష్యత్తును అందించాలని తపన పడ్డారు. కళాశాలలో సీటు కౌన్సెలింగ్‌ కోసం, బంధువులను కలిసేందుకు సోమవారం తెల్లవారుజామున కుమారుడితో కలిసి వీర్రాజు, వీరశైలజ దంపతులు కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా కొణిజర్లలో సాగర్‌ కాలువ బ్రిడ్జి పైన వద్ద వారి కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ప్రమాద తీవ్రతకు లారీ ముందు టైరు రిమ్ము విరిగిపోయింది. ఆ లారీ కిందకు కారు దూసుకుపోయింది. ఆపై లారీ అదుపు తప్పి బ్రిడ్జికి అడ్డంగా తిరిగింది. అదే సమయంలో వైరా వైపు నుంచి వస్తున్న మరో లారీని సైతం ఢీకొంది. ఈ ఘోర ప్రమాదంలో కారు నడుపుతున్న వీర్రాజు, ముందు సీట్లో కూర్చున్న ఆయన భార్య వీర శైలజ తీవ్రంగా గాయపడ్డారు. లారీ డ్రైవర్‌ అలుగోలు శ్రీను క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. అప్రమత్తమైన స్థానికులు కారులో నుంచి వీర శైలజను, యశ్వంత్‌ను బయటకు తీసి 108లో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శైలజ మృతి చెందింది. వీర్రాజు కారు సహా లారీ కింద ఇరుక్కు పోవడంతో పోలీసులు రెండు జేసీబీల సాయంతో ఆ వాహనాలను విడదీసి వీర్రాజును, లారీ డ్రైవర్‌ శ్రీనును బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రమాదం జరిగాక గంటకు పైగా తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా వీర్రాజు మృతి చెందాడు. అందరితో కలివిడిగా ఉండే వీర్రాజు దంపతులు ప్రమాదంలో మృతి చెందడం పట్ల ధవళేశ్వరం పంచాయతీ ఉద్యోగులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వీర్రాజు మృతి పట్ల పంచాయతీ కార్యదర్శి జి.వెంకట్రావు, సిబ్బంది సంతాపం తెలిపారు. వీర్రాజు గతంలో మండపేట మండలం ఏడిద పంచాయతీ ఇన్‌చార్జి కార్యదర్శిగా కూడా పని చేశారు.

అంగరలో విషాద ఛాయలు

వీర్రాజు దంపతుల మరణ వార్త ఆయన స్వగ్రామం అంగరలో విషాదం నింపింది. వీర్రాజు తండ్రి ఉండమట్ల వెంకటేశ్వరరావు కపిలేశ్వరపురం మండలం అంగర గాంధీ సెంటర్‌లో చాలా కాలం పాటు హోటల్‌ నడుపుతూ కుటుంబాన్ని పోషించారు. ఆయనకు వీర్రాజు పెద్ద కుమారుడు. చదువుకునే రోజుల్లో తండ్రికి చేదోడువాదోడుగా నిలిచిన వ్యక్తిగా వీర్రాజు అంగర గ్రామస్తులకు చిరపరిచితుడు. పదో తరగతి వరకూ అంగర ప్రభుత్వ పాఠశాలలోను, ఇంటర్మీడియెట్‌ మండపేటలోని ప్రైవేటు కళాశాలలోను చదివారు. జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఆత్రేయపురం, కోరుమిల్లి, అంగర, నిడసనమెట్ట, వెదురుమూడి, ఏడిద గ్రామాల్లో పని చేశారు. ఉద్యోగ రీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నప్పటికీ తరచూ అంగర వచ్చి వెళ్లేవారు. వీర్రాజు మృతి పట్ల ఆయన స్నేహితుడు, గ్రామ మాజీ సర్పంచ్‌ బట్టా షణ్ముఖ శ్రీనివాస్‌, స్నేహితులు ఎం.సత్యనారాయణ, ఎస్‌.అప్పారావు, ఎ.రవికిరణ్‌, బడుగు కుమార్‌ తీవ్ర సంతాపం తెలిపారు.

కపిలేశ్వరపురం (మండపేట): బంధువుల ఇంట శుభకార్యంలో అప్పటి వరకూ ఆనందంగా గడిపారు. ఉత్సాహంగా కబుర్లు చెప్పుకొంటూ తిరుగు ప్రయాణమయ్యారు. అంతలోనే విధి చిన్నచూపు చూసింది. వారు ప్రయాణిస్తున్న కారు రెప్పపాటులో అదుపు తప్పి, కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో బోగిళ్ల వీర వెంకట సతీష్‌ (40), కిరణ్మయి (36) దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. వారితో పాటు కారులో ప్రయాణిస్తున్న మృతుల పిల్లలు, తల్లిదండ్రులను స్థానికులు కాపాడారు. మండపేట మండలం తాపేశ్వరం గ్రామ శివారు పేకేటిపాకలు వద్ద సోమవారం అర్ధరాత్రి 12.45 గంటలకు జరిగిన ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..

మండపేట మండలం వెలగతోడు గ్రామానికి చెందిన వీర వెంకట సతీష్‌ రాజమహేంద్రవరం పేపర్‌ మిల్లులో ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. వెలగతోడులోని చిన్నాన్న కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఈ నెల 3న కాకినాడ వెళ్లారు. ఆదివారం రాత్రి జరిగిన ఫస్ట్‌నైట్‌ ఫంక్షన్‌కు హాజరయ్యారు. అనంతరం, కుటుంబ సభ్యులతో కలిసి కాకినాడ నుంచి కారులో స్వగ్రామం వెలగతోడు బయలుదేరారు. సతీష్‌ కారు నడపుతూండగా ముందు సీటులో భార్య కిరణ్మయి, వెనుక సీట్లలో తండ్రి వెంకట్రావు, తల్లి పద్మ, పదేళ్ల కుమారుడు మోక్షజ్ఞ, ఏడేళ్ల కుమారుడు జితేష్‌ ఉన్నారు. ఏం జరిగిందో ఏమో కానీ పేకేటిపాకలు – వెలగతోడు రోడ్డులో పేకేటి పాకలు శివారున కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయింది. ప్రవాహం ఉధృతంగా ఉండటంతో కారు ముందు భాగం లోతు నీళ్లలోకి కూరుకుపోవడంతో సతీష్‌, కిరణ్మయి దంపతులు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన వచ్చి, పైకి కనిపిస్తున్న భాగంలోని కారు అద్దాలు పగులగొట్టి చిన్నారులు మోక్షజ్ఞ, జితేష్‌, తల్లిదండ్రులు వెంకట్రావు, పద్మలను కాపాడారు. సమాచారం అందుకున్న మండపేట రూరల్‌ సీఐ పి.దొరరాజు, రూరల్‌ ఎస్సై వి.కిశోర్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్‌ సాయంతో కారును బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి వెంకట్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ దొరరాజు తెలిపారు.

కొంగుముడులు వేసుకుని, ఏడడుగులు నడిచి, నాతిచరామి అంటూ పెళ్లినాడు చేసిన ప్రమాణాలను ఆ రెండు జంటలూ బహుశా మరువలేదేమో! కడ వరకూ కలిసే తమ పయనాన్ని సాగించాయి. మరణంలోనూ పరస్పరం వీడలేక.. కానరాని లోకాలకు వెళ్లిపోయాయి. బంధువుల ఇంట జరిగిన శుభకార్యంలో ఆనందంగా గడిపి.. కారులో తిరుగు ప్రయాణమైన ఓ జంట.. తమ బిడ్డకు మంచి భవిష్యత్తును అందించాలనే తపనతో హైదరాబాద్‌ బయలుదేరిన మరో జంట.. వేర్వేరు ప్రమాదాల్లో దుర్మరణం పాలయ్యారు. ఈ రెండు సంఘటనలూ అటు కుటుంబ సభ్యుల్లోను, ఇటు స్థానికంగానూ తీరని విషాదాన్ని నింపాయి.

ఫ అర్ధరాత్రి కాలువలోకి దూసుకెళ్లిన కారు

ఫ మండపేట వద్ద దంపతుల దుర్మరణం

ఫ మృతుల పిల్లలు, తల్లిదండ్రులను

కాపాడిన స్థానికులు

కళ్ల ముందే జలసమాధి

తమ ఒక్కగానొక్క కొడుకు సతీష్‌, ప్రేమానురాగాలతో చూసుకునే కోడలు కిరణ్మయి తమ కళ్ల ముందే జలసమాధి కావడాన్ని తల్లిదండ్రులు వెంకట్రావు, పద్మ జీర్ణించుకోలేకపోయారు. చీకట్లో సాగిన ప్రయాణం తమ కుటుంబాన్ని విషాదంలోకి నెడుతుందని ఏమాత్రం ఊహించలేదని బావురుమన్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులు మోక్షజ్ఞ, జితేష్‌లు అమ్మా నాన్నా ఏరని అడుగుతూంటే ఏం చెప్పాలో దిక్కు తోచడం లేదంటూ వారు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. శుభకార్యంలో సందడిగా గడిపిన కొడుకు, కోడలు కానరాని లోకానికి వెళ్లిపోవడంతో గుండెలు పగిలేలా విలపించారు. చిరునవ్వుతో ప్రేమగా పలకరించిన సతీష్‌, కిరణ్మయి దంపతుల పలకరింపులు ఇంకా మరచిపోక ముందే దుర్వార్త వినాల్సి వచ్చిందంటూ బంధువులు విషాదంలో మునిగిపోయారు. దంపతుల మృతితో గ్రామస్తులు సైతం తల్లడిల్లారు. వారి మృతదేహాలను చూసి కన్నీరు పెట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement