రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ 16, 17 స్నాతకోత్సవాలను ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు వర్సిటీ కన్వెన్షన్ హాలులో నిర్వహిస్తున్నట్లు ఉప కులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ సోమవారం తెలిపారు. 2022–23, 2023–24 విద్యా సంవత్సరాల్లో పీహెచ్‌డీ, పీజీ, డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన వారికి వర్సిటీ చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా పట్టాలు ప్రదానం చేస్తామని వివరించారు. దీనికోసం ఇప్పటి వరకూ 722 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈ రెండు విద్యా సంవత్సరాల్లో యూనివర్సిటీ, అనుబంధ కళాశాలల్లో పీజీ పూర్తి చేసిన 6,113 మంది, అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 45,337 మంది విద్యార్థుల పట్టాలను ఆమోదిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి యూజీసీ చైర్మన్ ఆచార్య కె.మధుమూర్తి, జేఎన్‌టీయూ సీనియర్ ప్రొఫెసర్ పి.లామా, పలువురు విద్యావేత్తలు హాజరవుతారని వీసీ తెలిపారు.
రాష్ట్ర స్థాయి
పవర్ లిఫ్టింగ్‌లో స్వర్ణం
రాయవరం: మండలంలోని నదురుబాద గ్రామానికి చెందిన విత్తనాల ముత్యాలరావు (ముత్తు) రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణ పతకం కై వసం చేసుకున్నాడు. ఈ నెల 4, 5 తేదీల్లో విజయనగరం జిల్లా రాజాం జీఎంఆర్‌టీ కళాశాలలో ఏపీ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఈ పోటీలు జరిగాయి. మాస్టర్స్ కేటగిరీ విభాగంలో ఆయన ఈ ఘనత సాధించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ముత్తు గోల్డ్ మెడల్ సాధించడం పట్ల ఏపీఓ జె.సుధారాణి, ఫీల్డ్ అసిస్టెంట్లు అభినందనలు తెలిపారు.
పీజీఆర్‌ఎస్‌కు 187 అర్జీలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో ప్రజలు 187 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎస్.భాస్కర్‌రెడ్డి, ఆర్‌డీఓ ఆర్.శివరాముడు తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీలను సంబంధిత అధికారులు సమగ్రంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారాలు చూపాలని ఆదేశించారు. సమస్యలు తిరిగి రాకుండా పూర్తి స్థాయి పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు.
పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 25 ఫిర్యాదులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి 25 ఫిర్యాదులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఎస్పీ డి.నరసింహ కిశోర్ అర్జీలు స్వీకరించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే నేరుగా సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం అందించాలని ఆదేశించారు.
ఏఎస్‌ఓ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ఏఎస్‌ఓ) పోస్టు భర్తీకి స్కూల్ అసిస్టెంట్లు, ఎస్‌జీటీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ ఎస్.సుభాషిణి సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ‘జిల్లా ప్రాజెక్టు కార్యాలయం, సమగ్ర శిక్ష, రాజమహేంద్రవరం’ చిరుమానాకు పంపాలన్నారు. నోటిఫికేషన్, దరఖాస్తు నమూనా, నియమావళికి ఎంఈఓలు, సమగ్ర శిక్ష, జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయాల్లో సంప్రదించవచ్చని తెలిపారు. దరఖాస్తులను ఎస్‌ఎస్‌ఆర్‌జేవై.ఓఆర్‌జీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. మరింత సమాచారానికి 9866 77 9398 నంబరులో సంప్రదించాలని సుభాషిణి సూచించారు.


