గట్టు.. కొల్లగొట్టు | - | Sakshi
Sakshi News home page

గట్టు.. కొల్లగొట్టు

Apr 7 2026 7:43 AM | Updated on Apr 7 2026 7:43 AM

పోలవరం గట్టుపై యథేచ్ఛగా

మట్టి తవ్వకాలు

రేయింబవళ్లు తరలింపు

రూ.లక్షల్లో దందా

నల్లజర్ల: అడ్డుకునేదెవరు.. ఆపేదెవరని అనుకుంటున్నారో ఏమో! పోలవరం కుడి కాలువ గట్టుపై మట్టిని అక్రమార్కులు ఇష్టారాజ్యంగా కొల్లగొట్టేస్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా పొక్లెయిన్లతో మట్టిని తవ్వేసి, టిప్పర్లతో తరలించేసి రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. నల్లజర్ల – ఆవపాడు – సింగరాజుపాలెం గ్రామాల మధ్య ఈ దందా బహిరంగంగానే జరుగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. కాలువ గట్లపై కాలక్షేపం కోసం పేకాడుతున్న వారిని వల పన్ని పట్టుకోవడంలో పోలీసులు చూపుతున్న పట్టుదల ఈ మట్టి అక్రమ రవాణాదారులను అడ్డుకోవడంలో చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పోలవరం కుడి కాలువ గట్ల వెంబడి విలువైన ఎర్రమట్టి ఉంది. దానిపై పలువురు స్థిరాస్తి వ్యాపారులు, మట్టి మాఫియా కన్ను వేశారు. డెల్టాలో ఈ మట్టికి మంచి డిమాండ్‌ ఉంది. భవంతుల నిర్మాణానికి, లే అవుట్ల ఎత్తు పెంచడానికి, పునాదుల్లో వేయడానికి ఈ మట్టిని వినియోగిస్తున్నారు. దీంతో, కొన్నేళ్లుగా పొక్లెయిన్లతో మట్టిని తవ్వి అమ్ముకుంటున్నారు. రోజుకు తక్కువలో తక్కువ 60కి పైగా టిప్పర్లతో మట్టిని అక్రమార్కులు తరలించుకుపోతున్నారు. టిప్పర్‌ మట్టిని రూ.3 వేలకు పైగా అమ్ముకుంటున్నారు. ఈవిధంగా రోజుకు దాదాపు రూ.2 లక్షల విలువైన మట్టి దందా సాగుతోందని వైఎస్సార్‌ సీపీ నేత వామిశెట్టి పరమేశ్వరావు ఆరోపించారు. జాతీయ రహదారి పైనే టిప్పర్లతో మట్టి అక్రమ రవాణా సాగుతున్నా సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులు చూసినా మిన్నకుండి పోతున్నారని అన్నారు. అధికారులు ఇలాగే మరికొన్ని రోజులు పట్టించుకోకుండా ఊరుకుంటే పోలవరం గట్టు పూర్తిగా కనమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాన కాలువ అవసరాలకు, పటిష్టతకు అవసరమైనప్పుడు మట్టి లభ్యం కాక ఇబ్బందులు పడే పరిస్థితి ఎదురవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీస్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు స్పందించి మట్టి మాఫియాను అడ్డుకోవాలని పరమేశ్వరావు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement