రాజమహేంద్రవరం రూరల్/దేవరపల్లి/రాయవరం: జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం కుండపోత వర్షం కురిసింది. దీంతో, పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాజమహేంద్రవరం, రాయవరం, కొవ్వూరు డివిజన్‌లోని పలు మండలాల్లో హఠాత్తుగా వర్షం కురిసింది. మండుతున్న ఎండలతో కొన్నాళ్లుగా ఆపసోపాలు పడుతున్న ప్రజలు కాస్త సేద తీరారు. రాజమహేంద్రవరం మోరంపూడి జంక్షన్, హుకుంపేట జంక్షన్, రైల్వే స్టేషన్, వీఎల్ పురం తదితర ప్రాంతాల్లో రోడ్లపై భారీ ఎత్తున నీరు ప్రవహించింది. దీంతో, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేవరపల్లి, నల్లజర్ల, గోపాలపురం, కొవ్వూరు, పెరవలి తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకూ ఉరుములు, పిడుగులతో వాన దిమ్మరపోసింది. భీకరంగా వచ్చిన పిడుగుల శబ్దానికి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. గౌరీపట్నం, దుద్దుకూరు, ఐ.పంగిడి గ్రామాల్లో గుండుగొలను – కొవ్వూరు ప్రధాన రహదారి (పాతది) పూర్తిగా జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. సుమారు 3 దుక్కుల వర్షం కురిసినట్టు రైతులు అంచనా వేస్తున్నారు. అకాల వర్షానికి పలు గ్రామాల్లో వరి చేలు, అక్కడక్కడ అరటి తోటలు నేలకొరిగాయి. కళ్లాల్లో ఎండబెట్టిన మిర్చి, ధాన్యం, పసుపు, మొక్కజొన్న కండెలు తడిసి ముద్దయ్యాయి. దీంతో, రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పొగాకు తోటల్లో నీరు చేరడంతో నాణ్యత, దిగుబడి దెబ్బ తింటాయని రైతులు అంటున్నారు.


