జగ్గంపేట/ రాయవరం: అనుకోని ప్రమాదం ఆ యువకుడిని మృత్యుకుహరంలోకి లాగేసింది.. దూసుకొచ్చిన బస్సు ఆ నిండు ప్రాణాన్ని బలిగొంది. మోటారు సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ఒకరు దుర్మరణం చెందారు. జగ్గంపేట ఎస్సై రఘునాథరావు కథనం ప్రకారం.. రాయవరం గ్రామ రాజేశ్వరి కాలనీకి చెందిన దొడ్డి అచ్యుత సాయిమనోహర్ (25) అగరబత్తి కంపెనీలో పని చేస్తున్నాడు. ఆ కంపెనీ పనిపై మోటారు సైకిల్‌పై తన స్నేహితుడితో కలసి సోమవారం ఉదయం జగ్గంపేట వస్తుండగా, సీతానగరం గ్రామం వద్ద ఆర్టీసీ బస్ ఢీకొంది. దీనితో అతను అక్కడికక్కడే మృతి చెందగా, అతనితో పాటు మోటారు సైకిల్‌పై ఉన్న ఉలవకాయల శివకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ప్రథమ చికిత్స నిమిత్తం స్థానిక సీహెచ్‌సీకి తరలించి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి పంపినట్లు ఎస్సై వివరించారు. దీనిపై మనోహర్ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
రాయవరంలో విషాదం
రాయవరానికి చెందిన దొడ్డి అచ్యుత్ సాయి మనోహర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. పనిపై వెళ్లిన చిన్న కుమారుడు తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు దుర్గలక్ష్మి, సత్తిబాబులకు మృతి చెందాడన్న విషయం తెలియగానే వారు విలి పంచిన తీరు కలచివేసింది. ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరిస్తూ.. అందరితో స్నేహంగా ఉండే మనో హర్ ఇక లేడన్న వార్తను స్నేహితులు జీర్ణించుకోలేకపోయారు. శివ అన్నయ్య బాల కుమార సుబ్రహ్మణ్యంకు ఇటీవలే వివాహం నిశ్చయం కాగా, వచ్చే నెల 3న వివాహం జరగనుండగా, ఇంతలో మనోహర్ మరణవార్త కుటుంబానికి పిడుగుపాటులా మారింది.
బస్సు ఢీకొని యువకుడి మృతి


