● పరిమళించిన
108 సిబ్బంది మానవత్వం
● క్షతగాత్రుడి ప్రాణాలు కాపాడిన వైనం
అడ్డతీగల: మన్యంలో 108 వాహన సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. పోలవరం జిల్లా వై.రామవరం మండలం పి.ఎర్రగొండ పంచాయతీలోని మారుమూల గ్రామం తడికోటలో చోళ్ల చిన్నారెడ్డి (20) ఆదివారం ప్రమాదవశాత్తూ చెట్టుపై నుంచి పడి తీవ్రగాయాలతో లేవలేని స్థితిలో ఉండడంతో గ్రామస్తులు 108కి ఫోన్ చేశారు. దీంతో గ్రామానికి బయలుదేరిన 108 సిబ్బంది రహదారి సౌకర్యం లేకపోవడంతో ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఆపేసి అక్కడి నుంచి దట్టమైన అటవీ ప్రాంతంలో వాగులు, వంకలు కాలినడకన దాటి వెళ్లి క్షతగాత్రుడిని డోలీ కట్టి అతికష్టమ్మీద తీసుకొచ్చి వాహనంలో ఎక్కించారు. అక్కడి నుంచి అడ్డతీగల సీహెచ్‌సీకి తరలించి అతడి ప్రాణాలు కాపాడారు. చిన్నారెడ్డి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.


