జాతీయ రహదారిపై బైక్‌ బోల్తా | - | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారిపై బైక్‌ బోల్తా

Apr 4 2026 7:43 AM | Updated on Apr 4 2026 7:43 AM

అడ్డతీగల: మండలంలోని చేనుపాకలు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం బైక్‌ అదుపుతప్పి బోల్తా పడిన సంఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అడ్డతీగలకు చెందిన ముప్పనశెట్టి సురేష్‌ చేనుపాకలు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి పక్కనే 30 అడుగుల పైబడి లోతులోని పంట కాలువలో పడిపోయాడు. ఈ సంఘటనలో సురేష్‌ తలతో పాటు ఇతర శరీర భాగాలపై గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 వాహన సిబ్బంది వచ్చి అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని అడ్డతీగల సీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారని అంటున్నారు. అడ్డతీగల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శబరి నదిలో యువకుడి మృతి

వీఆర్‌పురం: శబరి నదిలో స్నానానికి దిగిన ఓ యువకుడు మృతి చెందాడు. ఆ వివరాల్లోకి వెళితే.. వీఆర్‌పురం మండలం రాజుపేట కాలనీకి చెందిన బోర్ర శివ (19) శుక్రవారం సాయంత్రం బంధువుతో కలసి శబరి నదిలో స్నానానికి వెళ్లాడు. స్నానం చేస్తుండగా నదీ ప్రవాహానికి శివ కొట్టుకుపోయాడు. అక్కడున్న వ్యక్తి కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ విషయం తెలుసుకున్న బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు, రెవెన్యూ సిబ్బంది శబరి బ్రిడ్జి వద్ద మత్స్యశాఖ సహకారంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 7 గంటలకు శివ మృతదేహం లభ్యమైంది.

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

ఉప్పలగుప్తం: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ ఎస్‌కే జానీబాషా కథనం ప్రకారం.. కాట్రేనికోన మండలం అడవిపేటకు చెందిన మల్లవరపు పవన్‌ (28) గురువారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై తన ఇంటికి వెళుతుండగా ఎన్‌.కొత్తపల్లి సమీపంలో ప్రధాన రహదారిలో ఎదురుగా వస్తున్న లారీ వెనుక చక్రాల కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని 108లో అమలాపురం కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పవన్‌ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి తల్లి రామలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

సామర్లకోట: స్థానిక పిఠాపురం రోడ్డులో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. సామర్లకోటలోని ఉప్పువారి వీధికి చెందిన చల్లాబత్తుల రాజు (50) రోడ్డుపై మృతి చెంది ఉన్నాడు. మోటారు సైకిల్‌పై వెళుతున్న రాజును ఏదైనా వాహనం ఢీకొందా, అతనే రోడ్డుపై పడి మృతి చెందాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాలువలో మహిళ గల్లంతు

నిడదవోలు: ఉండ్రాజవరం మండలం దమ్మెన్ను గ్రామంలో శుక్రవారం నరసాపురం పెద కాలువలో పడి ఓ మహిళ గల్లంతైంది. తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన గున్నం భార్గవి దుర్గాప్రసన్న (26) దమ్మెన్ను కొండాలమ్మ గుడిలో అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చింది. అక్కడే ఉన్న కాలువలో కాళ్లు కడుగుతున్న సమయంలో మెట్లు నాచుపట్టి ఉండటంతో ప్రమాదవశాత్తు జారి కాలువలో కొట్టుకుపోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఉండ్రాజవరం ఎస్సై రవికుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement