జగన్మోహనం.. కేశవుని కల్యాణం.. | - | Sakshi
Sakshi News home page

జగన్మోహనం.. కేశవుని కల్యాణం..

Mar 28 2026 7:42 AM | Updated on Mar 28 2026 7:42 AM

భక్తజన సంద్రమైన ర్యాలి క్షేత్రం

ఘనంగా స్వామివారి

కల్యాణ మహోత్సవాలు ప్రారంభం

కొత్తపేట/ఆత్రేయపురం: చరిత్ర ప్రసిద్ధి గాంచిన స్వయంభూ క్షేత్రం ర్యాలిలోని జగన్మోహిని కేశవస్వామి కల్యాణం శుక్రవారం అంగరంగ వైభవంగా సాగింది. వేద పండితులు శ్రీనివాసుల వెంకటాచార్యులు, అర్చకులు వేద పండితులు భక్తజనం నడుమ ఈ కల్యాణాన్ని నిర్వహించారు. స్వామివారి దంపతులకు ఆలయ చైర్మన్‌ మెర్ల నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు, ఆలయ ఈవో భాగవతుల వెంకటరమణమూర్తి దంపతులు నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయం స్వామి వారికి మేలుకొలుపు, పంచామృత అభిషేకాలు, నిత్యౌపాసన, బలిహరణ, నీరాజనం మంత్రపుష్పం, వేద పారాయణ నిర్వహించారు. తొలుత స్వామి వారిని పెండ్లి కుమారునిగా, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా పట్టు వస్త్రాలతో అలంకరించారు. అత్యంత వేడుకగా తలంబ్రాలు పోయించారు. సాయంత్రం గరుడ వాహనంపై స్వామికి సన్నాయి, మేళతాళాలతో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకు వచ్చి వైభవంగా కల్యాణం నిర్వహించారు. కంకణధారణ కన్యాదానం, సూత్రధారణ, యజ్ఞోపవీత ధారణ, వరపూజ, తలంబ్రాలు తదితర తంతులు కన్నుల పండుగగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొని తిలకించి పులకించారు. ఆలయ ఈవో భాగవతుల వెంకటరమణ మూర్తి, జూనియర్‌ అసిస్టెంట్లు మేడిద శ్రీను, దత్తు, సునీత, కళ్యాణోత్సవానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.

ఏకశిలగా స్వామి, అమ్మవార్ల రూపం

ఏక శిలలో ముందు పురుష రూపం, వెనక సీ్త్ర రూపంతో జగన్మోహినీ, విష్ణుమూర్తి సాక్షాత్కరించే అద్భుత నిలయం ఆత్రేయపురం మండలం ర్యాలి. ఈ క్షేత్రంలో వెలసిన జగన్మోహినీ కేశవస్వామి వారి ఆలయంలో అణువణువునా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంటుంది. శుక్రవారం ప్రారంభమైన కల్యాణోత్సవాలు వచ్చే నెల 3 వరకూ వైభవంగా నిర్వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఆరో దేవాలయంగా ఇది ఖ్యాతికెక్కిన ఇక్కడి శిలారూప స్వామి అమ్మవార్లు స్వయంభువుగా వెలిశారని చరిత్ర చెప్తోంది. భక్తులందరికీ ఇక్కడ గర్భాలయ ప్రవేశం ఉండడం విశేషం. అంతే కాక ఈ ఆలయానికి ఎదురుగా పడమర వైపు ఉమా కమండలేశ్వర స్వామి ఆలయం ఉండటం మరో విశేషం. కాగా శివాలయంలో నీరు ఇంకి పోవడం, జగన్మోహునుడి ఆలయంలో స్వామి వారి పాదాల నుంచి నిరంతరం నీరు (గంగ) ఉప్పొంగడం సృష్టి రహస్యాలుగా చరిత్రకారులు చెప్తుంటారు.

ఆలయ చరిత్ర ఎంతో విశిష్టం

ఈ ఆలయంలో ప్రత్యేకతలకు తగినట్లే ఆ దైవం అవతరించిన విధానానికి కూడా ఓ అద్భుత చరిత్ర ఉంది. రాక్షస సంహారంలో భాగంగా ఇక్కడి స్వామివారు అవతరించారని స్థల పురాణం బట్టి తెలుస్తోంది. ఇటు గౌతమి, అటు వశిష్ట నదీ పాయల మధ్య రూపుదిద్దుకున్న ఈ ఆలయ స్థాపనకు, ఈ గ్రామానికి ర్యాలి అన్న పేరు రావడానికి కూడా ఒక కథ ఉన్నట్టు పండితులు చెప్తుంటారు. విక్రమదేవుడు అనే భక్తుడు అడవిగా ఉన్న ఈ ప్రాంతంలో వేటాడుతూ ఒక చెట్టు వద్ద నిద్రించాడు. అతనికి మహావిష్ణువు కలలో కనపడి శిలా రూపంలో నేను ఈ ప్రాంతంలో ఉన్నానని, నీవు కర్రతో రథం చేయించి లాగుతూ వెళ్తే ఆ రథం శీల ఎక్కడ రాలి పడుతుందో అక్కడ తవ్వితే నా విగ్రహం బయటపడుతుందని చెప్పి అదృశ్యమైనట్టు ఓ కథనం ప్రచారంలో ఉంది. ఆ ప్రకారం విక్రమ దేవుడి ద్వారా ఈ విగ్రహం బయట పడిందని చారిత్రక కథనం. రథం శీల రాలడం వల్ల ఈ దైవం వెలసిన ప్రాంతానికి ‘ర్యాలి’ అని పేరు వచ్చినట్టు పెద్దలు చెప్తారు.

గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగిస్తున్న భక్తులు, ఆలయ సిబ్బంది

ర్యాలి కళ్యాణానికి హాజరైన భక్తులు

కల్యాణ మహోత్సవాలు ఇలా

దేవస్థానం పాలకమండలి చైర్మన్‌ మెర్ల నాగేశ్వరరావు పర్యవేక్షణలో, ఈఓ భాగవతుల వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం నుంచి 30వ తేదీ వరకు స్వామివారికి అభిషేకం, తులసి పూజ, అమ్మవారికి కుంకుమార్చన తదితర కార్యక్రమాలు, 31 న సదస్యం, ఏప్రియల్‌ 2న చక్రస్నానం, 3న శ్రీపుష్పోత్సవంతో కల్యాణ మహోత్సవాలు ముగుస్తాయని ఈఓ భాగవతుల వెంకటరమణమూర్తి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement