భక్తులకు మెరుగైన వసతులే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

భక్తులకు మెరుగైన వసతులే లక్ష్యం

Mar 28 2026 7:42 AM | Updated on Mar 28 2026 7:42 AM

దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌

అన్నవరంలో అభివృద్ధి పనుల పరిశీలన

మెట్లమార్గంలో షెల్టర్లు, వ్యాపార స్థలాల

అతిక్రమణపై సిబ్బందికి సూచనలు, ఆదేశాలు

అన్నవరం: రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాలు సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ, కాణిపాకం, శ్రీశైలం, శ్రీకాళహస్తికి వచ్చే భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై చర్యలు తీసుకుంటున్నట్టు దేవదాయశాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ తెలిపారు. మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రసాదాల నాణ్యత పెంచడం, సులభంగా దర్శనం, ఏ స్థాయిలోనూ భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. శుక్రవారం ఆలయంలో సాగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన సర్వేల ప్రకారం తక్కువ ర్యాంకులు వచ్చిన ఆలయాలలో సైతం భక్తుల సంతృప్తి శాతం సరాసరిన 70 శాతం ఉందని, దీనిని 80 శాతానికి పెంచాలని కృషి చేస్తున్నామని తెలిపారు. అన్నవరం దేవస్థానం సాధించిన మొదటి ర్యాంకును నిలబెట్టుకునేలా మౌలిక వసతులు కల్పించాలని ఈఓ త్రినాథరావును ఆదేశించారు.

శుభ్రత అవసరం

దేవస్థానంలోని సత్రాలు, పరిసరాల వద్ద శుభ్రత పాటించాలని, సత్రాల చుట్టూ సీసీ టీవీ కెమేరాలు ఏర్పాటు చేసి నిరంతరం పరిశీలించాలని ఆదేశించారు. సత్యగిరిపై హరిహరసదన్‌ చుట్టూ తిరిగి పలు సూచనలిచ్చారు.

మన మిత్ర, కియోస్క్‌ల ద్వారా సేవలు

దేవస్థానాలకు వచ్చే భక్తులు క్యూలైన్లలో నిలబడి అవస్థలు పడకుండా ఆన్‌లైన్‌ ద్వారా సేవలు అందిస్తున్నామని, ఇందు కోసం మన మిత్ర వాట్సాప్‌ యాప్‌ తీసుకువచ్చామని దీని ద్వారా దర్శనం, వ్రతం, ప్రసాదం, ఇతర సేవలు పొందవచ్చునని తెలిపారు. అలాగే కియోస్క్‌ల ద్వారా కూడా భక్తులు టిక్కెట్లు పొందవచ్చని తెలిపారు. ప్రముఖ దేవస్థానాల్లో సైతం వంద కియోస్కులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

రెండో మెట్లదారిపై సంతృప్తి

దేవస్థానం టోల్‌గేట్‌ నుంచి ఆలయం వరకు నిర్మించిన రెండో మెట్లదారిని కమిషనర్‌ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మెట్లదారికి ఇరువైపులా రెయిలింగ్‌ వేయాలని, వర్షాలకు, ఎండల నుంచి రక్షణకు షెల్టర్లు నిర్మించాలని ఆదేశించారు. త్వరలో మెట్ల దారి ప్రారంభోత్సవంతో పాటు, సీతారామ సత్రానికి శంకుస్థాపన చేసేందుకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఆహ్వానించనున్నట్టు తెలిపారు. దేవాలయాలలో ప్రసాదం, అన్నదానం తయారీకి తగినన్ని గ్యాస్‌ సిలిండర్లు ఉన్నాయని కమిషనర్‌ తెలిపారు. ముందు జాగ్రత్తగా గ్యాస్‌ ఏజెన్సీల నుంచి దేవస్థానాలకు పైప్‌ లైన్ల ద్వారా గ్యాస్‌ సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అలాగే ప్రైవేటు వ్యాపారులు వారి స్థలాన్ని అతిక్రమించి వ్యాపారాలు చేసుకోవడంపై సంబంధిత సెక్షన్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి వాటిని నోటీసులు ఇచ్చి తొలగించాలని, లేని పక్షంలో రూ.50 వేల జరిమానా విధించాలని ఈవోను ఆదేశించారు. ఆలయ చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ వి.త్రినాథరావు, అసిస్టెంట్‌ కమిషనర్‌ మంజులా దేవి, ఈఈలు నూకరత్నం, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement