పెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారా అనే విషయం శుక్రవారం చర్చనీయాంశమైంది. పెద్దాపురం మహారాణి సత్రంలో శ్రీరామ నవమి వేడుకల సందర్బంగా సత్రం నిర్వాహకులు ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఒక ఫ్లెక్సీపై నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే, పెద్దాపురం నియోజకవర్గం అని, మరో ఫ్లెక్సీపై నిమ్మకాయల రంగనాగ్, ఎమ్మెల్యే, తెలుగుదేశంపార్టీ కాకినాడ ఉపాధ్యక్షుడు అని స్వాగతం పలుకుతూ మహారాణి సత్రం ఈఓ పేరున ఏర్పాటైంది. ఒక నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలా అనే చర్చ జరిగింది. ఈ విషయం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.
1న అండర్–19
క్రికెట్ జట్టు ఎంపికలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1న అండర్–19 విభాగంలో క్రికెట్ క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్ష, కార్యదర్శులు తలాటం హరీష్, వెంకటేష్ శుక్రవారం తెలిపారు. రంగరాయ వైద్య కళాశాల క్రీడా ప్రాంగణంలో ఉదయం 8 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయన్నారు. 2007 తరువాత జన్మించిన వారు ఈ ఎంపికలకు అర్హులన్నారు. జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, క్రికెట్ కిట్, వైట్ దుస్తులు, బూట్లుతో హాజరుకావాలని కోరారు. వివరాలకు 90631 68999 నెంబరులో సంప్రదించాలని తెలిపారు.
వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి
అల్లవరం: మండలం దేవగుప్తం ప్రధాన రహదారిపై చింతలమెరక వద్ద రైస్ వ్యాన్ ఢీకొని అదే ప్రాంతానికి చెందిన గాడ మరిడియ్య (54) అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు రెల్లుగడ్డ పంచాయతీ ఎలువుల్లంక గ్రామానికి చెందిన బొంతు నాగార్జున తన రైస్ వ్యాన్‌తో అమలాపురం వైపు వెళ్తున్నాడు. అదే సమయానికి వాటర్ టిన్నుతో మరిడియ్య తన సైకిల్‌పై ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అతడి తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అల్లవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సంపత్‌కుమార్ తెలిపారు.
వ్యక్తి అదృశ్యంపై
కేసు నమోదు
పి.గన్నవరం: మండలంలోని జొన్నల్లంక గ్రామానికి చెందిన వ్యక్తి అదృశ్యమైన ఘటనపై శుక్రవారం కేసు నమోదు చేసినట్టు ఎస్సై బి.శివకృష్ణ తెలిపారు. ఈనెల 18న చందాడి శ్రీను (33) జొన్నల్లంక నుంచి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నంలోని అత్తవారి ఇంటికి వెళ్తున్నట్టు చెప్పాడు. అయితే అతడు అక్కడికి వెళ్లలేదని తెలుసుకుని కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలలో గాలించినప్పటికీ ఆచూకీ తెలియలేదు. దీంతో అతడి తల్లి మారమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు.
రిజర్వాయర్‌లో
మృతదేహం లభ్యం
గంగవరం: ఈ నెల 25న సూరంపాలెం రిజర్వాయర్‌లో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై వెంకయ్య తెలిపారు. గురువారం ఉదయం మృతదేహం రిజర్వాయర్ నీటిలో తేలింది. మృతదేహం మండలం నెల్లిపూడి గ్రామానికి చెందిన కుంజర్ల ఈశ్వర వరప్రసాద్ (21)దిగా గుర్తించినట్టు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని అడ్డతీగల ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి శుక్రవారం వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.


