మట్టి మాఫియా | - | Sakshi
Sakshi News home page

మట్టి మాఫియా

Mar 28 2026 7:42 AM | Updated on Mar 28 2026 7:42 AM

ఫ రాజానగరంలో

యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు

ఫ నియోజకవర్గ వ్యాప్తంగా

13 చెరువులు గుల్ల

ఫ మరోవైపు కరుగుతున్న

ఎర్ర మట్టి కొండలు

ఫ రోజూ వందల లారీలతో

అక్రమ రవాణా

ఫ రూ.కోట్లు దండుకుంటున్న

కూటమి నేతలు

సాక్షి, రాజమహేంద్రవరం: రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. చెరువులను చెరబట్టేస్తోంది. ఇష్టానుసారం తవ్వేస్తూ గుల్ల చేసేస్తోంది. విచ్చలవిడిగా గ్రావెల్‌ తవ్వకాలతో కొండలను కరిగించేస్తోంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా కూటమిలోని ప్రధాన నేతల కనుసన్నల్లో అడ్డూ అదుపు లేకుండా అక్రమ తవ్వకాలు సాగిస్తూ.. రూ.కోట్లు కొల్లగొడుతోంది. ప్రధానంగా టీడీపీ, జనసేన నేతల నేతృత్వంలో అవినీతి దందా ‘మూడు టిప్పర్లు.. ఆరు లారీలు’ అన్న చందంగా సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

చెరువులను చెరబట్టి..

ఇటీవల రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కోరుకొండలో మీడియాతో మాట్లాడుతూ, మెరక వేసిన చెరువుల్లో మట్టిని అవసరమైన వారందరూ తవ్వుకోవచ్చని, దీనికి ఎలాంటి అనుమతులూ అవసరం లేదని ప్రకటించారు. ఇదే అదనుగా పూడికల తొలగింపు పేరుతో మట్టి మాఫియా చెరువులను చెరబట్టింది. నియోజకవర్గ వ్యాప్తంగా 13 చెరువుల్లో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. చెరువుల్లో నీటిని తోడేసి మరీ మట్టిని తవ్వేస్తున్నారు. ప్రధానంగా నర్సాపురం, మునగాల, మధురపూడి, కోటి, తుంగపాడు, జి.యర్రంపాలెం, సంపత్‌నగరం, నామవరం, భూపాలపట్నం, కలవచర్ల, మల్లంపూడి, తూర్పుగానుగూడెం, తోకాడ తదితర గ్రామాల్లోని చెరువుల్లో ప్రతి రోజూ వందలకొద్దీ టిప్పర్లలో మట్టిని తరలించేస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధి అనుచరుల కనుసన్నల్లో ఈ దందా జరుగుతూండటంతో వారిని అడ్డుకునేవారే కరువయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కరుగుతున్న కొండలు

నియోజకవర్గంలోని రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాల్లో ఎర్రమట్టి కొండలు పుష్కలంగా ఉన్నాయి. మట్టి మాఫియా ధనదాహానికి ఇప్పటికే సింహభాగం కొండలు కరిగిపోయాయి. కొండగుంటూరు, జి.యర్రంపాలెం, తుంగపాడు, కోటికేశవరం, రాఘవపురం, మునగాల, నల్గొండలోని కొండలను విచ్చలవిడిగా తవ్వేసి గ్రావెల్‌ను అక్రమంగా తరలించేశారు. గోరంత అనుమతి తీసుకుని.. కొండంతా తవ్వేస్తున్నా అడ్డుకునే వారే లేకుండా పోతున్నారు.

పోలవరం గట్టును సైతం..

రాజానగరం మండలం కలవచర్లతో పాటు పొరుగునే ఉన్న కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారి వద్ద పోలవరం కాలువ గట్లను సైతం మట్టి మాఫియా వదిలిపెట్టడం లేదు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా కాలువకు ఇరువైపులా 30, 40 అడుగుల ఎత్తున ఉన్న గట్లను ఇష్టారాజ్యంగా తవ్వేసి, మట్టి తరలించుకుపోతున్నారు. ప్రభుత్వ పనుల పేరుతో భారీ యంత్రాలు సైతం వినియోగించి, ఆ మట్టిని ప్రైవేటు లే అవుట్లకు తరలించి, సొమ్ము చేసుకుంటున్నారు. మురారి, కలవచర్ల ప్రాంతాల నుంచి నిత్యం వందల లారీల్లో మట్టి అక్రమంగా తరలిస్తున్నారంటే.. దోపిడీ ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. నిత్యం వందలాదిగా మట్టి లారీలు తిరుగుతూండటంతో రోడ్లు దెబ్బ తిని, దుమ్ము, ధూళితో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ దందాపై ఆగ్రహించిన కలవచర్ల గ్రామస్తులు గతంలో అర్ధరాత్రి వేళ లారీలను అడ్డుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ మట్టి అక్రమ తవ్వకాలకు మాత్రం బ్రేక్‌ పడటం లేదు. అధికారులు దాడులు చేసి ఫైన్లు వేస్తే రెండు రోజులు మిన్నకుంటున్నారు. అనంతరం తిరిగి అక్రమ తవ్వకాలు, రవాణా ప్రారంభింస్తున్నారు. ప్రజాప్రతినిధి అనుచరులు కావడంతో అడ్డుకునేందుకు ఎవరూ సాహసించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

వాటాల కోసం ముష్టియుద్ధం

ఫ మట్టి డబ్బుల్లో వాటాల కోసం కలవచర్లలో టీడీపీ, జనసేన నేతల మధ్య ముష్టియుద్ధం నడిచింది. తమకు కావాలంటే తమకు కావాలంటూ ఇరు పార్టీల నేతలూ వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.

ఫ కోరుకొండ మండలం గాడాలలో అయితే, ‘భూ బకాసురుల నుంచి ఊర చెరువును రక్షించండి’ అంటూ ఏకంగా ఓ ఫ్లెక్సీయే ఏర్పాటు చేశారు. పైగా, ఈ అక్రమ తవ్వకాలతో టీడీపీ, బీజేపీలకు సంబంధం లేదని మరీ ప్రకటించారు. దీనిని బట్టి మట్టి మాఫియా ఏవిధంగా రెచ్చిపోతోందో అర్థం చేసుకోవచ్చు.

నెలకు రూ.60 కోట్లకు పైగా దోపిడీ!

నల్లరేగడి మట్టి అయితే కడియం, ఆలమూరు, రావులపాలెం ప్రాంతాల్లోని ఇటుక బట్టీలు, భవన నిర్మాణాలు, రియల్‌ ఎస్టేట్‌ లే అవుట్లను ఎత్తు చేసేందుకు తరలిస్తున్నారు. ఎర్రమట్టి అయితే కడియం నర్సరీలకు తరలిస్తున్నారు. దూరం, డిమాండ్‌ను బట్టి మట్టికి ధర నిర్ణయిస్తున్నారు. నల్లరేగడి, ఇసుక నేలల్లోని మట్టిని టిప్పర్‌కు రూ.10 వేలు, ఎర్ర మట్టి (గ్రావెల్‌) రూ.20 వేల నుంచి రూ.25 వేల చొప్పున విక్రయిస్తున్నారు. అధికారికంగా రోడ్డు అభివృద్ధి పనులకు సైతం ఎర్ర గ్రావెల్‌ వాడుతూంటారు. మట్టి మాఫియా దీనిని కూడా అవకాశంగా తీసుకుంటోంది. నియోజకవర్గ వ్యాప్తంగా 13 ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు జరుగుతూండగా.. ప్రతి రోజూ 3 వేల లారీలు, టిప్పర్లతో మట్టి, గ్రావెల్‌ తరలుతోంది. ఇలా రోజుకు రూ.2 కోట్లకు పైగా అక్రమార్కుల జేబుల్లోకి వెళుతున్నట్లు సమాచారం. ఈవిధంగా నెలకు రూ.60 కోట్లకు పైగా కొల్లగొడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇందులో ఎవరి వాటా వారి జేబుల్లోకి చేరుతోందని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement