డ్వాక్రా సభ్యురాలిపై యానిమేటర్‌ భర్త హత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

డ్వాక్రా సభ్యురాలిపై యానిమేటర్‌ భర్త హత్యాయత్నం

Mar 27 2026 8:53 AM | Updated on Mar 27 2026 8:53 AM

ఆటోతో ఢీకొట్టి గొడ్డలితో దాడి

గోకవరం: డ్వాక్రా సభ్యురాలిపై యానిమేటర్‌ భర్త హత్యాయత్నం చేసిన ఘటన గోకవరం మండలం కొత్తపల్లి శివారు పెట్రోల్‌ బంకు వద్ద గురువారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం కామరాజుపేటలోని స్థానిక దుర్గాకాలనీకి చెందిన చిత్తా లావణ్య మహిళా సంఘం సభ్యురాలు. ఆమె గురువారం ఉదయం తన కుమార్తెను కొత్తపల్లిలోని ఆదర్శ ఫార్మశీ కళాశాలకు స్కూటీపై తీసుకువెళుతున్న క్రమంలో ఆయిల్‌ కోసం పెట్రోల్‌ బంకులోకి వెళ్లింది. ఈ క్రమంలో దుర్గాకాలనీకి చెందిన కనకాల దుర్గాప్రసాద్‌ ఆమె స్కూటీని వెనుక నుంచి ఆటోతో ఢీకొట్టాడు. వెంట తెచ్చుకున్న గొడ్డలితో ఆమె మెడపై, తలపై, వెన్నుపై దాడి చేశాడు. ఆమె కుమార్తె, బంకు సిబ్బంది, స్థానికులు ఆడ్డుకోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు గోకవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై గోకవరం ఎస్సై పవన్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దాడి వెనుక పాత కక్షలే కారణం

ఈ దాడి వెనుక పాత కక్షలే కారణమని స్థానికులు చెబుతున్నారు. దాడికి పాల్పడిన ఆటోడ్రైవర్‌ కనకాల దుర్గాప్రసాద్‌ భార్య దుర్గ యానిమేటర్‌గా పని చేస్తున్నారు. క్షతగాత్రురాలు, వీరు స్థానికంగా ఎదురెదురు ఇళ్లల్లో ఉంటున్నారు. డ్వాక్రా లోను విషయంలో యానిమేటర్‌ దుర్గ, క్షతగాత్రురాలు లావణ్యల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో దుర్గపై లావణ్య ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. తన భార్యపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిందనే కారణంతో కక్ష కట్టి ఉద్దేశపూర్వకంగా దుర్గాప్రసాద్‌ ఈ దాడికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. క్షతగాత్రురాలి భర్త స్థానికంగా ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఈ దాడి వెనుక మరో ఉపాధ్యాయుడి హస్తం ఉందని, దానిపై విచారణ నిర్వహించాలని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఆర్‌డీఏ పీడీ నగేష్‌ గోకవరంలో విచారణ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement