నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం | - | Sakshi
Sakshi News home page

నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం

Mar 9 2026 7:27 AM | Updated on Mar 9 2026 7:27 AM

కాకినాడలో ఓ మహిళ నిర్వాకం

కాంట్రాక్టు ఉద్యోగి చనిపోతే

భార్యకు రెగ్యులర్‌ ఉద్యోగం

కీలకంగా వ్యవహరించిన

సీనియర్‌ అసిస్టెంట్‌

కాకినాడ, ‘తూర్పు’ కలెక్టర్లు సీరియస్‌

మహిళ సస్పెన్షన్‌

అమర్‌కాంత్‌ సరెండర్‌కు ఆదేశాలు

కాకినాడ క్రైం: నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం పొందిన ఓ మహిళ పైన, ఆమెకు సహకరించిన ప్రభుత్వ ఉద్యోగిపైన కాకినాడ జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్‌ తీవ్ర చర్యలు తీసుకున్నారు. వివరాలివీ..

కాకినాడకు చెందిన చెరుకూరి (పోల) హేమలత భర్త వినయ్‌ సంపత్‌ ఐదేళ్ల క్రితం కోవిడ్‌తో మృతి చెందాడు. ఆయన కాకినాడలో ప్రభుత్వ కాంట్రాక్టు విధానంలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పని చేసేవాడు. భర్త చనిపోయిన కొద్ది రోజులకు హేమలత డీఎంహెచ్‌ను ఆశ్రయించింది. తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరింది. అప్పట్లో ఆ కార్యాలయం పీఓడీటీటీ విభాగంలో పని చేస్తూ, డెప్యూటేషన్‌పై రాజమహేంద్రవరంలోని అర్బన్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ సెంటర్‌కు వెళ్లిన సీనియర్‌ అసిస్టెంట్‌ కేశవ అమర్‌కాంత్‌ అగస్త్యకు ఈ విషయం తెలిపింది. ఆమె అవసరాన్ని ఆసరాగా తీసుకున్న అమర్‌కాంత్‌ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. వారి పరిచయం ద్విచక్ర వాహనాలపై కలిసి తిరిగేంత వరకూ వెళ్లింది. అర్జీదారుతో ఎందుకంత ఉన్నతాధికారులు చనువని ప్రశ్నిస్తే తన మేనకోడలని అమర్‌కాంత్‌ చెప్పేవాడు. ఈ క్రమంలో అతడు కాకినాడ డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలకు బదిలీ అయ్యాడు. ఆ కళాశాలలో అప్పటికి 10 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదే అదనుగా అతడు కారుణ్య నియామక కోటాలో హేమలతకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని భావించాడు. నిబంధనల ప్రకారం ఆ నియామకం కేవలం ప్రభుత్వ ఉద్యోగి భాగస్వామికే తప్ప కాంట్రాక్టు ఉద్యోగి భాగస్వామికి వర్తించదు.

కలెక్టర్‌కే బురిడీ...

ఈ నేపథ్యంలో అమర్‌కాంత్‌ నకిలీ పత్రాలతో హేమలత భర్త సంపత్‌ది రెగ్యులర్‌ ఉద్యోగని నమ్మించి ప్రభుత్వ ఖజానా నుంచే జీతాలు అందుకున్నట్లు, ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపు కార్డు, ఎస్‌ఆర్‌ ఎంట్రీ తయారు చేశాడు. వీటితో అప్పటి కలెక్టర్‌నే బురిడీ కొట్టించి ఆయన సంతకంతోనే రెండేళ్ల క్రితం హేమలతకు ప్రభుత్వ ఉద్యోగం వేయించాడు.

చర్యలకు ఆదేశం

ఈ నివేదికను పరిశీలించిన కలెక్టర్‌ షణ్మోహన్‌ బాధ్యులిద్దరి పైనా తక్షణ చర్యలకు సిఫారసు చేశారు. విచారణ నివేదికను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి, రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ కేవీ శివప్రసాద్‌కు పంపారు. ఈ నేపథ్యంలో అమర్‌కాంత్‌ను ‘తూర్పు’ కలెక్టర్‌ కీర్తి ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. మోసపూరితంగా ప్రభుత్వ ఉద్యోగం పొందిన హేమలతను సస్పెండ్‌ చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం చర్యలు చేపట్టనున్నట్లు రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల అధికారులు తెలిపారు.

కలెక్టర్‌కు ఫిర్యాదుతో వెలుగులోకి..

ఈ విషయం ఎలాగోలా బయటకు పొక్కింది. ఈ నేపథ్యంలో కొందరు నిరుద్యోగులు ఓ సంఘ నాయకుల సాయంతో గత ఏడాది అక్టోబర్‌లో కలెక్టర్‌ షణ్మోహన్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు డీఎంహెచ్‌ఓ నరసింహ నాయక్‌ త్రిసభ్య కమిటీని నియమించారు. ఈ కమిటీ రాజమహేంద్రవరంలో పని చేస్తున్న హేమలతను కాకినాడ పిలిపించి విచారించి అసలు విషయాన్ని గుర్తించింది. ఆమె అందించిన ప్రతి పత్రం నకిలీదేనని, ఇదంతా అమర్‌కాంత్‌ ఆడించిన నాటకమని కమిటీ గుర్తించింది. ఇదే విషయాన్ని డీఎంహెచ్‌ఓ ఆధ్వర్యాన కలెక్టర్‌కు నివేదించింది.

Advertisement
 
Advertisement
Advertisement