శ్రీహరి ధామాలు.. నవ పారిజాతాలు
● గోదారి తీరంలో
జనార్దనుడి తొమ్మిది ఆలయాలు
● ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు..
భక్తుల సందడి
● నవగ్రహాల ఆరాధన ఈ దేవళాల్లో ప్రత్యేకత
ఆలమూరు: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గౌతమీ తీరంలో కొలువై ఉన్న నవ జనార్దనస్వామి ఆలయాలు సంక్రాంతి ముగిసే వరకూ దేశవ్యాప్తంగా విచ్చేసే భక్తులతో సందడి చేయనున్నాయి. ధనుర్మాసంలో ఈ నవ జనార్దనులను దర్శించుకుంటే సకల పాపాలు తొలగి నవగ్రహ దోషాలు హరిస్తాయని భక్తుల ప్రగాడ విశ్వాసం. అందులో భాగంగా పలు రాష్ట్రాల నుంచి వచ్చే టూరిస్టులు ఈ దేవాలయాలను ఏటా దర్శించుకుంటారు. సాధారణంగా నవగ్రహ ఆలయాలు శైవ క్షేత్రాల్లో మాత్రమే ఉంటాయి. అందులో భక్తులు నవగ్రహ శాంతి పూజలు నిర్వహించుకుంటారు. అయితే ఈ నవ జనార్దనస్వామి ఆలయాల్లో కూడా నవగ్రహ పూజలు జరుగుతాయి.
స్వయంభూగా భాసిల్లుతూ..
ఈ నవ జనార్దనులు స్వయంభూగా భాసిల్లుతున్నారు. సోమకాశురుడనే రాక్షసుడు చతుర్వేదాలను నాశనం చేసే క్రమం నుంచి రక్షించాలన్న దేవతల కోరిక మేరకు బ్రహ్మదేవుడు శ్రీమహావిష్ణువును వేడుకుంటాడు. క్షీరసాగరం నుంచి శ్రీమహావిష్ణువు భూమిపైకి వచ్చి రాక్షసుణ్ణి సంహరించి వేదాలను రక్షిస్తాడు. అదే సమయంలో నారద మహాముని ఆకాశం నుంచి భువికి తపస్సు చేసుకునేందుకు వస్తాడు. నవ గ్రహాల ప్రభావంతో జనులు కష్టాలు పడుతున్నారని గుర్తించిన నారద మహాముని వైకుంఠం వెళ్లి శ్రీమహావిష్ణువుకు వివరిస్తాడు. జనులను కష్టాల నుంచి విముక్తులను చేయాలని వేడుకుంటాడు. అందులో భాగంగానే శ్రీమహా విష్ణువు ప్రజల రక్షణార్థం గౌతమీ గోదావరి తీరం వెంబడి తొమ్మిది ప్రదేశాల్లో స్వయంభూగా వెలిశాడని పండితులు చెబుతున్నారు. స్వయంభూగా వెలసిన విగ్రహాల వద్ద నారద మహాముని ఆలయాలను నిర్మించాడని పురాణేతిహాసాలు చెబుతున్నాయి.
ముద్రల రూపంలో దర్శనం
నవ జనార్ధనస్వామి ఆలయాల్లో శ్రీమహావిష్ణువు ముద్రల రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఆలయాలు ఒక్కొక్కటి ఒక్కో విధంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
దర్శనంతో సుఖశాంతులు
రాష్ట్రానికే గాక యావత్ భారతావనికి ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఈ నవ జనార్దన క్షేత్రాలు విరాజిల్లుతున్నాయి. పవిత్రమైన ధనుర్మాసంలో భక్తులు ఆలయాలను సందర్శిస్తే నవ గ్రహదోషాల నివారణ జరుగుతుంది. సుఖశాంతులు కలుగుతాయి.
– అంగర గోపాల కృష్ణమాచార్యులు, శ్రీవేణుగోపాలస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు, సంధిపూడి
శ్రీహరి ధామాలు.. నవ పారిజాతాలు
శ్రీహరి ధామాలు.. నవ పారిజాతాలు


