‘ధర్మంతో వ్యాపారం చేసేవాడు నీచుడు’ | - | Sakshi
Sakshi News home page

‘ధర్మంతో వ్యాపారం చేసేవాడు నీచుడు’

Dec 19 2025 8:17 AM | Updated on Dec 19 2025 8:17 AM

‘ధర్మంతో వ్యాపారం చేసేవాడు నీచుడు’

‘ధర్మంతో వ్యాపారం చేసేవాడు నీచుడు’

మంత్ర విద్య సంప్రదాయబద్ధంగా నేర్వాలి

సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): ధర్మంతో వ్యాపారం చేసేవాడు నీచుడంటూ ధర్మరాజు చెబుతాడని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాస భారత ప్రవచనాన్ని ఆయన గురువారం కొనసాగించారు. ‘భీష్మ, ద్రోణ, కృపాచార్యులను, అశ్వత్థామ, కర్ణులను నిర్జించడానికి కావలసిన అస్త్ర సంపద మన వద్ద లేదని సోదరులకు ధర్మరాజు చెబుతాడు. ఆ సమయంలో వ్యాస మహర్షి వచ్చి ధర్మరాజును ఏకాంతంలోకి పిలిచి, ప్రతిస్మృతి విద్యను బోధించి, దీనిని అర్జునుడికి ఉపదేశించాలని చెబుతాడు. ఆయన స్వయంగా అర్జునుడికి ఉపదేశించకుండా అన్నగారికి ఎందుకు ఉపదేశించాడనే సందేహం మనకు రావచ్చు. మంత్రవిద్యకు కొన్ని సంప్రదాయాలు, మర్యాదలు ఉన్నాయి. కొడుక్కి తండ్రి, తమ్ముడికి అన్న, భార్యకు భర్త మంత్రాన్ని ఉపదేశించవచ్చు’ అని వివరించారు. ‘నాకు నా మొగుడితో పడటం లేదు.. ఏదైనా మంత్రం చెప్పండని అడగరాదు’ అంటూ చమత్కరించారు. ‘‘భూలోక కాలగణన ప్రకారం ఐదు సంవత్సరాలు అర్జునుడు ఇంద్రలోకంలో ఉన్నాడు. అస్త్ర విద్యతో పాటు నీవు సంగీత నృత్యాలు నేర్చుకోవడం మంచిదని నాకు అనిపిస్తోదంటూ అతడికి ఇంద్రుడు చెబుతాడు. భారతీయ సంగీత నృత్యాలు దేవనిర్మిత కళలు. ఊర్వశి వంక అర్జునుడు ప్రత్యేకంగా చూశాడని గమనించిన ఇంద్రుడు.. అలంకరించుకుని అర్జునుడిని సేవించాలని ఆమెను ఆదేశిస్తాడు. అప్పటికే అర్జునుడిపై మరులుగొన్న ఊర్వశి సర్వాంగసుందరంగా అలంకరించుకుని అతడిని చేరుతుంది. ఆమెను చూసిన అర్జునుడు సిగ్గుతో తల వంచుకుని గురుభావంతో నమస్కరిస్తాడు. ఊర్వశి తన రాకలోని ఆంతర్యాన్ని వివరిస్తుంది. ‘నాకు కుంతి, మాద్రి ఎటువంటి వారో, శచీదేవి ఎటువంటిదో, నీవూ అటువంటి దానివే. నీవు నాకు తల్లిలా పూజ్యురాలివి. కొడుకులా నన్ను ఆదరించు’ అని అర్జునుడు అడుగుతాడు. దేవలోకంలో అటువంటి కట్టుబాట్లు లేవని ఊర్వశి అంటుంది. ‘నీవు కురువంశానికి మూలమైన పౌర వంశానికి చెందిన ఆదిజననివి. అందుకని నిన్ను అలా చూశాను కానీ, కామదృష్టితో కాద’ని అర్జునుడు చెబుతాడు. తనను తిరస్కరించినందుకు నీవు సిగ్గూ ఎగ్గూ లేకుండా సీ్త్రల మధ్య నపుంసకునిలా తిరుగుతావని ఆమె శపించింది. అజ్ఞాతవాస కాలంలో ఈ శాపం నీకు వరమవుతుందని అర్జునుడితో ఇంద్రుడు అంటాడు. పితృపితామహుల నుంచి వచ్చిన రాజ్య సంపదలపై నీ బుద్ధి ఎందుకు నిలవడం లేదని ధర్మరాజును వనాలలో ద్రౌపది ఆక్షేపిస్తుంది. తాను ఏదో ఫలాన్ని ఆశించి ధర్మాచరణకు పూనుకోనని ధర్మరాజు చెబుతాడు. స్వర్గాది భోగాల కోసం ధర్మాన్ని ఆశ్రయించడం లేదని స్పష్టం చేస్తాడు. ధర్మం పాటించాలి కనుకనే ధర్మాన్ని ఆశ్రయిస్తున్నానని, ధర్మంతో వ్యాపారం చేసేవాడు నీచుడని, ధర్మం వ్యాపార వస్తువు కాదని అంటాడు’’ అని సామవేదం వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement