పసికందును అనాథను చేసిన ప్రభుత్వ నిర్లక్ష్యం
సాక్షి, రాజమహేంద్రవరం: ‘ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల ఓ బాలింతకు సరైన వైద్య పరీక్షలు అందక ప్రాణాలు విడిచింది. ప్రసూతి సమయంలో డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆమెకు ప్రాణాలు పోయేంత పరిస్థితి ఏర్పడితే, ప్రసవం అనంతరం మరో డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆమె ప్రాణాలే పోయాయి. ఇదే విషయాన్ని స్వయంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ నివేదిక రూపంలో ఇచ్చారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులను చూస్తూంటే.. అసలు ప్రభుత్వం ఉన్నది ప్రజల ప్రాణాలు కాపాడేందుకా.. తీసేందుకా.. అనే అనుమానం కలుగుతోందని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ప్రశ్నించారు. స్థానిక మార్గాని ఎస్టేట్స్‌లోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాలింత మృతి చెందిన రోజునే రాజమహేంద్రవరం నగరంలో ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కోడలు నారా బ్రాహ్మణి వచ్చారని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రి మీద ఉన్న మక్కువ ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ ఆసుపత్రుల మీద లేదని, పేదల ప్రాణాలు పోయినా పెద్దల జేబుల్లోకి డబ్బులు వెళ్లడమే ప్రధాన లక్ష్యంగా కనపడుతోందని దుయ్యబట్టారు. తల్లిని కోల్పోయి అనాథ అయిన పసికందుకు నష్టపరిహారం కింద రూ.కోటి చెల్లించాలని డిమాండ్ చేశారు.
చేనేత సొసైటీలకు
బకాయిలు చెల్లించండి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): చేనేత సహకార సంఘాలకు నూలు సబ్సిడీగా రూ.47 కోట్లు, రుణ మాఫీ కింద రూ.47 కోట్లు, ఇతర పథకాల ద్వారా రూ.175 కోట్లను వెంటనే చెల్లించాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి నేత నల్ల రామారావు చంద్రబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆప్కో బకాయిలు సుమారు రూ.108 కోట్లు వెంటనే చెల్లిస్తే సొసైటీల ద్వారా చేనేత కార్మికులకు పనులు కల్పించడం సాధ్యమవుతుందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 593 చేనేత సొసైటీలు మూత పడ్డాయని, మిగిలిన 448 సొసైటీలపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు పనుల్లేక అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన చెందారు. చేనేత సహకార సంఘాలకు రావాల్సిన రూ.300 కోట్లను ప్రభుత్వం వెంటనే అందజేసి, లక్షలాదిగా ఉన్న కార్మికులను ఆదుకోవాలని కోరారు.
హేమస్మితకు
ఉత్తమ పురస్కారం
దేవరపల్లి: పొగాకు బోర్డు దేవరపల్లి వేలం కేంద్రం నిర్వహణాధికారి పి.హేమస్మితకు ఉత్తర సేవా పురస్కారం లభించింది. 2024–25 పొగాకు అమ్మకాల కాలంలో ట్రేడర్లు, రైతుల మధ్య సమన్వయంతో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఆమె వేలం ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 177 రోజులు వేలం నిర్వహించి 13.18 మిలియన్ కిలోల పొగాకు విక్రయాలు జరిపించారు. ఉత్తర తేలిక నేలల (ఎన్‌ఎల్‌ఎస్) ప్రాంతంలోని ఐదు వేలం కేంద్రాలతో పోల్చితే దేవరపల్లిలో వేలం ప్రక్రియ త్వరితగతిన ముగించారు. టుబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలో దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1, 2 వేలం కేంద్రాలుండగా.. దేవరపల్లిలో కిలో పొగాకుకు అత్యధిక సగటు ధర రూ.311, గరిష్ట ధర రూ.453 పలికింది. ఈ నేపథ్యంలో రైతులకు అండగా నిలబడి ఉత్తమ సేవలందించినందుకు గాను పొగాకు బోర్డు రాష్ట్రంలోని ఐదుగురు వేలం కేంద్రాల నిర్వహణాధికారులకు ఉత్తమ సేవా పురస్కారాలు అందజేసి, సత్కరించింది. గుంటూరులో బుధవారం సాయంత్రం జరిగిన సభలో హేమస్మితకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.విశ్వశ్రీ చేతుల మీదుగా ఈ పురస్కారం అందజేశారు. కార్యక్రమంలో బోర్డు చైర్మన్ సీహెచ్ యశ్వంత్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.
పసికందును అనాథను చేసిన ప్రభుత్వ నిర్లక్ష్యం


