ఎరువు.. కరవు
పెదపూడి: రబీ సాగు చేపట్టిన రైతులకు ఓవైపు సాగునీటి ఇబ్బందులు వెంటాడుతూండగా.. మరోవైపు అదునుకు ఎరువులు లభించని దుస్థితి నెలకొంది. పెదపూడి మండలం కాండ్రేగుల గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) వద్ద ఎరువుల కోసం అన్నదాతలు గురువారం ఇలా పడిగాపులు పడ్డారు. ప్రతి రైతుకు ఒక బస్తా యూరియా, ఒక బస్తా డీఏపీ ఎరువు ఇస్తున్నట్లు పీఏసీఎస్ సిబ్బంది చెప్పారు. దీంతో, అన్నదాతలు సాగు పనులు పక్కన పెట్టి ఉదయాన్నే పీఏసీఎస్ వద్దకు చేరుకున్నారు. సిబ్బంది జాప్యం చేయడంతో మధ్యాహ్నం వరకూ అక్కడే పడిగాపులు కాశారు. చివరకు కొంత మంది రైతులకు ఎరువులు అందలేదు. పీఏసీఎస్‌కు మళ్లీ ఎరువులు వచ్చిన తరువాత ఇస్తామని సిబ్బంది చెప్పడంతో ఆ రైతులు నిరాశగా వెనుదిరిగారు.


