లోకేష్ పర్యటనను అడ్డుకుంటాం
● విద్యారంగ సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారు ● సీపీఐ, పీడీఎస్‌యూ నాయకులు
‘యువగళం’లో కల్లబొల్లి కబుర్లు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలవుతున్నా కనీసం సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించకపోవడం, రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి విడుదల చేయకపోవడం, పీపీపీ విధానం పేరుతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని చూడటం దారుణమని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్ కుమార్ విమర్శించారు. నగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తే విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామంటూ యువగళం పాదయాత్రలో లోకేష్ కల్లబొల్లి కబుర్లు చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ సంక్షేమ హాస్టల్ సొంత భవనాల నిర్మాణానికి ఎక్కడా ఒక్క శిలాఫలకం కూడా వేసిన దాఖలాలు లేవన్నారు. మెస్, కాస్మెటిక్ చార్జీలు పెంచలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ హాస్టళ్లలో పూర్తి స్థాయి మెనూ అమలు చేయడం లేదని, కనీసం సెంట్రల్ జైలు ఖైదీల మాదిరిగా కూడా ఆహారం పెట్టడం లేదని ఆరోపించారు. విద్యా వ్యాపారానికి రెడ్ కార్పెట్ పరిచారని దుయ్యబట్టారు. కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ చేస్తున్నా కనీసం అధికారుల పరిశీలన కూడా లేకుండా పోయిందన్నారు. విద్యాశాఖ మంత్రి తన పని వదిలిపెట్టి పెట్టుబడులు కోసం కొత్త కంపెనీల చుట్టూ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉన్నామని, కొత్త కంపెనీలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించబోమని చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌లు చెప్పుకోవడం తప్ప ఆచరణలో ఏమీ సాధించలేదని కిరణ్ కుమార్ విమర్శించారు. సమావేశంలో కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు కె.భానుప్రసాద్, నగర కార్యదర్శి దినేష్‌బాబు, రాష్ట్ర అధ్యక్షుడు రఫీ తదితరులు పాల్గొన్నారు.
‘పీపీపీ’ని రద్దు చేయాలి
అధికారంలోకి వస్తే 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తామని గత ఎన్నికల ముందే చెప్పి ఉంటే టీడీపీకి డిపాజిట్లు కూడా వచ్చి ఉండేవి కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు విమర్శించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ యత్నాలను నిరసిస్తూ సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ వద్ద నిర్వహించిన ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడారు. పీపీపీ పేరుతో ప్రజారోగ్య రంగాన్ని ఖూనీ చేయడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలోని 10 నూతన వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం గత సెప్టెంబర్ 9న జీఓ నంబర్ 590 జారీ చేయడం తీవ్ర ఆందోళనకరమని అన్నారు. మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పరిధిలోకి తీసుకురావడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ విధానం వల్ల ప్రభుత్వ భూములు, భవనాలు, కాలేజీలు ఆస్పత్రులు దాదాపు 60 ఏళ్ల పాటు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతాయని అన్నారు. ప్రభుత్వాస్పత్రిలో ఉచిత వైద్య సేవలకు 70 శాతం పడకలు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ మిగిలిన 30 శాతం చెల్లింపు పడకల కారణంగా అత్యవసర పరిస్థితుల్లో పేదలకు వైద్యం అందని ప్రమాదం ఉంటుందన్నారు. దీంతోపాటు పేద విద్యార్థులకు వైద్య విద్య సీట్లు దక్కవని అన్నారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరిస్తే ప్రజాగ్రహం ఎదుర్కొనక తప్పదని మధు హెచ్చరించారు. ధర్నాలో సీపీఐ జిల్లా కార్యదర్శి రేఖ భాస్కరరావు, సహాయ కార్యదర్శి కె.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
నగరానికి శుక్రవారం రానున్న విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌కు నిరసన సెగ తగలనుంది. విద్యారంగ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ లోకేష్ పర్యటనను అడ్డుకుంటామని సీపీఐ, పీడీఎస్‌యూ నేతలు రాజమహేంద్రవరంలో గురువారం నిర్వహించిన వేర్వేరు కార్యక్రమాల్లో ప్రకటించారు.
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం)
లోకేష్ పర్యటనను అడ్డుకుంటాం


