వందే మాతరం స్మారక నాణెం సేకరణ
అమలాపురం టౌన్: వందే మాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.150 స్మారక నాణేన్ని విడుదల చేసింది. ఈ నాణేన్ని అమలాపురానికి చెందిన నాణేల సేకరణ కర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ సేకరించారు. భారత స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని చాటి చెప్పేలా, దేశభక్తిని చాటే ఇలాంటి అరుదైన నాణేన్ని తాను సేకరించడం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 32 గ్రాముల బరువుతో ఉండే ఈ నాణేన్ని నికెల్, సిల్వర్ మిశ్రమంతో తయారు చేశారు. నాణేనికి ఓ వైపు రూ.150 ముఖ విలువ, మరో వైపు బ్రిటిష్ సైనికుల అరాచకాలను నిరసిస్తూ భారతీయులు ఏకతాటిపై నిలిచి ‘వంద మాతరం’ అని నినదిస్తున్న చారిత్రాత్మక దృశ్యం ముద్రించారు.
ఆవుకు కవల దూడలు
రాయవరం: సాధారణంగా ఆవుకు లేదా గేదెకు ఒక ఈతలో ఒక దూడ జన్మిస్తుంది. అయితే మండలంలోని లొల్లలో ఆవుకు కవల దూడలు జన్మించాయి. గ్రామానికి చెందిన పాడి రైతు జొన్నగంటి త్రిమూర్తులుకు చెందిన ఆవుకు రెండు పెయ్య దూడలు గురువారం జన్మించాయి. దీంతో రైతు కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెండు దూడలు ఆరోగ్యంగా ఉన్నట్లు రైతు తెలిపాడు.
పత్ర గణపతి!
పెద్దాపురం (సామర్లకోట) : లేత కొబ్బరి ఆకులతో పెద్దాపురం మరిడమ్మ ఆలయ సిబ్బంది తయారు చేసిన వినాయకుడి బొమ్మ ఆకట్టుకుంటోంది. ధనుర్మాసం సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తులు దర్శించుకునేలా దీన్ని తీర్చిదిద్దారు.
వందే మాతరం స్మారక నాణెం సేకరణ


