బీసీ సంక్షేమ కార్యాలయంపై ఏసీబీ దాడి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): లంచం తీసుకుంటూండగా కాకినాడ జిల్లా బీసీ సంక్షేమ అధికారి సహా ముగ్గురిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్ కథనం ప్రకారం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం అడవిపేట గ్రామానికి చెందిన గెద్దాడి చక్రవర్తి తండ్రి అంబేడ్కర్ ఈ ఏడాది జూలై నెలలో చనిపోయారు. ఈ నేపథ్యంలో కుటుంబ పెన్షన్ ఖరారు, కారుణ్య నియామకం కోసం బీసీ వెల్ఫేర్ అధికారులను చక్రవర్తి సంప్రదించగా వారు రూ.లక్ష లంచం డిమాండ్ చేశారు. చివరకు మధ్యవర్తి యాదల సత్యనారాయణ ద్వారా జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఎం లల్లి, సీనియర్ అసిస్టెంట్ కారపు ఎస్‌ఎస్ ప్రసాద్ రూ.60 వేలకు బేరం కుదుర్చుకున్నారు. అయితే, లంచం ఇవ్వడం ఇష్టం లేని చక్రవర్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో మధ్యవర్తి ద్వారా గురువారం రూ.40 వేలు ఇస్తూండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కిషోర్‌కుమార్, సీఐలు భాస్కరరావు, వాసుకృష్ణ, సతీష్ ఆధ్వర్యంలో వారిని అరెస్టు చేశారు. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. వారిని రాజమహేంద్రవరంలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు పరచనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేసినా, అవినీతికి సంబంధించిన సమాచారం ఉన్నా టోల్ ఫ్రీ నంబర్ 1064కు లేదా మొబైల్ నంబర్ 94404 40057కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ కిషోర్ కుమార్ ప్రజలకు సూచించారు.
రెడ్ హ్యాండెండ్‌గా పట్టుబడిన ఇద్దరు ఉద్యోగులు, ఒక దళారి
బీసీ సంక్షేమ కార్యాలయంపై ఏసీబీ దాడి


