టార్గెట్ ఫినిష్.. ఇక కొనేదే.. లే
సీతానగరం: రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజా కొనుగోలు చేస్తామని మంత్రులు గొప్పగా ప్రకటిస్తున్నారు. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. సీతానగరం మండలం వంగలపూడి రైతు సేవా కేంద్రం (ఆర్‌ఎస్‌కే) వద్ద రైతులకు ఎదురైన అనుభవమే దీనికి తాజా ఉదాహరణ. పలువురు రైతులు ఆర్‌ఎస్‌కేకు వెళ్లి తమ వద్ద అమ్మకానికి ధాన్యం సిద్ధంగా ఉందని విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ (వీఏఏ) దృష్టికి తీసుకెళ్లారు. అయితే, తమకిచ్చిన టార్గెట్ అయిపోయిందని, ఇకపై ధాన్యం కొనుగోలు చేయలేమని వీఏఏ బదులిచ్చారు. ఉన్నతాధికారుల నుంచి ఆర్డర్ వచ్చేంత వరకూ ఇకపై ధాన్యం కొనుగోలు చేయడం కుదరదని స్పష్టం చేశారు. దీంతో, రైతులు హతాశులయ్యారు. ఆరుగాలం కష్టపడి పండించి, మద్దతు ధర వస్తుందనే ఉద్దేశంతో ధాన్యం ఆరబెట్టి సిద్ధం చేశామని, తీరా అమ్ముదామని వస్తే టార్గెట్ అయిపోయిందంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందిన కాడికి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి, పెట్టుబడి పెట్టామని, వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందారు. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలుకు ప్రైవేటు వ్యాపారులు ముందుకు రావడం లేదని చెప్పారు. ఆరబెట్టిన ధాన్యం అలాగే ఉందని, టార్పాలిన్లు కప్పి, జాగ్రత్త చేసి ఉంచామని తెలిపారు. మండలానికి 15,836 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ఇచ్చారని, ఇప్పటికే 14,304 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని మండల వ్యసాయాధికారి ఎ.గౌరీదేవి చెప్పారు. పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ద్వారా కొనుగోలు టార్గెట్ ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ మేరకు తహసీల్దార్ శ్రీనివాస్‌తో పాటు తాను కూడా మరో 11,660 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు లిఖిత పూర్వకంగా అనుమతి కోరామని చెప్పారు. రెండు రోజుల్లో మండలానికి కొత్త టార్గెట్ వస్తుందని, రైతులు ఆందోళన చెందనవసరం లేదని తెలిపారు.


