మాతృభాష పరిరక్షణకు శ్రద్ధ తీసుకోవాలి
● మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
● ‘నన్నయ’లో ప్రారంభమైననేషనల్ వర్క్‌షాప్
రాజానగరం: మాతృభాష పరిరక్షణకు పౌరులతోపాటు ప్రభుత్వాలు కూడా శ్రద్ధ తీసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు సూచించారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ‘భారతీయ భాషలలో ఏకరూప శాసీ్త్రయ సాంకేతిక పదజాలం’ అనే అంశంపై రెండురోజులపాటు నిర్వహించే నేషనల్ వర్క్‌షాప్‌ని దీపారాధనతో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నేడు దేశంలో అనేక ఉన్నత స్థానాలలో ఉన్న వారంతా ఒకప్పుడు మాతృభాషలో చదువుకున్న వారేననే విషయాన్ని మరువరాదన్నారు. అమ్మ అనే పిలుపులో ఉండే మాధుర్యం మమ్మీ, డాడీ పదాలలో ఉండవన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృభాషలలోనే చదువుకున్నారన్నారు. మాతృభాషను గౌరవిస్తూ, సోదర భాషలను అవసరాల మేరకు ఉపయోగించుకోవాలన్నారు. మాతృభాషలో మాట్లాడటం నామోషీగా భావించే విష సంస్కృతికి అంతా దూరంగా ఉండాలని హితవు పలికారు. మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా భాషలో ప్రామాణిక పదాల వినియోగం ఉండాలన్నారు. ఆత్రేయపురం పూతరేకు, తాపేశ్వరం కాజా వంటి వాటిని నేటీకి ఆ విధంగానే పిలుస్తున్నామని, వాటికి ఇంకా ఇంగ్లిష్ పేర్లు పెట్టకపోవడం ఆనందించదగిన పరిణామంగా పేర్కొన్నారు.
భాష ఒక జీవనది
వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ మాట్లాడుతూ భాష అనేది ఒక జీవనది వంటిదని, తరాలతోపాటు కాలానుగుణంగా వచ్చే మార్పులకు తగినట్లుగా ముందుకు సాగుతుందన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం, భావజాలాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ఈ సందర్భంగా కొంతమంది రచయితలు రచించిన మూడు పుస్తకాలను వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. భారతీయ భాషా సమితి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ (న్యూఢిల్లీ) సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి కో ఆర్డినేటర్‌గా డాక్టర్ తలారి వాసు వ్యవహరించగా, తెలుగు – సంస్కృత అకాడమీ అధ్యక్షుడు ఆర్‌డీ విల్సన్, తానా పూర్వాధ్యక్షుడు డాక్టర్ తోటకూర ప్రసాద్, భారతీయ భాషా సమితి అకడమిక్స్ కో ఆర్డినేటర్ డాక్టర్ కె.గిరిధరరావు, డాక్టర్ కేవీఎన్‌డీ వరప్రసాద్, పాల్గొన్నారు.


