సెటిల్మెంట్లకు దూరంగా ఉండాలి
నిడదవోలు: పోలీసు స్టేషన్లలో ఎటువంటి సెటిల్మెంట్లూ ఉండకూడదని, వాటికి దూరంగా ఉండాలని, ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి, అవినీతికి పాల్పడే పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ హెచ్చరించారు. ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్, నిడదవోలు సర్కిల్ కార్యాలయాల్లో మంగళవారం ఆయన వార్షిక తనిఖీలు నిర్వహించి, రికార్డులు పరిశీలించారు. క్రైం రేటు, కేసుల పురోగతిపై సమీక్షించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ, నిడదవోలు ప్రాంతంలో చోరీ కేసులు అధికంగా ఉన్నాయని, దీనిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు. దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇల్లు విడిచి, ఊరికి వెళ్లే సమయంలో పోలీసులను ఆశ్రయించి, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్) కెమెరాలను తమ ఇంట్లో అమర్చుకోవాలని సూచించారు. దీని ద్వారా దొంగతనాలను అరికట్టడం సులభమవుతుందన్నారు. దీనిపై గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యాశకు పోయి రకరకాల యాప్‌లు, ఫోన్ ద్వారా వచ్చే ప్రకటనలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఇటీవల పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు మరిన్ని పటిష్ట చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. పండగల నేపథ్యంలో పేకాట, కోడిపందాలు, గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రానున్న రోజుల్లో పోలీసు విభాగంలో మ్యాన్‌పవర్ తగ్గుతుందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నిఘా వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని చెప్పారు. స్టేషన్‌కు వచ్చిన బాధితులకు న్యాయం చేసేలా పోలీసు సిబ్బంది కృషి చేయాలన్నారు. బాధితుల ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న ఫోన్ నంబర్ల ద్వారా ఆయా కేసుల విచారణ అప్‌డేట్‌ను బాధితులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. నిడదవోలు పట్టణంలతో రాత్రి దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలు మరింతగా పెంచాలని సూచించారు. పెరవలి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిడదవోలులో గంజాయి విక్రయదారులందరినీ అరెస్టు చేశామన్నారు. నిడదవోలులో ఒకరిపై పీడీ యాక్ట్ కూడా పెట్టామని ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. కార్యక్రమంలో కొవ్వూరు డీఎస్పీ డి.దేవకుమార్, నిడదవోలు సీఐ పీవీజీ తిలక్, ఎస్సైలు జగన్‌మోహన్‌రాావు, ఎల్.బాలాజీ సుందరరావు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫ అసాంఘిక కార్యకలాపాలపై
ప్రత్యేక నిఘా
ఫ ఎస్పీ నరసింహ కిషోర్


