ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకత్వం
రాజమహేంద్రవరం రూరల్: వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, అంకుర సంస్థలకు మార్గదర్శకత్వం చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్) డైరెక్టర్ వై.మేఘాస్వరూప్ అన్నారు. బొమ్మూరులోని ఆర్‌టీఐహెచ్‌లో స్టార్టప్ ఆలోచనలు కలిగిన ఔత్సాహిక వ్యాపారవేత్తలకు మూడు రోజులపాటు నిర్వహించే స్పార్క్ కార్యక్రమాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పరిశోధక విద్యార్థులు, స్టార్టప్‌లపై ఆసక్తి ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. తొలి రోజు సమస్య నిర్వచనం, కస్టమర్ సెగ్మెంట్ల గుర్తింపు, ప్రాక్టికల్ సొల్యూషన్లపై బ్రెయిన్ స్టార్మింగ్ అంశాలపై చర్చ జరిగింది. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ హక్కులపై విఠల్ కుమార్, ఐడియా జనరేషన్‌పై ఎడ్జ్ వన్ ఇంటర్నేషనల్‌కు చెందిన శ్రీరామ్ కుమార్ రామదేవ్ ప్రత్యేక సెషన్లు నిర్వహించారు. కార్యక్రమంలో నోడల్ అధికారి టి.సూర్యప్రకాశ్, ఆర్‌టీఐహెచ్ రీజినల్ సెంటర్ పరిధిలోని తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి స్టార్టప్ ప్రతినిధులు పాల్గొన్నారు.
బాల్య వివాహాలు వద్దు
సీతానగరం: వరునికి 21 ఏళ్లు, వధువుకు 18 ఏళ్లు నిండకుండా వివాహాలు చేస్తే బాల్య వివాహాల నిషేధ చట్టం–2006 ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తామని జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రొటెక్షన్ ఆఫీసర్ జి.క్రాంతిలాల్ అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డి.చిట్టిబాబు ఆధ్వర్యాన మంగళవారం నిర్వహించిన బాల్యవివాహ నిరోధక అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నైతిక విలువలు లేని పెద్దల చేతిలో పిల్లలు అత్యాచారాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరవై ఏళ్ల వరకూ చదువుకున్న విద్యార్థిని వివాహ జీవితం, బాల్యంలో ప్రేమ పేరుతో జులాయిలను పెళ్లి చేసుకున్న యువతుల జీవితం గురించి కథల రూపంలో వివరించారు. బాల్య వివాహాలు ఎక్కడ జరిగినా సమాచారం ఇవ్వాలని కోరారు. తోటి బాలురతో అతి చనువు వల్ల అపార్థాలు కలిగి జీవితాలు నాశనమవుతాయని, విచక్షణతో, బాధ్యతతో కుటుంబానికి విలువనిస్తూ చదువుకుని, ఆదర్శ సమాజాన్ని నెలకొల్పాలని క్రాంతిలాల్ పిలుపునిచ్చారు. విద్యార్థులతో రాజకీయ శాస్త్ర అధ్యాపకుడు వెంకటేష్ బాల్య వివాహ రహిత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కె.పెదలక్ష్మి, అధ్యాపకులు నాగేశ్వరరావు, ఎం.సుధామయి, వాణి, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.
‘నన్నయ’లో ముగిసిన జాతీయ వర్క్‌షాప్
రాజానగరం: ఆదికవి నడయాడిన నేలపై జాతీ య స్థాయి వర్క్‌షాప్ నిర్వహించే అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉందని ఆదికవి నన్నయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి అన్నారు. ‘భారతీయ భాషలలో ఏకరూ ప శాసీ్త్రయ సాంకేతిక పదజాలం’ అనే అంశంపై వర్సిటీలో నిర్వహించిన రెండు రోజుల నేషనల్ వర్క్‌షాప్ మంగళవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో తానా సాహితీ వేదిక అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ, అందరికీ నిర్భయంగా మాతృభాషలోనే విద్యా బోధన జరిగేలా ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు. భారతీయ సంస్కృతి అకడమిక్స్ కో ఆర్డినేటర్ కె.గిరిధరరావు మాట్లాడుతూ, జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి భారతీయ భాషల్లో పాఠ్య పుస్తకాల రూపకల్పన జరగాలన్నారు. వర్క్‌షాప్‌లో పాల్గొన్న అందరికీ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆచార్య డి.జ్యోతిర్మయి, తెలుగు, సంస్కృత అకాడమీ అధ్యక్షుడు ఆర్‌డీ విల్సన్, భారతీయ భాషా సమితి నిపుణుడు ఆచార్య ఆర్‌ఎస్ సర్రాజు, కో ఆర్డినేటర్ తలారి వాసు పాల్గొన్నారు.
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకత్వం
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకత్వం


