అద్దె ఇల్లు కావాలంటూ పుస్తెల తాడు చోరీ
జగ్గంపేట: ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చిన ఇద్దరు యువకులు యజమానురాలిపై దాడి చేసి బంగారు పుస్తెల తాడు దోచుకుపోయా రు. జగ్గంపేట శ్రీరామ్‌నగర్‌లో పులవర్తి సూపర్ బజారు పక్కనే ఉన్న పైడిపల్లి శ్రీమన్నారాయణ ఇంటి వద్ద ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. శ్రీమన్నారాయణ ఇంటి ముందు ఉన్న టూలెట్ బోర్డును చూసి మంగళవారం మధ్యాహ్నం ఇద్దరు యువకులు అక్కడకు వచ్చారు. ఇల్లు అద్దెకు కావాలని అడగడంతో వారిద్దినీ శ్రీమన్నారాయణ భార్య సుబ్బలక్ష్మి అద్దెకు ఇచ్చే పోర్షన్‌లోకి తీసుకువెళ్లింది. వెంటనే ఆ ఇద్దరు యువకులు కత్తితో ఆమె బెదిరించి, మత్తు మందు స్ప్రే చేశారు. ఆమె మెడలోని మూడు కాసుల విలువైన నల్లపూసలు, పుస్తెల తాడు లాక్కుని పరారయ్యారు. విషయం తెలుసుకున్న జగ్గంపేట ఎస్సై రఘునాథరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమీపంలోని సీసీ పుటేజీలో దొంగతనం రికార్డు అయ్యిందన్నారు. అలాగే స్థానికంగా ఉన్న సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నామని తెలిపారు.


