ఎట్టకేలకు నూతన ఈఓ
అన్నవరం దేవస్థానం
అన్నవరం: దేవదాయ శాఖ రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్‌జేసీ) అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా పూర్తి అదనపు బాధ్యతలతో నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి ఎం.హరి జవహర్‌లాల్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఈఓగా ఉన్న డిప్యూటీ కలెక్టర్ వీర్ల సుబ్బారావును తిరిగి ఆయన మాతృ శాఖ రెవెన్యూలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. సుబ్బారావు గత ఏడాది డిసెంబర్ 14న అన్నవరం దేవస్థానం ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన డిప్యూటేషన్ ఈ నెల 13తో పూర్తి కానుంది. నాలుగు రోజులు ముందుగానే ఆయనకు స్థానచలనం కలిగింది. నూతన ఈఓ త్రినాథరావు బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ పోస్టులో ఆయన నియమితులవడం ఇది నాలుగోసారి. 2019లో జనవరి నుంచి మార్చి వరకూ.. ఆ తరువాత అదే సంవత్సరం ఆగస్టు నుంచి 2022 వరకూ, తిరిగి 2024 నవంబర్ 27 నుంచి డిసెంబర్ 14 వరకూ త్రినాథరావు అన్నవరం దేవస్థానం ఈవోగా పని చేశారు.
ఫలించని ప్రయత్నాలు
కాణిపాకం, శ్రీశైలం దేవస్థానం ఈఓలుగా గత ఏడాది నియమితులైన డిప్యూటీ కలెక్టర్లను మరో ఏడాది కొనసాగిస్తూ ప్రభుత్వం గత నెల 29న ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఇక్కడ మరో ఏడాది కొనసాగేందుకు ప్రస్తుత ఈఓ సుబ్బారావు కూడా ప్రయత్నాలు చేశారు. అయితే, ఆయనను సిఫారసు చేసేందుకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ముందుకు రాలేదు. కనీసం నాలుగు నెలలైనా తనకు అవకాశం ఇవ్వాలని ఆయన వ్యక్తిగతంగా కోరినా ప్రయోజనం లేకపోయిందని అంటున్నారు. ఏడాది కాలంగా దేవస్థానాన్ని ప్రజాప్రతినిధుల చేతిలో పెట్టారన్న విమర్శలు.. పలు వివాదాల నేపథ్యంలో ఆయనను కొనసాగించేందుకు ఉన్నతాధికారులు విముఖత చూపారని చెబుతున్నారు. అన్నవరం దేవస్థానం ఈఓలుగా గతంలో డిప్యూటీ కలెక్టర్లు ఎన్‌వీ శేషగిరిబాబు, ఎస్.సత్యనారాయణ, ప్రసాదం వెంకటేశ్వర్లు, కాకర్ల నాగేశ్వరరావు, జితేంద్ర పని చేసినా పెద్దగా విమర్శలు రాలేదు.
వివాదాస్పద నిర్ణయాలు
గడచిన ఏడాది కాలంగా అన్నవరం దేవస్థానం ఎన్నో వివాదాలకు కేంద్రంగా మారింది. వీటిపై ‘సాక్షి’లో పలు కథనాలు వచ్చాయి.
ఫ దేవస్థానంలో నీటి సమస్య పరిష్కారానికి గాను సత్రాల్లోని ఏసీ గదులు అద్దెకు ఇవ్వొద్దంటూ ఈఓ సుబ్బారావు ఇచ్చిన ఆదేశాలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై దేవదాయ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫ ఈఓ కుమారుని వ్యవహార శైలిపై ఏప్రిల్ 16న ‘చినబాబొచ్చారు బహుపరాక్!’ శీర్షికన ‘సాక్షి’లో వచ్చిన కథనం దేవదాయ శాఖలో తీవ్ర సంచలనం రేపింది.
ఫ తమను ఈఓ వేధిస్తున్నారంటూ పలువురు అధికారులు సెలవు పెట్టడం, కొంతమంది స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేసుకోవడం కలకలం రేపింది. ఈ విషయాన్ని ‘నీ కొలువుకు సెలవు స్వామీ’ శీర్షికన ప్రచురించిన కథనంతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది.
ఫ ఈ అంశాలపై విచారణకు దేవదాయ, ధర్మాదాయ శాఖ అదనపు కమిషనర్ చంద్రకుమార్‌ను కమిషనర్ కె.రామచంద్ర మోహన్ నియమించారు. ఆయన ఏప్రిల్ 23న అన్నవరం వచ్చి, సిబ్బందిని విచారించారు. ఈఓ తమను ఏవిధంగా ఇబ్బంది పెట్టారో సిబ్బంది ఆయన వద్ద ఏకరవు పెట్టారు. ఈ అంశాలను క్రోడీకరిస్తూ చంద్రకుమార్ ఏప్రిల్ 26న కమిషనర్‌కు నివేదిక సమర్పించారు. ‘సాక్షి’ కథనాలు వాస్తవమేనని నిర్ధారించారు. ఈ నివేదిక ఆధారంగా అప్పట్లోనే సుబ్బారావును బదిలీ చేస్తారని అనుకున్నారు. అయితే, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసులతో ఆయన బదిలీ నిలిచిందని అంటారు.
ఫ సిబ్బందితో సఖ్యతగా ఉండాలని, చిన్న చిన్న విషయాలకు కూడా వారితో గొడవ పడొద్దని ఈఓకు సూచిస్తూ జూలై నెలలో కమిషనర్ ఒక మెమో జారీ చేశారు. ఒక ఈఓకు కమిషనర్ మెమో ఇవ్వడం అన్నవరం దేవస్థానం చరిత్రలో అదే ప్రథమం.
ఫ పారిశుధ్య సిబ్బందికి ఆరు నెలలుగా ఏ ఒక్కసారీ సకాలంలో జీతాలు ఇవ్వలేదు. దీనిపై ‘సాక్షి’ కథనాలు ప్రచురించిన అనంతరం స్పందించి, నెలాఖరున చెల్లించారు. దీనినిని కూడా పాలనా వైఫల్యంగా ఉన్నతాధికారులు భావించారు.
ఫ రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అందిస్తున్న సేవలపై ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్‌ఎస్ సర్వేలో అన్నవరం గత ఫిబ్రవరిలో చివరి స్థానంలో నిలిచింది. దీంతో, జిల్లా కలెక్టర్ దేవస్థానంలో తనిఖీలు చేసి, పరిస్థితి చక్కదిద్దారు. ఆ తరువాతి నెలలో ఒకటో స్థానం వచ్చినా తిరిగి ఐదు, ఆరు స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. గత నెలలో కూడా ఆరో ర్యాంకు రావడంతో కలెక్టర్ మళ్లీ సమీక్షించి, పలు ఆదేశాలిచ్చారు.
ఫ సత్యదేవుని ప్రసాదం తయారీలో ఉపయోగించే ఆవు నెయ్యిని గత ఏడాది ఆగస్టు నుంచి సహకార డెయిరీల ద్వారా కొటేషన్‌పై కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఈ ఏడాది జూన్ నుంచి టెండర్ ద్వారా మాత్రమే నెయ్యి కొనుగోలు చేయాలని కమిషనర్ ఆదేశించారు. అయినప్పటికీ గత నెలాఖరు వరకూ కూడా కొటేషన్ పైనే కొనుగోలు చేయడంతో ఈఓపై దేవదాయ శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి, కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫ అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా త్రినాథరావు
ఫ ఈ పోస్టులో నాలుగోసారి ఆయన నియామకం
ఫ నేడు బాధ్యతల స్వీకరణ
ఫ ప్రస్తుత ఈఓ సుబ్బారావు
కొనసాగింపునకు నో
ఫ 4 రోజుల్లో ముగియనున్న
ఆయన డిప్యూటేషన్
ఫ మాతృ శాఖ రెవెన్యూకు రిపోర్ట్
చేయాలని ప్రభుత్వం ఆదేశాలు
ఎట్టకేలకు నూతన ఈఓ
ఎట్టకేలకు నూతన ఈఓ


