సాయి ప్రతిభ.. రికార్డుల మోత
తుని: సృజనాత్మకతతో పాటు కృషి, పట్టుదల ఉంటే ఏదీ అసాధ్యం కాదని ఈ తుని యువకుడు నిరూపించాడు. ఇప్పటికే అతి చిన్న వాషింగ్ మెషీన్ తయారు చేసి గిన్నిస్ రికార్డు సాధించిన అతడు.. అదే స్ఫూర్తితో కుండలు తయారు చేయడానికి ఉపయోగించే అతి చిన్న మోటార్ వీల్‌ను రూపొందించాడు. దీంతో మరోమారు గిన్నీస్ రికార్డు సాధించాడు. తుని పట్టణానికి చెందిన తిరుమలనీడి సాయి కుండల తయారు చేసే అతి చిన్న మోటార్ వీల్‌ను (ద స్మాలెస్ట్ మోటరైజ్డ్ పోటరీ వీల్) రూపొందించాడు. ఈ మేరకు మంగళవారం అతడికి గిన్నీస్ వరల్డ్ బుక్ సంస్థ వరల్డ్ రికార్డు ధ్రువపత్రంతో పాటు లేటెస్ట్ వెర్షన్ గిన్నీస్ బుక్‌ను పంపించింది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన సాయి చిన్నప్పటి నుంచి సైన్స్‌పై మక్కువతో ప్రాజెక్టులు రూపొందించేవాడు. ఈ నేపథ్యంలో అతి చిన్న వాషింగ్ మెషీన్‌ను రూపొందించిన గిన్నీస్‌బుక్‌లో స్థానం సంపాదించాడు. అతి చిన్న మోటార్ వీల్‌ను తయారు చేసి తాజాగా రెండోసారి ఈ ఘటన సాధించాడు.


