క్రీడలతో విభిన్న ప్రతిభావంతుల్లో మనోధైర్యం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల్లో నమ్మకం, ధైర్యం కలిగించడంలో, ప్రతిభను వెలికి తీయడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ కీర్తి అన్నారు. స్థానిక దానవాయిపేటలోని ఎస్‌కేవీటీ స్కూలులో మంగళవారం నిర్వహించిన సీడబ్ల్యూఎస్‌ఎన్ విద్యార్థుల జిల్లా స్థాయి క్రీడా పోటీలను నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. సాయంత్రం జరిగిన బహుమతుల ప్రదానోత్సవంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిన్నారులతో ప్రతిజ్ఞ చేయించి, క్రీడా మైదానంలో వారితో మమేకమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రత్యేక ప్రతిభావంతులైన చిన్నారుల్లో అపారమైన సృజనాత్మకత, ప్రత్యేక కౌశలాలు దాగి ఉన్నాయని అన్నారు. వారికి తగిన అవకాశాలు, సరైన వేదిక కలిగిస్తే ఎటువంటి విజయాలనైనా అందుకుంటారని అన్నారు. క్రీడలతో పాటు చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్నారు. కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ, అవకాశాలు అందుకుని రాణించడం ద్వారా చిన్నారుల ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని చెప్పారు. విజేతలుగా నిలిచిన చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు, ఎస్‌ఎస్‌ఏ పీడీ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.


