కోటి గర్జన
● మెడికల్ కళాశాలల
ప్రైవేటీకరణపై జనం ఆగ్రహం
● కోటి సంతకాల సేకరణకు వైఎస్సార్ సీపీ
అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం
● జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన
● స్వచ్ఛందంగా పాల్గొన్న విద్యార్థులు, ప్రజలు
● ఇప్పటికే తూర్పులో 3.52 లక్షల
సంతకాల సేకరణ
● వేగంగా డిజిటలైజేషన్ ప్రక్రియ
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ నిర్వహిస్తున్న ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు, మేధావుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఉద్యమంలా ప్రారంభమైన సేకరణ ఉప్పెనలా మారింది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తరలివస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోటి సంతకాల సేకరణలో భాగస్వాములవుతున్నారు. లక్ష్యానికి మించి సంతకాలు అవుతున్నాయి.
అలా మొదలైంది...
ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడానికి వ్యతిరేకంగా ‘కోటి సంతకాలు సేకరించాలన్న వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో పార్టీ శ్రేణులు గత అక్టోబర్ నెల 10వ తేదీన జిల్లా వ్యాప్తంగా సంతకాల సేకరణకు నాంది పలికారు. మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు, ప్రజలు ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ర్యాలీలు, ధర్నాలు, అధికారులకు వినతి పత్రాలు అందించే కార్యక్రమాలు చేపట్టారు. పోస్టర్ల ఆవిష్కరణ చేపట్టారు. వైఎస్సార్ సీపీ ఆందోళనలకు ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరైన తమ గళాన్ని చంద్రబాబు ప్రభుత్వానికి వినిపించారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా లెక్కచేయకుండా ఆందోళన బాట పట్టారు. అధికారులకు వినతి పత్రాలు అందించేందుకు సైతం నలుగురిని మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం అనుమతించింది. ఇలా ప్రజా ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు ఎంత ప్రయత్నించినా.. ప్రజలు, వైఎస్సార్ సీపీ శ్రేణులు లెక్క చేయకుండా శాంతియుత నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వెరసి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైంది.
రెండు నెలలుగా అవిశ్రాంత పోరాటం
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ శ్రేణులు, ప్రజలు, విద్యార్థులు రెండు నెలలుగా అలుపెరుగని ఉద్యమం చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు వచ్చింది.
చంద్రబాబు విధానాలపై నిరసన
స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఒకేసారి 17 కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందులో ఐదు కళాశాలల నిర్మాణ పనులు పూర్తయి.. 750 ఎంబీబీఎస్ సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. మరో 12 మెడికల్ కళాశాలలు వివిధ దశల్లో ఉన్నాయి. మరికొన్ని పూర్తి కావచ్చాయి. అప్పట్లో వీటి నిర్మాణం కోసం రూ.8,500 కోట్లు వెచ్చించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం వైఎస్ జగన్‌పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా.. పేదలకు వైద్య విద్య అందకుండా చేస్తోంది. ఇందులో భాగంగా అసంపూర్తిగా ఉన్న మెడికల్ కళాశాలల నిర్మాణాలను గాలికి వదిలేసింది. పీపీపీ విధానం పేరుతో ప్రైవేటుకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. వైఎస్ జగన్‌పై ఉన్న అక్కసుతో మెడికల్ కళాశాలలన్నింటినీ కార్పొరేట్ వ్యక్తులు, సంస్థలకు కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో వైద్య విద్యపై పేద, మధ్య తరగతి విద్యార్థులు పెట్టుకున్న ఆశలను గల్లంతు చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ఉద్యమం ప్రారంభమైంది.
ఉద్యమం సాగుతోందిలా...
వైఎస్సార్ సీపీ కోటి సంతకాల సేకరణ ఉద్యమం నిర్విరామంగా సాగుతోంది. పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో ప్రతి రోజూ సంతకాలు సేకరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 3.60 లక్షల సంతకాలు సేకరించారు.
● రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా 60,000 సంతకాలు సేకరించారు. డిజిటలైజేషన్ ప్రక్రియ సైతం చివరి దశలో ఉంది.
● రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ఆధ్వర్యంలో సంతకాలు సేకరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 45 వేలకు పైగా సంతకాలు సేకరించారు.
● రాజానగరం : నియోజకవర్గంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నేతృత్వంలో సంతకాల సేకరణ ఉత్సాహంగా సాగింది. నియోజకవర్గ వ్యాప్తంగా 60,000 సంతకాలు పూర్తి చేశారు.
● అనపర్తి : వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విస్తృతంగా చేపట్టారు. నియోజకవర్గంలో 60,000 సంతకాలు పూర్తి చేశారు.
● గోపాలపురం: మాజీ మంత్రి, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ఉత్సాహంగా జరుగుతోంది. ఇప్పటి వరకు 42,000 సంతకాలు సేకరించారు.
● కొవ్వూరు: వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు నేతృత్వంలో కోటి సంతకాల సేకరణ నిరంతరాయంగా జరుగుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే 45,000కు పైగా సంతకాల సేకరణ పూర్తయింది.
● నిడదవోలు: వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 40,000కు పైగా సంతకాలు సేకరించారు.
వైద్యం, విద్య వ్యాపారం కాకూడదు
పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. ఇప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాలలను దూరం చేస్తున్నారు. కరోనా సమయంలో ప్రజలు విలవిల్లాడుతున్న తరుణంలో.. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉండాలన్న సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెడికల్ కళాశాలల ఏర్పాటుకు సంకల్పించారు. వైద్యం వ్యాపారం కాకూడదని భావించి నిర్మాణ పనులు ప్రారంభించారు. కళాశాలలన్నీ అందుబాటులోకి వస్తే ఏడాదికి ఒక్కో కళాశాలకు 150 మంది వైద్యులు తయారవుతారు. పదేళ్లలో 23 వేలకు పైగా వైద్యులు రాష్ట్రంలో తయారైతే వైద్య రగంలో చారిత్రాత్మక మార్పులు వస్తాయి.
– మార్గాని భరత్‌రామ్, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ
అన్ని వర్గాల నుంచీ మద్దతు
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఎదురైంది. నిరసనగా వైఎస్సార్ సీపీ చేస్తున్న కోటి సంతకాల సేకరణకు పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు తెలిపారు. జిల్లావ్యాప్తంగా నిర్విరామంగా కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల లక్ష్యాలు పూర్తయ్యాయి. మిగిలినవి సైతం పూర్తి చేస్తాం. సంతకాలు సేకరించిన పత్రాలను జిల్లా పార్టీ కార్యాలయానికి తరలిస్తాం. అనంతరం జిల్లా స్థాయిలో కార్యక్రమం నిర్వహిస్తాం. భారీ స్థాయిలో ర్యాలీలు నిర్వహించి అక్కడి నుంచి విజయవాడ బయలుదేరుతాం. 17న మాజీ సీఎం జగన్‌తో పాటు మరికొంత మంది నేతలు గవర్నర్‌ను కలిసి సంతకాల ప్రతులు అందించనున్నారు.
– చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి
ప్రభుత్వం దిగొచ్చే వరకు ఉద్యమం
వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై చంద్రబాబు ప్రభుత్వం దిగొచ్చే వరకూ ఉద్యమాలు నిర్వహిస్తాం. ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రజాస్వామ్య, శాంతియుత పద్ధతిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రెండు నెలల పాటు కార్యక్రమం నిర్విరామంగా సాగింది. అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు, మేధావుల నుంచి మద్దతు లభించింది. ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఇప్పటికే వైద్యం ఖరీదైంది. మరింత ఖరీదు కాకూడదంటే ప్రభుత్వ వైద్య కళాశాలలు అన్నీ అందుబాటులోకి రావాలి. కూటమి ప్రభుత్వ నిర్ణయం వెనక్కు తీసుకోవాలి. లేదంటే చరిత్రలో పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం చేసిన ఘనత మూటగట్టుకుంటుంది.
–జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ యువజన
విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే
కోటి గర్జన
కోటి గర్జన
కోటి గర్జన


