తాళ్లరేవు: మండల పరిధిలోని పోలేకుర్రు పంచాయతీ సుంకటరేవు గ్రామంలో మూడు కుటుంబాలను వెలి (సామాజిక బహిష్కరణ) వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అదే సామాజిక వర్గానికి చెందిన మూడు కుటుంబాలను గ్రామంలో వెలివేసి శుభ, అశుభ కార్యక్రమాలకు వెళ్లకుండా ఇబ్బందులు పెడుతున్నారని బాధితులు చెబుతున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని బాధితులు శుక్రవారం విలేకరులకు చెప్పారు. సుంకటరేవు గ్రామానికి చెందిన పాలెపు సత్యనారాయణ తన నానమ్మ లక్ష్మమ్మ పేరిట ఉన్న రెండు సెంట్ల భూమిని రామాలయానికి దానం చేశారు.
అయితే ఆ భూమి చెంతనే ఉన్న స్థలంలో కమ్యూనిటీ హాలు కట్టడాన్ని వ్యతిరేకించిన పాలెపు సత్యనారాయణ కుటుంబ సభ్యులతో గ్రామ పెద్దలు మాట్లాడడం మానివేశారు. అంతటితో ఆగకుండా ఏడాది క్రితం సత్యనారాయణ మాతృమూర్తి నూకరత్నం మృతిచెందగా గ్రామస్తులెవరూ వారి ఇంటికి వెళ్లకుండా గ్రామ కట్టుబాటు విధించారు. ఇలా ఉండగా సత్యనారాయణ ఇంట్లో ఇటీవల నూకరత్నం సంవత్సరీకం కార్యక్రమానికి ఎదురుగా ఉన్న తాము వెళ్లామని, ఆ కారణంగా తమను వెలి వేశారని పితాని రమేష్, బుజ్జి తదితరులు విలేకరుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తాము గ్రామంలో ఏదైనా కార్యక్రమానికి వెళ్లాలంటే వేలాది రూపాయలు గ్రామ పెద్దలకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. తాము శుక్రవారం తాళ్లరేవు తహసీల్దార్ పితాని త్రినాథరావును కలసి తమ సమస్యను వివరించామని చెప్పారు. న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.


